విద్యా రంగంలో రాజకీయాలకు తావు ఉండకూడదని, పలు పథకాలకు మహనీయుల పేర్లు పెట్టారు మంత్రి లోకేష్‌. ఆయన తీసుకున్న నిర్ణయం విద్యార్థి లోకంతో పాటు పలువురి రాజకీయ నాయకులు, మేధావుల ప్రశంసలు అందుకుంటోంది.


విద్యార్థి దశ ఎంతో గొప్పది. విజ్ఞానాన్ని ఆర్జించడానికి విద్యార్థి దశ మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఎంతో మంది మహనీయులు దేశం కోసం, రాష్ట్రం కోసం యువత భవిష్యత్‌ కోసం త్యాగాలు చేశారు. సామాజిక కార్యకర్తలుగా దేశంలోను, రాష్ట్రంలోను సేవలు చేసి కొనియాడబడుతున్నారు. వారిని మరచి పోతే మనలను మనం మరచి పోయినట్లుగా భావించాలి. అందుకే అలాంటి మహనీయుల పేర్లు నిత్యం విద్యార్థు నోట్లో నానే విధంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ ఆలోచనలు చేశారు. విద్యా పథకాలకు ఆ మహనీయుల పేర్లు పెట్టి శభాష్‌ అనిపించుకున్నారు.

స్పూర్తి ప్రధాతల పేర్లు విద్యా పథకాలకు పెట్టడం ఎంతో గొప్ప మనసు ఉంటే కానీ సాధ్యం కాదని, భావి తరాలకు స్పూర్తినిచ్చే సమాజ సేవకులు, శాస్త్ర వేతలు, విద్యా వేతల పేర్లతో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యా శాఖలో మహనీయుల పేర్లు పెట్టడంపై సీఎం చంద్రబాబుకు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన పేరు పెట్టుకున్నారని, అందుకు భిన్నంగా సంఘ సేవకురాలు డొక్కా సీతమ్మ పేరును ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతీ ఒక్కరు స్వాగిస్తున్నారని అన్నారు. ఈ పేరు ద్వారా సీతమ్మ దయా గుణం, సేవా గుణం, విద్యార్థులకు అలవరుతాయన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా పథకాలకే కాకుండా మిగిలిన కొన్ని పథకాలకు కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఆయన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేర్లను పెట్టారు. ఈ విధమైన పద్ధతిని మార్చి మంత్రి నారా లోకేష్‌ తెచ్చిన నూతన ఆలోచనా విధానాన్ని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. భవ్యిష్యత్‌లో కూడా ప్రభుత్వ పథకాలకు శాశ్వతంగా ఇలాంటి పేర్లు పెడితే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది.
జగనన్న అమ్మ ఒడి పథకం పేరు మార్చి తల్లికి వందనం పేరు పెట్టాగారు. తల్లి గొప్పతనాన్ని పిల్లలకు చెప్పాలంటే నిత్యం తల్లి అనే పదాన్ని పిల్లలు పలకాలని పెట్టినట్లు విద్యా శాఖ మంత్రి చెప్పారు. జగనన్న విద్యా కానుక పథకానికి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. విద్యా పితామహుడు అనగానే సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరు గుర్తుకొస్తుంది. అందుకే రాధాకృష్ణన్‌ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జగనన్న గోరుముద్ద పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా పేరు మార్చారు. డొక్కా సీతమ్మ ఒకప్పుడు భారత దేశంలో పేరు గాంచిన సంఘ సేవకురాలు. ఆకలితో ఇంటికి వచ్చిన ఏ ఒక్కరికీ కాదనకుండా భోజనం పెట్టి ఆమె చరిత్రకెక్కారు. మనబడి నాడు నేడు పథకానికి మన బడి మన భవిష్యత్తు గా పేరు మార్చారు. బడిలోనే విద్యార్థి భవిష్యత్తు రూపు దిద్దుకుంటుందని, ఈ పథకానికి మన బడి మన భవిష్యత్తుగా పేరు ఖరారు చేశారు. స్వేచ్ఛ అనే పథకం పేరును బాలికా రక్షగా మార్చారు. బడిలో బాలికలకు రక్షణ కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. జగనన్న ఆణిముత్యాలు పథకం పేరును అబ్దుల్‌ కలామ్‌ ప్రతిభా పురస్కారం పథకంగా పేరు మార్చారు. అబ్దుల్‌ కలామ్‌ గొప్ప శాస్త్రవేత్త. ఈ దేశానికి రాష్ట్రపతిగా పని ప్రథమ పౌరుడిగా కొనసాగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరుతో ప్రతిభ పురస్కారం ఇవ్వడం స్పూర్తిగా ఉంటుందని లోకేష్‌ ఈ పేరును ఖరారు చేశారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత విద్యా శాఖలో ఈ పథకాల పేర్లను మారుస్తూ లోకేష్‌ ప్రకటన విడుదల చేయడం పలువురి ప్రశంలు అందుకుంది. రాష్ట్రంలో విద్యాలయాలు దేవాలయాల కంటే గొప్పగా అనిపించాలని, రాజకీయాలకు అతీతంగా తీర్చి దిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్‌ వెల్లడించారు. అందుకే ఆయా పథకాలకు భరత మాత ముద్దు బిడ్డల పేర్లు పెట్టామన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అభినందనలు తనలో నూతన ఉత్తేజాన్ని నింపాయని లోకేష్‌ అన్నారు. పథకాలకు స్పూర్తి ప్రధాతల పేర్లు పెట్టడానికి పవన్‌ కళ్యాణ్‌ కూడా తనకు సూర్పి అని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ఎక్స్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టు పెట్టారు.
Next Story