కొడుకుని చూసి ప్రత్తిపాటి పుల్లారావు కన్నీళ్లేందుకు పెట్టుకున్నారంటే..
తమ కుమారుడు శరత్ కు బెయిల్ రావడంపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హర్షం వ్యక్తం చేస్తూనే ఒకింత చలించారు..
మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై శరత్ ను ఇటీవల మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు శరత్ కు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేసింది.
అంతకుముందు ఏమి జరిగిందంటే...
జీఎస్టీ ఎగవేతకు, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్లారావు భార్య, కుమారుడు శరత్ బాబు, బావమరిది సహా ఏడుగురిపై విజయవాడలోని మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పుల్లారావు కుమారుడు అరెస్ట్ అయ్యారు. శరత్ ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అయిన డీజీడీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్).. అవెక్సా కార్పొరేషన్‌లో తనిఖీలు చేసి, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. రూ. 16 కోట్లు ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలని 2022 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. ఆ నోటీసు ఆధారంగా 2024 మార్చిలో అరెస్ట్ చేశారు.
అవెక్సా కార్పొరేషన్ తరఫున ఏపీలోని విజయనగరంలో ఏర్పాటైన బ్రాంచి ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేంద్రం జారీ చేసిన నోటీసు ఆధారంగా రాష్ట్రంలోనూ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ విచారణ నిర్వహించాలని మాచవరం పోలీసులకు రాష్ట్ర డీఆర్‌ఐ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కేంద్ర సంస్థ జారీ చేసిన నోటీసును జతచేశారు.
శరత్ అరెస్ట్ ను ఖండించిన టీడీపీ నేతలు...
శరత్‌బాబు ఆ సంస్థకు అదనపు డైరెక్టర్‌గా రెండు నెలలు కూడా లేరని, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే శరత్‌ను అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. నిర్మాణ పనులకు సంబంధించి బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ నుంచి అవెక్సా కార్పొరేషన్ సబ్‌కాంట్రాక్టులు పొందింది. 2017లో రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ ఎన్ 9 (ఉద్దండరాయునిపాలెం నుంచి నిడమర్రు) రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్ట్ కు తీసుకుంది.
పోలీసు కస్టడీకి నో అన్న కోర్టు..
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను తమ కస్టడీకి ఇవ్వాలన్న విజయవాడ పోలీసుల వాదనను కోర్టు తోసిపుచ్చింది. మాచవరం పోలీసులు ఈమేరకు విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టులో దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది. జీఎస్టీ ఎగవేత, బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు మళ్లించారనే ఆరోపణలతో నమోదైన కేసులో నిందితుడు శరత్‌ను మరింత లోతుగా విచారించడానికి 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గతంలో పిటిషన్ వేశారు.
కన్నీరు పెట్టుకున్న ప్రత్తిపాటి...
తమ కుమారుడు శరత్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని, తనపై కక్ష సాధించేందుకే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ అరెస్ట్ కు పాల్పడినట్టు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కన్నీరు పెట్టుకున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్న ప్రత్తిపాటి ఈ వ్యవహారమై కోర్టులో న్యాయపోరాటం చేస్తానని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో శరత్ కి బెయిల్ దొరికింది. దీనిపై పై కోర్టుకు అప్పీల్ చేస్తామని మాచవరం పోలీసులు చెప్పారు.