కులం తక్కువ వ్యక్తిని ప్రేమించిందని కూతుర్ని చంపిన తండ్రి!
x

'కులం తక్కువ వ్యక్తిని' ప్రేమించిందని కూతుర్ని చంపిన తండ్రి!

నిజంగా గుండెలు పిండేసే వార్త. పాతబడి కుళ్లిపోయిన నీతుల్నీ, రీతుల్నీ పట్టుకునే ఈ సమాజం ఇంకా వేలాడుతుందా అంటే నిజమేనని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.


నిజంగా గుండెలు పిండేసే వార్త. పాతబడి కుళ్లిపోయిన నీతుల్నీ, రీతుల్నీ పట్టుకునే ఈ సమాజం ఇంకా వేలాడుతుందా అంటే నిజమేనని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయ. వేరే కులం పిల్ల వాడిని ప్రేమించిందని కన్నతండ్రే కూతురికి ఉరితాడు ఇచ్చి చెట్టుకు ఉరేసుకుని చచ్చిపొమ్మని చెప్పిన సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగింది. యాదృచ్ఛికంగా ఆ అమ్మాయి పేరు భారతి. ఆ అమ్మాయిని ఉరి పోసుకొమ్మని ఆర్డరేసి అమలు చేయించిన తండ్రి రామాంజనేయులు. తన కళ్ల ముందే ఉరిశిక్షను అమలు చేయించిన ఆ తండ్రి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. జైలు కెళ్లడం తనకేమీ కష్టం కాదంటున్నాడు ఈ తండ్రి. అందరూ దీన్ని పరువు హత్యగా పిలుస్తున్నా ఆయన మాత్రం తన కులం కంటే కూతురేమీ పెద్ద లెక్క కాదంటున్నాడు. కులాలేమిటో తెలియలేదు గాని ఆ అమ్మాయి తండ్రి మాత్రం ఓ హోటల్ నడుపుతున్నారు.
సంఘటన జరిగిన ప్రాంతం అనంతపురం జిల్లా గుంతకల్లు. రామాంజనేయులు అనే ఆయన ఓ చిన్న హోటల్ నడుపుతున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తెకి 20 ఏళ్లు. కర్నూలులో డిగ్రీ చదువుతోంది. తన తోటి విద్యార్థి ఒకర్ని ప్రేమించింది. ఆ విషయాన్నే ఇంట్లో చెప్పింది. తండ్రి ససేమిరా అన్నాడు. ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరాయి. కులం తక్కువ వాడికి ఇచ్చి పెళ్లి చేయలేనన్నాడు ఇడ్లీ కొట్టు నడిపే ఈ పెద్దకులపు తండ్రి. అయినా సరే ఆ అమ్మాయి వెనక్కి తగ్గలేదు. నా జీవితం, నా బతుకు, నా పెళ్లి అంటూ తండ్రిని ఎదిరించింది. ప్రేమికు డినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. ప్రాణత్యాగానికీ వెనుకాడని ఆ అమ్మాయి తెగేసి చెప్పింది. ఇదే అదునుగా తండ్రి ఓ ప్లాన్ చేశాడు.
కుటుంబ పరువు పోతుందన్న భావనతో ఎలాగైనా కుమార్తెను కడ తేర్చాలనుకున్నాడు. మార్చి 1న భారతిని మోపెడ్ పై ఎక్కించుకొని గుంతకల్లులోని దర్గా సమీపానికి వెళ్లాడు. ఓ చెట్టు కింద బైక్ ఆపి, తన వెంట తెచ్చుకున్న తాడును బిడ్డ చేతికి ఇచ్చాడు. ఇది ఊహించని భారతి నిర్ఘాతంతపోయింది. కన్నకూతుర్నే చంపుతావా అంటూ రోదించింది. అయినా తండ్రి మనసు కరగలేదు.
చెట్టు కొమ్మకు తాడేసి ఉరేసుకొని చచ్చిపో వాలని గద్దించాడు. ప్రేమ పరీక్షలో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ భారతి చెట్టు కొమ్మకు ఉరేసుకుంది. చనిపోయిందని నిర్ధారించుకున్న రామాంజనేయులు, కుమార్తె మృతదేహాన్ని కిందికి దించాడు. మోపెడ్ లోని పెట్రోలు తీసి, కుమార్తె మృత దేహం పై పోసి దహనం చేశాడు. ఆతర్వాత ఎక్కడికో వెళ్లిపోయాడు. అసలేమైందో విషయం తెలియక రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఏమైందో తెలియదు గాని మూడు రోజుల తర్వాత రామాంజనేయులు మార్చి 4న రాత్రి గుంతకల్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులకు జరిగిన సంఘటన వివరాలు చెప్పాడు. నిందితుడు చెప్పిన మాటల్ని మొదట్లో పోలీసులు కూడా నమ్మలేదు. నేరుగా అతన్నే తీసుకుని సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. సగం కాలిన భారతి శవాన్ని గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్న కసాపురం ఎస్సై వెంకటస్వామి సహా పోలీసులు ఖంగుతిన్నారు. భారతి హత్యను ధృవీకరించారు.
ఆధిపత్య కుల భావన ఓ ఆడపిల్ల ప్రాణాలు తీసుకునేటట్టు చేసిందని ప్రజాసంఘాలు ఆరోపించాయి. కులం నశించాలనే నినాదాలు వినపడుతున్నా కుల జాడ్యం మాత్రం మెదళ్లను వదలకపోవడం విచారకరం.
Read More
Next Story