
రాప్తాడులో దొంగ ఓట్లను చేరుస్తున్నారా? అదెలా?
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) సహకరించారా? అవుననే టీడీపీ ఆరోపిస్తోంది ఎందుకు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) సహకరించారా? కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ఆధార్‌కార్డులు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వైసీపీ నాయకులు ఇస్తున్న ఫాం-6 దరఖాస్తులకు మరోమాట మాట్లాడకుండా ఆమోదం తెలుపుతున్నారా? ప్రస్తుతం కనిపిస్తున్న ఆధారాలను బట్టి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బీఎల్వోలు, ఏఈఆర్వో (తహసీల్దార్) తిరస్కరించిన ఫాం-6 దరఖాస్తులను సైతం ఈఆర్వో ఆమోదించారు. కొన్ని దరఖాస్తులను బీఎల్వోలకు ఎసైన్ చేయకుండానే ఈఆర్వో కార్యాలయంలోనే తతంగం పూర్తిచేస్తున్నారు. ఈఆర్వో వసంతబాబు తన లాగిన్‌ను వైసీపీ అనుకూల అధికారులకు అప్పగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ లాగిన్ వివరాలు వైసీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో ఓ ప్రత్యేక కార్యాలయంలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఇప్పటివరకు రాప్తాడు నియోజకవర్గం పరిధి అనంతపురం గ్రామీణ మండలంలో వేల బోగస్ ఓట్లు నమోదు చేశారు. వీటిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా.. అలా జరగడానికి వీలు లేదంటూ ఈఆర్వో చెబుతున్నారు.ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఆమోదించిన దరఖాస్తులను వెనక్కి తీసుకుంటామంటున్నారంటే దానర్థం అవకతవకలు జరిగినట్టే కదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.రాప్తాడు ఎమ్మెల్యే కార్యాలయం నుంచే దొంగ ఓట్ల నమోదుకు కుట్ర జరుగుతోందనే ఆరోపిస్తున్నారు.ఈ అక్రమాలపై మాజీ మంత్రి పరిటాల సునీత ఫిర్యాదు చేశారు.