‘ప్రజారోగ్యానికి కూటమి ఉరితాడు’.. చంద్రబాబుపై జగన్ ఫోకస్..
x

‘ప్రజారోగ్యానికి కూటమి ఉరితాడు’.. చంద్రబాబుపై జగన్ ఫోకస్..

సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది.


సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజారోగ్య రంగానికి మీ ప్రభుత్వం ఉరితాడు బిగుస్తోంది. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోంది. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారు. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్‌ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. దీంట్లో భాగంగా విలేజ్-వార్డు క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108,104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలు, చికిత్స కాలంలో కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టాం. ఆస్పత్రుల్లో నాడు-నేడు, కొత్త మెడికల్‌ కాలేజీలకోసం రూ.16,880 కోట్లతో పనులు చేపట్టాం. ఇవన్నీ చివరిదశకు వచ్చాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని రూ.8,480 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టాం.

పటిష్టమైన ప్రణాళిక వల్ల 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయి. తద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో మరో ఐదు చోట్ల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. అన్ని వసతులూ ఉన్నా, చంద్రబాబూ… మీ వైఖరి కారణంగా వీటికి గ్రహణం పట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారు. ఇది మీ వైఫల్యంకాదా? ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండాపోయాయి. దీంతోపాటు కొత్తకాలేజీల్లో మెడికల్‌ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్‌కోటాలో భర్తీచేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారు.

మెడికల్‌ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి, సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారు. PPPP మోడల్‌ అంటూ ప్రయివేటు కోసం, ప్రయివేటు కొరకు, ప్రయివేటు చేత, ప్రయివేటు వల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్యరంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితిని తీసుకు వస్తున్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోండి. ప్రయివేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగం ఉన్నప్పుడే, ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయి. వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను. మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదలచేస్తూ ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసే దిశగా అడుగులు వేయండి. మీ మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరుతున్నాను.

Read More
Next Story