ఆంధ్రప్రదేశ్ చరిత్ర లో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి కేసుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కుతాయి.


ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల గురించి భవిష్యత్ తరాలు ఏమి తెలుసుకుంటాయి. కక్షలు, కుట్రలు, కేసుల్లో వీరిద్దరికీ ప్రథమ స్థానం దక్కిందని మొదట తెలుసుకుంటారు. వీరి పాలన ఏ విధమైన సందేశం ఇస్తుందో వారే నిర్ణయించుకుంటారు. ఏపీ ప్రజలు మాత్రం పాలకులను ఎన్నుకోవడంలో ఎప్పుడూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని కావాలనుకుంటే వారిని పూర్తి మెజారిటీతో గెలిపిస్తున్నారు. దీంతో వారు ఆడిందే ఆట.. పాడించే పాటగా సాగుతోంది.

విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఏమీ కనిపించవు. మోసాలు, మాయలు, కుట్రలు, కుతంత్రాలు, అప్పులు, చీకట్లు, అవినీతి, అన్యాయాలు, అక్రమాల, కేసులు, జైళ్లు మాత్రమే చెప్పుకునేందుకు మిగిలాయి. భాషా ప్రయుక్త రాష్ట్రంగా మద్రాస్ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోయిన నాటి నుంచి పదేళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎంతో గొప్పగా ఉండేది. తెలుగు వారికి ఎక్కడికి పోయినా రాజకీయంగా గౌరవ మర్యాదలకు ఏ మాత్రం తక్కువ వుండేది కాదు. ఇప్పుడు మాత్రం ఏపీ నుంచి ఎవరైనా పాలకులు ఎవరి వద్దకైనా వెళుతున్నారంటే.. అబ్బా.. వీడెందుకొచ్చడ్రా అని నిట్టూరుస్తున్నారు. అంటే పాలకులు ఆంధ్రప్రదేశ్ ను దేశ పటంలో ఎంత గొప్పగా నిలిపారని చెప్పుకోవచ్చు.

కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత కాలం ఎంతో కొంత చరిత్ర గురించి చెప్పుకునేందుకు అవకాశం ఉండేది. ఆ చరిత్ర కూడా రాష్ట్రంలోని ప్రజల సుఖ సంతోషాలు, కష్టాల గురించి మాత్రమే ఉండేది. అధికార ప్రతి పక్షాలు కలిసి ప్రజాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ఒక మంత్రి కార్యక్రమం ఒక నియోజకవర్గంలో ఉందంటే అక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా సరదాగా కార్యక్రమంలో పాల్గొని పది మందీ నవ్వుకునేలా వ్యవహరించే వారు.

నేడు ఆ పరిస్థితులు లేవు. నియోజకవర్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారంటే అక్కడ అధికార పక్షం నుంచి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఉంటున్న వ్యక్తి పెత్తనం పట్టనలవి కాకుండా ఉంటుంది. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే కంటే అధికార పక్ష ఇన్ చార్జ్ కే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటోంది. లేదంటే ఆ నియోజకవర్గంలోని అధికారి బదిలీ ఖాయమవుతుంది. లేదంటే వీఆర్ కు పంపించి అధికారి పరువు తీయడం పరిపాటిగా మారింది.

ప్రజా సంక్షేమం కంటే కక్ష రాజకీయాలకు నేతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టగానే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు కు విధి నిర్వహణలో సహకరించిన అధికారులపై మొదట వేటు వేశారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. నాయకులు, కార్యకర్తలకు వేధింపులు మొదలయ్యాయి. అవినీతి కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు గురయ్యారు. బెయిల్ రాకపోవడంతో 53 రోజుల పాటు జైలులులో ఉండాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించగానే వైఎస్సార్ సీపీ వారిపై కేసులు పెట్టడం మొదలు పెట్టారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విధి నిర్వహణలో జగన్ కు సహకరించారనే ఆరోపణపై పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. పలువురు అరెస్ట్ అయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కంటే ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఎక్కువ మంది అధికారులు, నాయకులు వేధింపులకు గురయ్యారు. ఆ పరంపర కొనసాగుతూనే ఉంది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లు కేసుల్లో ఇరుక్కుని బెయిల్ పై ఉన్నారు. అంటే ఇప్పుడు వీరి జుట్టు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. కేంద్రానికి కోపం వచ్చిందంటే కొరఢా ఝుళిపిస్తారు. సీబీఐ, ఈడీలు పడగ విప్పుతాయి. దీంతో బెయిల్ ఏ క్షణంలోనైనా రద్దయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇరువురూ కేంద్ర పెద్దల వద్ద మోకరిల్లుతున్నారు. రాష్ట్రానికి సాయం అందించినా, అందించకపోయినా పెద్దగా దానిని పట్టించుకోవడం లేదు. కక్షలు, కార్పణ్యాలతో పాలన సాగినంత కాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి.

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. వేల మంది పార్టీల కార్యకర్తలు, నాయకులపై కేసులు ఉన్నాయి. ఈ కేసులు త్వరగా పరిష్కరించాలంటే ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. సాధారణ కోర్టుల్లో న్యాయం సకాలంలో అందటం లేదనే బాధ, ఆవేదన పాలకుల్లో ఉంది. ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటైతే తీర్పులు అనుకూలంగా వస్తాయా? అనే సందేహాలు కూడా పలువురిలో ఉన్నాయి. ఏదైతే నేమి బయట ఉన్నంతసేపు సాధారణ నీళ్లుగానే ఉంటాయి. అవే నీటిని శంకులో పోస్తే తీర్థంగా మారిపోతాయి. మరి ఈ ఇరువురు నాయకులు శంకులుగా ఎప్పుడు మారుతారో, అందులో తీర్థంగా ఎప్పుడు అవతరిస్తారో వేచి చూడాల్సిందే.

Next Story