త్రిమూర్తీ.. మీ పార్టీ వాళ్లు మా  ఇంటికి రావొద్దండీ!  ముద్రగడ..దారెటు?
x

త్రిమూర్తీ.. మీ పార్టీ వాళ్లు మా ఇంటికి రావొద్దండీ! ముద్రగడ..దారెటు?

ముద్రగడ.. ఈ పేరే ఓ సంచలనం. ఆయన ఏ నిమిషంలో ఏమి చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. మొన్న వైసీపీ, నిన్న టీడీపీ, ఇవాళ జనసేన నేతల వరుస కలయికలు.. ఏమవుతుందో మరి?


“జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారం రోజుల కిందట కాపు పెద్దలకు రాసిన బహిరంగ లేఖ బాగానే పని చేసింది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లనే పునరాలోచనలో పడేసిందంటే.. ఇంకా చాలామంది పెద్దలపై కూడా పని చేసి ఉండవచ్చు” అన్నారు కాపు ఉద్యమ నాయకుడు సమ్మెట ప్రసాద్. ఇప్పుడది నిజమనే అనిపిస్తోంది. కొందరు కాపులను వైసీపీ కావాలనే రెచ్చగొడుతోందని, వారి ఉచ్చులో పడొద్దని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇటీవల బహిరంగ లేఖ రాశారు. “కాపు పెద్దలు తిట్టినా దీవెనలుగానే తీసుకుంటా. నాయకులు ఎవరొచ్చినా గుమ్మాలు తెరిచే ఉంటాయని” పవన్ కల్యాణ్ తన లేఖలో రాశారు. దీనిపై ముద్రగడ చాలా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాపుల్ని చీల్చేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తూనే ఉంది. ఎవరైనా కాపు నాయకులు విమర్శించే వైసీపీలోని కాపు నాయకులతో ప్రతి విమర్శలు చేయిస్తోంది. పవన్ ను, ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఈ దశలో పవన్ కల్యాణ్ లేఖాస్త్రాన్ని సంధించారు. దీనికి ముద్రగడ ఎక్కడో కనెక్ట్ అయ్యారు. దీన్ని అవకాశంగా అందిపుచ్చుకున్న జనసేన, ఇతర కాపు నాయకులు ఆయన్ను జనసేన పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేశారు. ముద్రగడ నివాసానికి వెళ్లి చర్చించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ‘పవన్‌కల్యాణ్‌కు ఇవ్వాలని ఓ లేఖ’ రాసి జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఇచ్చారు. ఈ లేఖపై పవన్‌కల్యాణ్‌ స్పందనను బట్టి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల్లో పవన్‌, ముద్రగడలు భేటీ కావచ్చనని భావిస్తున్నారు.

జగన్ తో మనకు కుదరదు లేండీ...


కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇన్నాళ్లూ వైసీపీలో చేరతారనే ప్రచారం సాగింది. తాజా పరిణామాలతో వైసీపీతో దోస్తానా కట్ అయినట్టే. ఆయన జనసేన వైపే మొగ్గుచూపుతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌, అమలాపురానికి చెందిన కాపు ఐక్య కార్యాచరణ సమితీ నాయకుడు కల్వకొలను తాతాజీ, ఇతర ముఖ్య నాయకులు బుధవారం రాత్రి ముద్రగడ నివాసానికి వెళ్లి రెండు గంటలకు పైగా చర్చలు సాగించారు. గురువారం ఉదయం టీడీపీకి చెందిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మరికొందరు నాయకులూ కలిశారు. ఈ కలయికకు పెద్దగా ప్రాధాన్యత లేదని జ్యోతుల నెహ్రూ చెబుతున్నారు. “జగ్గంపేట మండలం ఇరిపాకలో కోటి శివలింగార్చనకు ముద్రగడను ఆహ్వానించడానికే వెళ్లా. హైకమాండ్‌ తనను పంపలేదు” అని జ్యోతుల నెహ్రూ చెప్పినా కొన్నేళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న వీరిద్దరూ కలవడమే పెద్ద రాజకీయ పరిణామం. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నానని సహకారం ఇవ్వాలని కోరితే అందుకు ముద్రగడ హామీ ఇచ్చారని నెహ్రూ అంటున్నారు.

త్రిమూర్తులూ.. మీరు రావొద్దు...


జనసేన, టీడీపీ, ఇతర కాపు నేతలు వరుసగా ముద్రగడతో భేటీ కావడంతో వైసీపీ అప్రమత్తమైనా ఫలితం లేకపోయింది. నేరుగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడకు ఫోన్‌చేసి మీ ఇంటికి వస్తానని చెప్పగా.. ‘రావద్దు.. మీ పని మీరు చూసుకోండి.. మీ పార్టీలో చేరే ఉద్దేశం లేదు’ అని ముద్రగడ చెప్పేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తాజా పరిణామాలపై ముద్రగడ గానీ, ఆయన కుమారుడుగానీ అధికారికంగా స్పందించలేదు.

చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా...


వాస్తవానికి ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాలకు కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. కాపు రిజర్వేషన్లు ఇవ్వనని సాక్షాత్తు జగన్ కాపులు ఎక్కువగా ఉండే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలోనే చెప్పినా, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం అయినా ముద్రగడ ఏరోజూ నోరు విప్పలేదు. సరికదా.. ప్రశ్నించిన టీడీపీపైనే తిరిగి విమర్శలు చేస్తూ లేఖాస్త్రాలు సంధించేవారు. ఈ నేపథ్యంలో పూర్తి వైసీపీ నేతగా ముద్రగడ చలామణీ అవుతున్నారంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ముద్రగడ కొంత ఆసక్తిగా ఉన్నారు. తనతోపాటు తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాలని ఉవ్విళ్లూరుతున్నారు. వైసీపీ సైతం ఆసక్తి చూపించింది.

ద్వారంపూడి మంత్రమూ పని చేయలేదా?

టీడీపీ, జనసేన ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత బలంగా ఉన్నందున టీడీపీ కూటమి వైపు కాపు సామాజికవర్గ ఓట్లు మళ్లకుండా కొంతైనా చీలిక తెచ్చేందుకు జగన్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు ముద్రగడను పార్టీలో అధికారికంగా చేర్చుకుని ఎక్కడో చోట సీటు ఇవ్వాలని భావించారు. జగన్‌ సన్నిహితుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తరచూ ముద్రగడతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఆయన తనయుడికి కాకినాడ ఎంపీ టికెట్‌ ఇప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. ముద్రగడ సైతం జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట సీట్లలో ఎక్కడో చోట పోటీ చేయడానికి సానుకూలత చూపారు. ఈలోపు జగన్‌ అక్కడ సిటింగ్‌ ఎమ్మెల్యేలను తప్పించి కొత్త ఇన్‌చార్జులను ప్రకటించారు. దీంతో ముద్రగడ మనస్తాపం చెందారు.

నా ఇంటికి వైసీపీ వాళ్లు రావొద్దు!

తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ జిల్లా పరిశీలకుడు మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు.. ముద్రగడతో చర్చించడానికి సిద్ధమయ్యారు. కానీ ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. వైసీపీ నుంచి ఎవరూ తన ఇంటికి రావద్దని ఘాటుగానే చెప్పినట్లు సమాచారం. ఆయన ఆ పార్టీపై కోపంగా ఉండడానికి కారణముంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ పోటీ చేసినా ఫలితం ఉండదని వైసీపీ పెద్దలు వ్యాఖ్యానించడంతో ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story