వంశీ భార్య పంకజశ్రీ, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు, వంశీ తరపున లాయర్లు విజయవాడ కృష్ణలంకకు చేరుకున్నారు.
తన భర్త మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఎందుకు అరెస్టు చేశారో చెప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. లోపలకు వెళ్లి తన భర్తను కలుద్దామంటే పోలీసులు అడ్డుకుంటున్నారని, లోపల ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని.. ఏ కేసులో అరెస్టు చేశారు.. అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్ కాపీని అడిగితే ఇవ్వడం లేదని పంకజశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వల్లభనేని అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణ పేరుతో లోపలకు తీసుకెళ్లారు. సమాచారం అందుకుకున్న వంశీ భార్య పంకజశ్రీ నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావుతో కలిసి కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు.
తనను లోపలకు వెళ్లనివ్వాలని, తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో..లోపల ఆయనను ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులను కోరారు. అందుకు పోలీసులు ఆమెను లోపలకు వెళ్లేందుకు అనుమతించకుండా నిరాకరించారు. ఈ నేపథ్యంలో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పంకజశ్రీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వంశీ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని, లోపలికి అనుమంతించాలని కోరినా పోలీసులు నిరాకరించారు.
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ.. వంశీని టీడీపీ టార్గెట్ చేసిందని, లోకేష్ చెప్పడం వల్లే వంశీ మీద అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వంశీని అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.
వంశీ తరపున న్యాయవాదులు మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు నిబంధనలను పోలీసులు పాటించడం లేదని మండిపడ్డారు. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని, ఇది చెల్లదని.. కావాలనే అరెస్టు చేశారని అన్నారు. ఏమి కేసులు పెట్టారో తెలియడం లేదని, పోలీసు స్టేషన్‌లో వంశీ లేరని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. వంశీ మీద ఎవరు ఫిర్యాదులు చేశారు? ఎందుకు అరెస్టు చేశారు అనేది పోలీసులు చెప్పడం లేదన్నారు.
Next Story