వైఎస్సార్‌సీపీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు

ఎన్నికల బూత్‌ సైనికులకు ఐప్యాక్‌ శిక్షణ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు ఈ శిక్షణకు హాజరయ్యారు.


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌స్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ మంగళవారం మంగళగిరిలో ఇచ్చింది. మొదట మూడు ప్రాంతాల్లో నిర్వహిద్దామనుకున్నా సమయంలేని కారణంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా చేయాలో తగిన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఐప్యాక్‌ వారు నిర్వహించారు. ఒక్కో అంశంపై ఒక్కొక్కరు శిక్షణ ఇచ్చారు. ఉదాహరణకు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఓట్లు ఎలా చేర్పించాలి. ముసలి వారి ఓటును ఎలా వినియోగించేలా చేయాలి. ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన అవకాశాలు ఏమిటి? అనే అన్ని రకాల అంశాలపై ఐప్యాక్‌ టీమ్‌లోని సభ్యులు ఒక్కొక్కరుగా వైఎస్సార్‌సీపీ బూత్‌స్థాయి నాయకులు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పలువురు మంత్రులు మాట్లాడారు. సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశమిచ్చారు.



వైఎస్సార్‌ సీపీ సిద్ధం, అంతర్గత భేటీ..
సీఎం జగన్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ.. భీమిలి, ఏలూరు, అనంతపురం వేదికగా నిర్వహించిన సిద్ధం క్యాడర్‌ సమావేశాలు సక్సెస్‌ అయ్యాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాబోయే రోజుల్లో పార్టీ నిర్వహించనున్న పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమాల గురించి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఎన్నికలే లక్ష్యంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శిక్షణ ఇస్తూ సిద్ధం ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్‌ సీపీ భావిస్తోంది.
వ్యూహాలపై సీఎం నిర్థేశం..
ఈ నేపథ్యంలో అధికార వైఎస్సార్‌ సీపీ ఫిబ్రవరి 27న మంగళగిరిలోని సీకే ఫంక్షన్‌ హాల్‌లో సీఎం జగన్‌ అధ్యక్షతన పార్టీ నేతలతో భేటీ కావటం ఆసక్తి రేకెత్తించింది. సిద్ధం ఎన్నికల ప్రచారంలో భాగంగానే వైఎస్సార్‌ సీపీ అంతర్గత సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎం జగన్‌ స్వయంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహలపై పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు. ఎన్నికల్లో బూత్‌ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, మెజారిటీ ఓట్ల సాధనే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం స్వయంగా బుత్‌ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్ర స్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేయడం కొత్తగానే ఉన్నా ఇది వైఎస్సార్‌ సీపీ గెలుపులో కీలక ఘట్టంగా నిలవనుంది. వైఎస్సార్‌ సీపీ రాష్ట్రంలోని 47,000 బూత్‌లలో ప్రతి బూత్‌ కి 15 మంది సభ్యుల బృందాన్ని నియమించి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సిద్ధం సభల ద్వారా ప్రకటించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఒక్క బూత్‌ పరిధిలో పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమాలను నిర్వహించేలా పార్టీ నేతలు, క్యాడర్‌కు శిక్షణ ఇవ్వటం, రాజకీయ వ్యూహాల అమలు, లక్ష్యాలుపై సీఎం జగన్‌ ఈ భేటీలో కూలంకషంగా చర్చించారు.
ఈ సమావేశానికి హాజరైంది వీరే..
ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు/నియోజకవర్గ సమన్వయకర్తలు/ఇంచార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గం, మండలం + బూత్‌ స్థాయి టీమ్‌ లీడ్స్‌.
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం
రాష్ట్ర స్థాయి నేతల నుంచి మండల స్థాయి వరకు ఉన్న కీలకమైన వైఎస్సార్‌ సీపీ నాయకులంతా ప్రజల మధ్య ఉండేలా గడప గడపకు, సిద్ధం కార్యక్రమాలపై దష్టి సారించే విధంగా శిక్షణ ఇచ్చారు.
ఈ పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమాల ద్వారా ప్రతి బూత్‌లో కనీసం 60శాతం ఓట్లను సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ అడుగులు వేస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రచారంలో జగనన్న స్టార్‌ క్యాంపెయినర్స్, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు.
Next Story