సముద్ర తీర ప్రాంతంలో ఫెయింజల్‌ తుపాను నానా బీభత్సం సృష్టించింది. కాకినాడలో కొన్ని గ్రామాలు కోతకు గురయ్యాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఫెయింజల్‌ తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంది. సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువుగా ఉంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం అతలాకుతలం అయ్యింది. జనజీవనం ఒక్క సారిగా స్తంభించి పోయింది. ఫెయింజల్‌ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా సముద్రంలో అలల అలజడి పెరిగింది. తుపానుగా మారే క్రమంలో రాకాసి అలలు ఉప్పాడ తీర ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. దీని వల్ల ఉప్పాడ తీరమంతా కోతకు గురవుతోంది. పలు చోట్ల ఇళ్లు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు వంటివి పడిపోయాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈదుల గాలులకు నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు సముద్రంలో కలిసిపోయాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపపేట వంటి అనేక గ్రామాలల్లో తుపాను ప్రభావం ఎక్కువుగా ఉంది. సముద్ర అలల తాకిడికి కోత బారిన పడ్డాయి. దీంతో బాధితులు నిలువ నీడ లేకుండా పోయింది. జనజీవనం స్తంభించి పోయింది. ఇళ్లల్లోకి సముద్రం నీరు వచ్చి చేరుతుండటంతో రోడ్డున పడ్డారు. సముద్రాన్ని ఆనుకొనే ఈ గ్రామాలు ఉండటం, తుపాను, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు వాటి నుంచి కాపాడుకోవడం కోసం రక్షణ గోడ లేక పోవడంతో తుపాను వచ్చిన ప్రతీ సారి ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.


Next Story