జగన్‌ జమానాలో వీళ్లు కింగ్స్..
x
సీఎం జగన్

జగన్‌ 'జమానా'లో వీళ్లు 'కింగ్స్'..

కొన్నిచోట్ల సకుటుంబ, సమేతంగా అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. కూటమితో పోలిస్తే.. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎక్కువమంది ఉన్నారు.



(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్,)
తిరుపతి: ఎన్నికల్లోనూ సకుటుంబ, సపరివార సమేతంగా బరిలోకి దిగవచ్చు. సతులు, సుతులు సైతం రంగంలోకి దిగవచ్చు. వైసీపీ జాబితా చూస్తే మీకీ విషయం ఇట్టే తెలిసిపోతుంది.. "డబ్బు, హోదా, పరపతి" ఇవే రాజకీయ పదవులకు సోపానంగా మారుతున్నాయి. ఆ మూడు లక్షణాలు ఆలంబనగా రాజకీయ పదవులు అందుకోవడానికి నిచ్చెనలా మారాయి. రాజకీయాలను వారసత్వంగా మార్చుకున్న నాయకులు కుటుంబ సభ్యులను కూడా ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎన్నికల రంగంలోకి దించారు. టీడీపీతో పోలిస్తే అధికార వైఎస్ఆర్‌సీపీ నుంచే సకుటుంబ సపరివారంగా పోటీ చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
కడప జిల్లాలో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుంచి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కుటుంబమే చక్రం తిప్పుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్‌సభ సభ్యుడిగా మళ్లీ ఇదే స్థానం నుంచి పోటీలో ఉన్నారు.



బొత్స కుటుంబానికి బొనాంజా
విజయనగరం జిల్లాలో.. సీనియర్ నేత, వైఎస్ఆర్‌సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబంలో నలుగురికి అసెంబ్లీ సీట్లు దక్కాయి. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొత్స సత్యనారాయణకు అదే స్థానం దక్కింది. భార్య బొత్స ఝాన్సీకి విశాఖపట్నం లోక్‌సభ సీటు దక్కింది. ఆయన సతీమణి బొత్స ఝాన్సీ 2001 నుంచి 2006 వరకు విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్‌గా, 2007లో బొబ్బిలి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారి ఎంపీగా ఎన్నికై, ఆ తరువాత 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచారు.
ఆయన సోదరుడు బొత్స అప్పల నరసయ్యకు గజపతి నగరం, బొత్స సమీప బంధువు బడి కొండ అప్పల నాయుడుకు నెల్లిమర్ల సీటు దక్కింది. వాటిని వారు నిలబెట్టుకున్నారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను.. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు. బడి కొండ అప్పల నాయుడుకు శ్రీను వియ్యంకుడు కూడా. బొత్స సత్యనారాయణ 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. 2004, 2009 లో కూడా ఆయన గెలిచారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

నెల్లూరులో.. సతీ సమేతంగా...
నెల్లూరు జిల్లాలో భార్యాభర్తలు పోటీ చేస్తున్నారు. నెల్లూరు టిడిపి పార్లమెంటు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుంటే, ఆయన భార్య కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆ పార్టీ నుంచి తిరుగుబాటు చేసిన ఆయన టిడిపిలో చేరారు.



చిత్తూరులో.. తండ్రి కొడుకులు...
టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్ చంద్రబాబు నాయుడు ఎనిమిదో సారి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గంలో విజయం సాధిస్తూనే ఉన్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ ఈసారి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పుంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన సోదరుడు, తంబళ్లపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మళ్లీ అదే స్థానం నుంచి అభ్యర్థిత్వాన్ని దక్కించుకొని పోటీకి సిద్ధమవుతున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ సిట్టింగ్ ఎంపీ. మళ్లీ ఈయన ఇదే స్థానం నుంచి బరిలో నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. చంద్రగిరి నుంచి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మొదటిసారి పోటీ చేయిస్తున్నారు. తండ్రీకొడుకులు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
అంబటి ఫ్యామిలీకి రెండా!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు టికెట్ దక్కించుకున్నారు. ఈయన సోదరుడు అంబటి మురళి పొన్నూరు శాసనసభ స్థానం నుంచి టికెట్ దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్నదమ్ములు ఎన్నికల బరిలో ఉన్నారు. అందులో తణుకు నుంచి కారుమూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కారుకూరు నాగేశ్వర రావుకు సీట్ దక్కింది. ఆయన సోదరుడు కారుమూరు సునీల్ యాదవ్ ఏలూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశంతో పోలిస్తే అధికార వైఎస్ఆర్‌సీపీ నుంచే కుటుంబ సభ్యులు ఎక్కువమంది శాసనసభ పార్లమెంటు స్థానాలకు పోటీ పడుతున్నారు. ఇందులో తిరకాసు ఏంటనేది టికెట్ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియాలి.


Read More
Next Story