తానో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. సొంత ఇల్లు ఉంది. మంచిగా ఆస్తులు ఉన్నాయి. చక్కటి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చక్కగా సంసారం సాగి పోతోంది. అతనికి ఉన్న ఆస్తులతో అతని పిల్లలే కాదు తర్వాత తరం కూడా హాయిగా బతికేయొచ్చు. ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా చక్కగా జీవితాలు గడపొచ్చు. అయితే తన పిల్లలు సరిగా చదవడం లేదనే ఆలోచన అతని బుర్రలో జోరీగలాగా తిరగడం ప్రారంభించింది. దీంతో ఆ పిల్లలను పాఠశాల మార్పించాడు. అయినా ఆ ఆలోచనలలో మార్పు రాలేదు. చదువు అంటే ఏంటో కూడా తెలియని వయసు ఆ పసిబిడ్డలది. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటే తల్లిదండ్రులు సంతోష పెట్టాలనే వయసు కూడా కాదు. ఒక బిడ్డ ఒకటో తరగతి చదువుతుంటే, మరొక బిడ్డ ఎల్‌కేజీ చదువుతోంది. ఆటాపాటలతో ఆడుకునే వయసు వారిది. ఒక వేళ ఇప్పుడు బాగా చదవలేక పోయినా.. పెద్ద పెరిగే కొద్ది బాగా చదివే వారేమో. ఇంత చిన్న వయసులోనే వారు బాగా చదవడం లేదని, దీంతో భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటారని, పోటీ ప్రపంచంలో రాణించలేరని ఎలా నిర్ణయిస్తాడు.
అలా చిన్నప్పుడు బాగా చదవక, పెద్ద పెరిగిన తర్వాత చదువు మీద ఇంట్రెస్టు పెంచుకొని బాగా చదుకుని జీవితంలో పైకొచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆ తండ్రికి అవేమీ గుర్తుకు రాలేదు. తన పిల్లలు సరిగా చదవడం లేదనే ఆలోచనలే అతని బుర్రలో తిరుగూతనే ఉన్నాయి. అవి క్రమంగా ముదిరి వారి మీద ద్వేషంగా మారాలే చేశాయి. దీంతో పసి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే వారి పాలిట కాలయముడిగా మారాడు. వందేళ్లు బతకాల్సిన ఆ పసిబిడ్డలను ఆరేడేళ్ల వయస్సులోనే వారి జీవితాలను చిదిమివేశాడు. కాళ్లూ చేతులను తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలలు ముంచి అత్యంత కర్కశంగా చంపేశాడు. తర్వాత ఆ తండ్రి కూడా ఆత్మహత్య చేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అత్యంత హృదయ విదారకమైన ఈ దుర్ఘటన హోలీ నాడు కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిన ఈ దారుణం తీవ్ర విషాదాన్ని నింపింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్‌జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. కాకినాడ సుబ్బారావునగర్‌లో తన సొంత ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, ఒకటో తరగతి చదివే జోషిల్ (7), యూకేజీ చదివే నిఖిల్ (6) పిల్లలున్నారు. వారు సరిగా చదవడం లేదంటూ ఇటీవలే పాఠశాలను మార్పించారు. తమ ఆఫీసులో హోలీ సందర్భంగా తన ఆఫీసులో నిర్వహించిన వేడుకలకు చంద్రకిశోర్ తన భార్య, పిల్లలను తీసుకుని వెళ్లాడు. అయితే కొద్ది సేపు అయిన తర్వాత తన భార్యను అక్కడే ఉండాలని సూచించాడు. పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించడానికి టైలర్ వద్దకు తీసుకెళ్తున్నానని, పది నిమిషాల్లో తరిగి వచ్చేస్తానని అప్పటి వరకు అక్కడే ఉండమని తన భార్యకు చంద్రకిశోర్ చెప్పాడు.
అయితే ఎంత సేపు చూసిన తన భర్త, పిల్లలు తిరిగి రాలేదు. దీంతో భార్య తనూజ తన భర్త చంద్రకిశోర్‌కు ఫోన్ చేసింది. భర్త ఫోన్ ఎత్త లేదు. దీంతో ఆందోళనలకు గురైన తనూజ అక్కడున్న తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికి చేరింది. తొలుత కిటికీలో నుంచి చూశారు. భర్త చంద్రకిశోర్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్న దృశ్యం కనిపించింది. దీంతో అక్కడున్న తోటి ఉద్యోగులు బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేశారు. లోపలికెళ్లి చూడగా ఇంకా దారుణమైన దృశ్యాలు కనిపించాయి. పిల్లలిద్దరూ కాళ్లూ చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్‌లలో తలలు మునిగిపోయి ఉన్న సీన్ చూసి నిర్ఘాంత పోయారు. దీంతో భార్య తనూజ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చంద్రకిశోర్ రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేక పోతున్నారని, అందువల్ల వారికి భవిష్యత్తు లేదని, దీంతో ఇద్దరు పిల్లలను చంపి తాను కూడా చనిపోతున్నట్లు చంద్రకిశోర్ సూసైడ్ నోటులో రాసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే చంద్రకిశోర్ సోదరుడు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. తన తమ్ముడికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవని, బాగానే ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని వాపోవడం అనేక అనుమానాలు తావిచ్చినట్లైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ మరణాలు ఎలాంటి వివరాలను వెల్లడిస్తారో అనేది ఆసక్తి కరంగా మారింది.