అనుకున్నంతా అయింది, అనుమానిస్తున్నట్లే అవుతుందా?

అవును అనుకున్నది జరిగింది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం వాయువేగంతో అమలులోకి వచ్చింది.


అనుకున్నంతా అయింది, అనుమానిస్తున్నట్లే అవుతుందా?
x
YS Sharmila Reddy

అంతా కాంగ్రెస్‌ మంచికేనని కాంగ్రెస్‌ వాదులు అంటుంటే, ఈ సముద్ర హోరులో ఏపార్టీ మునుగుతుందోననే అందోళన అన్ని పార్టీల్లోనూ ఉంది. అన్నా చెల్లెలు మధ్య పోరు తప్పనిసరి పరిస్థితైంది. కాంగ్రెస్‌ పార్టీలోకి ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ వారే వస్తారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో ఎక్కువ మంది అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలకు వాక్‌ స్వాతంత్య్రం లేకుండా పోయింది. మంత్రులు కూడా మాట్లాడేందుకు వీలు లేదు. ఎవరిని మాట్లాడమంటే వారు మాత్రమే మీడియా ముందు మాట్లాడాలి. ఒంటెత్తు పోకడలతో వైఎస్సార్‌సీపీలో ఉగ్గబట్టుకుని ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారని కాంగ్రెస్‌ వారు అంటున్నారు. వైఎస్సార్‌కు నమ్మిన బంట్లుగా ఉన్న వారు ఎక్కువ మంది కాంగ్రెస్‌లో చేరుతారు. కాంగ్రెస్‌ నేషనల్‌ పార్టీ. ఇందులో వాక్‌ స్వాతంత్య్రమే కాదు స్వేచ్ఛ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటి వరకు అలాగే పార్టీ నడిచింది. ఇక ముందు కూడా అలాగే నడుస్తుందనే అభిప్రాయంలో చాలా మంది నాయకులు ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో కనీసం నలుగురైనా అసెంబ్లీలో అడుగు పెడతారనే నమ్మకాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తం చేస్తోంది. పైగా తమ ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయికి చేరుతాయని నాయకులు చెబుతున్నారు. షర్మిల వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తుందని, ఆమె కూడా తన గళం అసెంబ్లీలో వినిస్తుందని కాంగ్రెస్‌ వారు ధీమాతో ఉన్నారు.
పూర్వ వైభవం తెస్తా: షర్మిల
కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా. నిబద్ధతతో, చిత్త శుద్ధితో పార్టీని పునర్నిర్మించటానికి నమ్మకంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నా. మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు నా అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో ఉన్న కాంగ్రెస్‌ సైనికులతో కలిసి పనిచేస్తా. గిడుగు రుద్రరాజు, రాష్ట్రంలోని పార్టీ వారితో కలిసి పనిచేస్తూ వారి నైపుణ్యాన్ని, అనుభవాన్ని తీసుకుని నిర్థేశిత లక్ష్యాలు సాధిస్తానని ట్విటర్‌ అకౌంట్‌లో వైఎస్‌ షర్మిల రెడ్డి పేర్కొన్నారు.


Next Story