RRR CASE| ఎవరీ విజయపాల్? ఎందుకు అరెస్ట్ అయ్యారు?
x
Raghu Rama krishna Raju and Vijay pal (graphics)

RRR CASE| ఎవరీ విజయపాల్? ఎందుకు అరెస్ట్ అయ్యారు?

రఘురామ కృష్ణ రాజు కేసులో ఎట్టకేలకు మాజీ పోలీసు బాస్ విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఆయన 4వ నిందితునిగా ఉన్నారు. మున్ముందు ఈ కేసు ఏమలుపు తిరుగుతుందో చూడాలి


ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో ఓ వెలుగు వెలిగిన విజయ్ పాల్ ఓ ఎంపీపై చేయి చేసుకున్న కేసు(RRR CASE)లో అరెస్ట్ అయ్యారు. ఆనాటి ఎంపీ పేరు కే రఘురామ కృష్ణ రాజు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్. ఆయన నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు ఓ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచినపుడు పోలీసు అధికారిగా ఉన్న ఈ విజయ్ పాల్ కనపడని దెబ్బలు కొట్టి చిత్రహింసలకు గురి చేశారన్నది ఆరోపణ. ఎంపీగా ఉన్నప్పుడు తనను కొట్టారంటూ రఘురామకృష్ణం రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడాయన్ని అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, అంతమొందించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆర్‌.విజయ్‌పాల్‌ ను అరెస్ట్ చేశారు. సీఐడీలో అదనపు ఎస్పీగా పని చేసి పదవీ విరమణ చేశారు. సీఐడీ విభాగంలో సమర్థునిగా పేరుతెచ్చుకున్న విజయ్ పాల్ ను పోలీసులు ఇటీవల పిలిపించి విచారించారు. అయితే ఆయన పోలీసులు అడిగిన ఏ ప్రశ్నకూ సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన పదవిని అడ్డం పెట్టుకుని ఆయన విచ్చలవిడిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని, విమర్శించిన వారిని ఆయన వేధించారని గతంలో ఆరోపణలు వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ ప్రత్యర్థుల వ్యవహారం చూసే పనిని ఈ విజయ్‌పాల్‌కే అప్పగించేవారన్న విమర్శలూ లేకపోలేదు. ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు, రబ్బరు బెల్ట్‌లతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసినట్టు సాక్షాత్తూ ఆనాటి లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్‌కుమార్‌. ఆయన్ను విజయ్ పాల్ నడిపించేవారని టీడీపీ నాయకులు ఆరోపించేవారు. పదవీవిరమణ చేసిన తర్వాత కూడా ఆయన తన పదవిలో కొనసాగారు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారి (ఐఓ)గా వ్యవహరించారు. రఘురామను విచారించే సమయంలో కేవలం ఇన్‌స్పెక్టర్‌ గా ఉన్న విజయ్‌పాల్‌ ఆ తర్వాత అదనపు ఎస్పీ అయ్యారు.
విజయ్‌పాల్‌ అంటే సామాన్యులకే కాక పోలీసుబాసులకు సైతం చెమట్లు పట్టేవి. రఘురామ ఫిర్యాదు మేరకు ఆయనకు తొలుత నోటీసులిచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారు. దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్‌ అధికారి ఏఆర్‌ దామోదర్‌ను ఐఓగా నియమించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన ఇద్దరు న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ తన తరఫున వాదనలు వినిపించారు. పదవీవిరమణ చేసిన ఓ పోలీసు అధికారి.. అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవడం సాధ్యమేనా? అనే విమర్శలూ ఉన్నాయి.
విజయ్‌పాల్‌ ఎంత దురుసుగా ప్రవర్తించేవారో అప్పట్లో సీఐడీలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కథలు కథలుగా చెబుతారు. ఆయన్ను ఎవరైనా కలవాలంటే మూడు, నాలుగు అంచెల్లో అనుమతి పొందాల్సిందే. మాట మహాకఠినంగా, దురుసుగా ఉండేది. ఏదైనా కేసుల్లో ఎవర్నైనా అరెస్టు చేసి.. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టేటపుడు మీడియా వాళ్లు కవరేజికి వెళ్తే.. ‘‘మీరెవర్రా ఇక్కడికి రావడానికి? ఇక్కడ మీకేం పని?’’ అంటూ అత్యంత దురుసుగా మాట్లాడేవారు.
విజయ్ పాల్ అరెస్ట్ అంత ముఖ్యమా?
వైఎస్‌ఆర్‌సీపీ నేతల ఆదేశాలను అమలు చేయడంలో నిమగ్నమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదవుతున్నాయి. నటి కాదంబరి జెత్వాని , నరసాపురం మాజీ ఎంపి (ప్రస్తుతం ఎమ్మెల్యే) రఘురామ కృష్ణం రాజుకు సంబంధించిన రెండు ముఖ్యమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. రఘురామ కృష్ణం రాజు ప్రమేయం ఉన్న వివాదాస్పద కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న మాజీ సిఐడి అదనపు ఎస్పీ కె. విజయ్ పాల్‌ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు.
2021 మే 2021 నాటి కేసు ఇది. CID కస్టడీలో ఉన్నప్పుడు తనన చంపడానికి ప్రయత్నం చేశారన్నది రఘురామరాజు ఆరోపణ. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా కేసు నమోదైంది. YSRCP ప్రభుత్వ హయాంలో పని చేసిన పలువురు అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వారిలో
ఏపీ మాజీ సీఐడీ డీజీ సునీల్ కుమార్
మాజీ ఇంటెలిజెన్స్ డీజీ పీ.సీతారామాంజనేయులు
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
సీఐడీ ఏఎస్పీ కె. విజయ్ పాల్
జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి.
విజయ్ పాల్ ఈ కేసులో 4వ నిందితునిగా ఉన్నారు. విజయ్ పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇటీవల తిరస్కరించింది. అప్పటి నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు అతని కోసం వేటాడుతున్నాయి. గుంటూరుకు చెందిన విజయ్ పాల్ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్నాడని, వైఎస్సార్సీపీకి చెందిన ప్రముఖ నాయకుడి రక్షణలో రాయలసీమలో ఉన్నట్లు అనుమానించారు. చివరకు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
Read More
Next Story