రామచంద్రా, జగన్ చేసిన నేరము ఏమీ? అంతటి మాట అననేమీ?
x

'రామచంద్రా', జగన్ చేసిన నేరము ఏమీ? అంతటి మాట అననేమీ?

వైసీపీలో నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న సి.రామచంద్రయ్య ఆగ్రహోదగ్రుడయ్యారు. జగన్ ను నానామాటలన్నారెందుకు?


వైఎస్‌ జగన్‌పై ప్రేమతో ఆ పార్టీలో చేరి శాసనమండలి సభ్యుడైన సీ రామచంద్రయ్య ప్రస్తుతం ఆపార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పైన, ఆయన సొంతమీడియాపైన విరుచుకుపడ్డారు. శృతి మించి సొంత డబ్బాకొట్టుకుంటున్నారంటూ పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి శాసనమండలి సభ్యత్వాన్ని పొగొట్టుకున్న సి.రామచంద్రయ్య ఇటీవల టీడీపీలో చేరారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ పై ముప్పేటదాడి చేస్తున్నారు. తాజాగా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే..

‘‘అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంత మీడియా సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైంది. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ. అధికార పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో కాబోలు సొంత ఛానెల్లో ఓ కార్యక్రమం మొదలు పెట్టారు. సూటు బూటు ధరించిన ఇద్దరు యాంకర్లు, వారికెదురుగా ప్రభుత్వ పథకాలు అందుకున్న కొందరు లబ్ధిదారులు ఉంటారు. యాంకర్లు తామే వారికి సగం జవాబులు అందిస్తూ ప్రశ్నలు వేస్తుంటారు. ‘‘చెప్పండి సుబ్బారావు గారూ.. ఈ ఐదేళ్లల్లో జగన్‌ గారి వల్ల మీరు ఏవిధంగా లబ్ధిపొందారు. మీ జీవన ప్రమాణాలు ఏవిధంగా పెరిగాయో వివరిస్తారా? ‘సీనియర్‌ యాంకర్‌ ప్రశ్న.
సదరు సుబ్బారావు గారు ‘‘నాకిద్దరు కొడుకులండి.. పెద్దవాడు బీకాం కంప్యూటర్స్, ఐదేళ్లుగా గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. రెండోవాడు ఎంబీఏ చేసి రెండేళ్లయింది. జగన్‌ గారి పుణ్యమా అని రెండోవాడు కూడా వాలంటీర్‌గా జాయిన్‌ అయ్యాడండీ.. ఇప్పుడు మాకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మా కుటుంబం హాయిగా బ్రతుకుతోందండి’’ అంటూ అతను తన్మయత్వంతో చెబుతుంటే.. జూనియర్‌ యాంకర్‌ మెడలోని ’టై’ని సరిచేసుకొంటూ ‘‘ఈ సంగతి ఆ ప్రతిపక్షం వాళ్లకు వినబడేట్టు గట్టిగా చెప్పండి.. తెల్లారి లేస్తే జగన్‌ గారి మీద పడి ఏడుస్తుంటారు‘ అని ముక్తాయింపు ఇస్తాడు.
ఇదొక్క ఉదాహరణ చాలు.. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో చదువుకొన్న యువత భవితవ్యం ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి. లక్షల్లో యువతకు ఉద్యోగాలు కల్పించామని అధికార పార్టీ వేసుకొంటున్న దండోరా వెనుకనున్న అసలు నిజం ఏమిటో తెలుసుకునేందుకు ఇది మంచి ఉదాహరణే. కంప్యూటర్‌ పట్టభద్రులు, ఉన్నత చదువులు చదువుకొన్న యువతకు రాష్ట్రంలో వాలంటీర్ను మించిన ఉద్యోగాలు లభించడం లేదన్నది ఓ చేదు వాస్తవం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనప్పుడు యువత మాత్రం ఏం చేస్తుంది? నెలకు నాలుగైదు వేల రూపాయల జీతంతో ఉద్యోగాల్లో చేరిన యువత భవిష్యత్‌ ఏమిటి? సిగ్గును దాచుకోవడానికి ఫిగీఫ్‌ (ఆకు)ను ఆడమ్, ఈవ్లు కప్పుకొన్నట్లుగా అనివార్యంగా చిరుద్యోగం కంటే తక్కువ ఉద్యోగాలు చేపట్టిన యువతకు చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి, లభిస్తున్న జీతానికి ఎక్కడా పొంతన లేదు? ఈ లెక్కన వారు జీవితంలో ఎప్పటికి స్థిరపడగలరు?’’ అని ప్రశ్నించారు రామచంద్రయ్య.
2023 నాటికి పెరిగిన నిరుద్యోగం...
‘‘సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సి.ఎం.ఇ.వై) నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019 ఏప్రిల్‌ నాటికి 4 శాతంగా ఉన్న నిరుద్యోగిత 2023 డిసెంబర్‌ నాటికి 6.6 శాతానికి పెరిగింది. ఇదే నివేదిక ప్రకారం రాష్ట్రంలో నిరుద్యోగ పట్టభద్రులు 35.14శాతంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ (పిఎల్‌ఎఫ్‌ఎస్‌) నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్‌ నిరుద్యోగ రేటులో దేశంలో తెలంగాణది 9వ స్థానం కాగా, ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానం. అంటే వెనుకబడిన రాష్ట్రాలుగా పేరు పొందిన బీహార్, ఒడిశా, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాలలో కంటే ఏపీలో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఉన్నారని అర్థమవుతోంది.
అధికారంలోకి రాగానే వెంటనే 2.30లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రతియేటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామంటూ ఎన్నికల ముందు వైఎస్‌ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు నమ్మకంగా చెప్పారు. ఇదే హామీని మేనిఫెస్టోలో చేర్చారు. సోషల్‌ మీడియాలో దీనిపై చాలా రోజులుగా ‘జగన్‌ జనవరి 1న నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వడం లేదు గానీ సాక్షి క్యాలెండర్‌ ఇస్తున్నారు’’ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు.
నిజానికి దేశంలో అద్భుతమైన సహజ వనరులు, చురుకైన మానవ వనరులు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు పేరుంది. రాష్ట్రం నుంచి ప్రతియేటా జాతీయ స్థాయిలో ఉత్తమ విద్యా ర్యాంకులు పొందే యువత సంఖ్య గణనీయంగా ఉంది. ముఖ్యంగా ఐటీ–బీపీవో రంగం ఇప్పటికీ యువతకు పెద్దపీట వేస్తోంది. లక్షల సంఖ్యలో ఈ రంగం యువతకు ఉద్యోగాలు కల్పిస్తోంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
జగన్‌ రాకడే విశాఖపట్నానికి ముప్పు..
చంద్రబాబు చేపట్టిన చర్యల వల్ల హైదరాబాద్‌కి సమాంతరంగా విశాఖపట్నం ఐటీ రంగంలో ఎదుగుతోందని అనుకొంటున్న సమయంలోనే 2019లో జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడంతో ఈ పరిస్థితి మొత్తం తలకిందులయ్యింది. ప్రతియేటా 70వేల మందికి హైఎండ్‌ నైపుణ్యాలు అందించే కేంద్రాలు మూతపడటంతో.. యువతకు లభించాల్సిన ఉద్యోగాలు దక్కకుండాపోయాయి. జగన్‌ ప్రభుత్వ ఒంటెత్తు పోకడలు యువతకు శాపంగా మారగా, పొరుగునున్న తెలంగాణ రాష్ట్రం నెత్తిన పాలు పోసినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన అనుకూల విధానాలతో అక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగుల సంఖ్య 9లక్షలకు చేరింది. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే, గణాంకాలు వెల్లడించే వారేలేరు.
మెగా డీఎస్సీ ఎక్కడ జగన్‌?
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా 2014–19 మధ్య ఖాళీగా ఉన్న 18వేల మంది టీచర్‌ పోస్టులను భర్తీ చేయగా, ప్రతియేటా మెగా డీఎస్సీ అని చెప్పిన జగన్మోహన్రెడ్డి.. చివరి ఏడాదిలో మాత్రమే 6వేల టీచర్ల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగార్థులను మోసం చేశారు. ఇక, నిరుద్యోగులకు ఇస్తానన్న భతిగానీ, ప్రభుత్వ పనుల్లో, కాంట్రాక్టులలో నిరుద్యోగ యువతకు భాగస్వామ్యం కల్పిస్తామనే మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. పారదర్శకంగా, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సర్వీస్‌ కమీషన్ను ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి, తగిన అర్హతలు లేని వారిని సభ్యులుగా చేసి దాని ప్రతిష్టను దిగజార్చారు. సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగాలు రాక 21,573 చనిపోయారా?
ఉద్యోగాలు, ఉపాధి లేని యువత నైరాశ్యంలో మునిగిపోయి పెడమార్గం పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2020–2023 మధ్య 3ఏళ్ల కాలంలో 21,575 మంది యువత ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలకు పాల్పడినట్లు సాక్షాత్తు కేంద్ర కార్మిక మంత్రి రామేశ్వర్‌ పార్లమెంట్లో వెల్లడించారు. అదేవిధంగా ఈ ఐదేళ్లల్లో గంజాయి అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచినట్లు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో నివేదిక స్పష్టం చేసింది. ఎక్కడైతే మత్తు పదార్థాల లభ్యత ఎక్కువుగా ఉంటుందో, అక్కడ మార్కెట్‌ విస్తరిస్తుందని, పీర్‌ ఇంపాక్టస్‌ (ప్రభావం) ఎక్కువగా ఉంటుందని, అలాగే మాదక ద్రవ్యాల సరఫరా మాఫియాలు సదరు ప్రాంతాన్ని హబ్‌ మార్చుకుంటాయని నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. కానీ, ఈ సమస్యపై జగన్‌ ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇంకోపక్క రాష్ట్రంలో నాసిరకం ‘మద్యం’ సరఫరా చేస్తుండటం వల్ల అది యువత పాలిట స్లోపాయిజన్గా పనిచేస్తూ వారి ఆరోగ్యాల్ని దెబ్బతీస్తోంది. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని, లేదంటే.. ఎన్నికల్లో ఓట్లే అడగనని చెప్పిన జగన్మోహన్రెడ్డి ఈ ఐదేళ్లల్లో మద్యం ధరల్ని పెంచి ’జె’ బ్రాండ్‌ మద్యంతో సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
యమకింకరుడా జగన్‌?
ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా యువత సంఖ్య అధికంగా ఉంటే దానిని ’డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌’గా చెప్పుకొంటారు. అంటే, యువత సంఖ్య ఎక్కువగా ఉండటం ఏ రాష్ట్రానికైనా అనుకూల అంశం. కానీ, జగన్‌ అధికారంలో ఉండటం రాష్ట్ర యువతకు ’ప్రతికూల అంశం’గా పరిణమించింది. ఈ భయానకమైన వర్తమానాన్ని వీడి ఇకపై అందమైన భవిష్యత్తును పునర్‌ నిర్మించుకోవాలంటే రాష్ట్రంలోని యువత.. తమ పాలిట యమకింకరుడిగా మారిన పాలకుణ్ణి వదిలించుకోవాల్సిందే’’ అన్నారు సి.రామచంద్రయ్య.


Read More
Next Story