కొణతాలా.. ఇదేమైనా గిట్టుబాటయ్యేనా?
కొణతాల రామకృష్ణ.. వైస్సార్ అనుంగు శిష్యుడు, ఆ తర్వాత జగన్ కు సన్నిహితుడు. ఈమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇప్పుడేమో ఉత్తరాంధ్రే ప్రాణం అంటున్నారు
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారు ప్రత్యేకించి ప్రత్యక్ష రాజకీయాల్లో దిగాలనుకునే వారు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అప్పటి వరకు కనిపించని సమస్యలన్నీ రాజకీయ తెరపైకి వస్తాయి. చర్చా గోష్టులు నడుస్తాయి. ప్రతిపక్షంలో ఉండే వాళ్లైతే ఇంకో అడుగు ముందుకు వేసి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ఏ ప్రయత్నాన్నీ వదలరు. సరిగ్గా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇప్పుడదే చేశారు. ఉత్తరాంధ్రకు అటు టీడీపీ ప్రభుత్వమైనా ఇటు వైసీపీ ప్రభుత్వమైనా ఈ పదేళ్లలో ఏమి చేసిందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. అంతటితో ఆగకుండా తన సంస్థ ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరఫున ఆర్టీఐ అస్త్రాన్ని ప్రయోగించారు.
నాకీ సమాచారం కావాలి సర్..
ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు కొణతాల రామకృష్ణ రాష్ట్రప్రభుత్వంపై ఆర్టీఐ అస్త్రాన్ని సంధించారు. ఉత్తరాంధ్ర ప్రధాన సమస్యలపై ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖ నుంచి సమాచారాన్ని కోరుతూ ఆర్టీఐ దరఖాస్తులను పంపారు.
ఈ 16 అంశాలపై తక్షణమే స్పందించాలన్న కొణతాల...!
రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 16 ప్రశ్నలను ఆయన సంధించారు. వచ్చే ఎన్నికల్లో వాటిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు కొణతాల.
1.)ఉత్తరాంధ్రలోని 2014 నుండి 2023 వరకు వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన బడ్జెట్ ఎంత, ఖర్చు చేసింది ఎంత?
2) ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 1 జూన్ 2019 నుంచి 10 ఫిబ్రవరి 2024 వరకు నిర్వహించిన సమీక్షా సమావేశాలు, సమావేశాల మినిట్స్ వివరాలు ఇవ్వాలి.
3) 2019 లో ఉత్తరాంధ్రలో సాగులో ఉన్న మెట్ట, మాగాణి, పంటభూమి ఎంత? 2024 నాటికి సాగుచేస్తున్న పంట భూమి ఎంత?
4) 2019 లో ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో మెట్ట, మాగాణి కింద సాగవుతున్న భూమి ఎంత? ప్రస్తుతం 2024 సంవత్సరంలో సాగవుతున్న భూమి ఎంత?
5) వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రప్రభుత్వం కేటాయించిన నిధులు ఎన్ని?
6) కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు 2019 నుండి 2023 వరకు మొత్తం ఎన్నినిధులు కేటాయించింది, ఆ నిధులు ఏయే కార్యక్రమాలకు ఖర్చు చేశారు?
7) కేంద్రప్రభుత్వం 2019 నుండి 2023 వరకు వెనుకబడిన ఉత్తరాంధ్రకు ఎన్ని నిధులు కేటాయించింది?
8) విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన కృషి ఏమిటీ?
9) 1 జూన్ 2019 నాటికి వివిధ ప్రభుత్వశాఖల్లో, కార్పోరేషన్లల్లో ఉన్న ఉద్యోగ ఖాళీలు, ఈ ఖాళీల భర్తీకి ఇప్పటివరకు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఖాళీల భర్తీకి తీసుకున్న చర్యలు ఏమిటీ?
10) 1 జూన్ 2019 నుండి 14 ఫిబ్రవరి 2024 వరకు రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు విడుదల చేశారు?
11) 1 జూన్ 2019 నుండి 14 ఫిబ్రవరి 2024 నాటి వరకు ఎన్ని డిఎస్సీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది? ఎంత మంది ఉపాధ్యాయులను నియమించారు?
12) 1 జూన్ 2019 నుండి 14 ఫిబ్రవరి 2024 వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంత మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అయ్యారు?
13) 2019 నుంచి 2023 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్లకు కేటాయించిన బడ్జెట్ ఎంత? అందులో ఖర్చు చేసింది ఎంత?
14) 2019 నుంచి 2023 వరకు తూర్పు కాపు, కొప్పుల వెలమ, కాళింగ, గవర, కాపు, వైశ్య, బ్రాహ్మణ తదితర సామాజికవర్గాల కార్పోరేషన్లకు కేటాయించిన బడ్జెట్ ఎంత? అందులో ఖర్చు చేసింది ఎంత?
15) 2019 జూన్ నుంచి 14 ఫిబ్రవరి 2024 వరకు గృహ నిర్మాణం పథకం కింద పట్టణాల్లో, గ్రామాల్లో అర్హులైన ఎంత మంది పేదలకు గృహనిర్మాణం పథకం కింద ఎన్ని ఇళ్లు నిర్మించారు?
16) 2014 నుంచి 2019 మే వరకు గృహ నిర్మాణం పథకం కింద పట్టణాల్లో, గ్రామాల్లో అర్హులైన ఎంత మంది పేదలకు గృహనిర్మాణం పథకం కింద ఎన్ని ఇళ్లు నిర్మించారో జిల్లాల వారీగా సమాచారం ఇవ్వాలని కొణతాల రామకృష్ణ కోరారు.
ఎన్నికల కోసం చేసే హడావిడేనా?
ఎన్నికలకు ముందు ఇటువంటి హడావిడి కొణతాల రామకృష్ణకు మామూలేనని వైసీపీ నేతలు కొట్టిపారవేశారు. ఉత్తరాంధ్రపై ఆయనకు అంత చిత్తశుద్ధి, నిజాయితీయే ఉంటే ఈ నాలుగున్నర ఏళ్లు ఏమి చేశారని వైసీపీ నాయకుడు రామకృష్ణ యాదవ్ ప్రశ్నించారు. ఇంత సమాచారం క్రోడీకరించడానికే కనీసం నాలుగైదు నెలలు పడుతుందన్నారు అధికారులు.