యువగళం పైలాన్

ఆంధ్రప్రదేశ్‌లో 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు , 2 వేల 28 గ్రామాల మీదుగా టీడీపీ నేత నారాలోకేశ్‌ యువగళం పాదయాత్ర


ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగాటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా పూర్తయ్యింది. ఈ ఏడాది జనవరి 27న కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత నుంచి యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. విశాఖ జిల్లా అగనంపూడి దగ్గర పూర్తి చేశారు. మొత్తం 226 రోజులపాటు 3 వేల132 కిలోమీటర్లు లోకేశ్‌ పాదయాత్ర చేశారు.

97 నియోజక వర్గాల్లో...
ఆంధ్రప్రదేశ్‌లో 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు , 2 వేల 28 గ్రామాల మీదుగా టీడీపీ నేత నారాలోకేశ్‌ యువగళం పాదయాత్ర సాగింది. మొత్తం 226 రోజులపాటు 3 వేల132 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో టీడీపీ శ్రేణులు లోకేశ్‌ వెంట పాల్గొన్నాయి.
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 45 రోజులు...
మొదట ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45రోజుల పాటు 5 వందల 77 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. యువగళం పాదయాత్రలో ప్రతిచోటా అధికార వైసీపీ వైఫల్యాలు, అవినీతి, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ముందుకెళ్లారు లోకేశ్‌. 226 రోజుల పాదయాత్రలో 4 వేలకు పైగా వినతి పత్రాలు అందాయి. దాదాపు కోటిమందిని ఆయన నేరుగా కలుసుకున్నారని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మొత్తం 12 ప్రత్యేక కార్యక్రమాల్లో నారా లోకేశ్‌ పాల్గొన్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 3 చోట్ల యువగళం ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.
అక్కడక్కడా అడ్డంకులు...
లోకేశ్‌ యువగళంలో అక్కడక్కడా అడ్డంకులూ ఎదురయ్యాయి. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. 40 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితో సహా 46 మంది కీలక నాయకులపైన కేసులు పెట్టారు. అంతకు ముందు జీవో నెంబర్‌ వన్‌ కారణంగా ప్రచార రథానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది మొదలు తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 కిలో మీటర్‌కు ఒకటి చొప్పును 25 కేసులు నమోదు చేశారు. నారా లోకేశ్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.
ప్రతి వంద కిలోమీటర్లకీ ఓ శిలాఫలకం..
యువగళం పాదయాత్రలో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 చోట్ల లోకేశ్‌ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రతి సభలోనూ అధికార పార్టీపై విమర్శలు చేస్తూనే తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా రైతులు, యువత, చేశారు. రైతులు, యువత, మహిళలు, ముస్లిం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, న్యాయవాదులు ఇలా పలు వర్గాలతో సమావేశమై వారి సమస్యల్ని తెలుసుకున్నారు.
మూడున్నర లక్షల మందితో సెల్ఫీలు..
దాదాపు మూడున్నర లక్షల మందితో సెల్ఫీ విత్‌ లోకేశ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా ఒకేరోజు 2వేల 500 మందితో లోకేశ్‌ సెల్ఫీలు దిగారు. సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్‌ చేయించి ఫేస్‌ రికగ్నైషన్‌ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరే ఏర్పాటు చేశారు.
ఎందుకు ముగించాల్సి వచ్చిందంటే...
మొదట ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 400 రోజులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు అరెస్ట్‌, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ ఇలా పలు కారణాలతో రెండున్నర నెలలపాటు పాదయాత్రకు విరామం ఇచ్చారు. సెప్టెంబర్‌ 9న కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద లోకేశ్‌ పాదయాత్రకు బ్రేక్‌ వచ్చింది. దీంతో ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించారు. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగింపు పలికారు. గతంలో చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర కూడా విశాఖ అగనంపూడిలోనే ముగించడం విశేషం. ఈనెల 19న ఒకరోజు విరామం తర్వాత విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో ఈనెల 20న యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ తలపెట్టారు.


Next Story