ఉంటే అతి వృష్టి.. లేకుంటే అనావృష్టి అన్నట్లు మారింది ఆంధ్రప్రదేశ్‌లోని అధికారుల పరిస్థితి.


తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అధికారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉద్యోగాలు పోతాయనో లేదా బదిలీలు ఉంటాయనో కాదు. ఎక్కడకు బదిలీ చేసిన ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాంటి భయాలేమీ అధికారుల్లో లేవు. అయితే సమీక్షల భయం అధికారుల్లో పుట్టుకుంది. గత ప్రభుత్వంలో ఎలాంటి సమీక్షలు, సమావేశాలు లేక పోవడంతో కాలు మీద కాలు వేసుకొని, చొక్కా నలక్కుండా ఉద్యోగాలు చేసిన అధికారులకు చంద్రబాబు అధికారంలోకి రావడంతో చెమటలు పడుతున్నాయి.

ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలకు సన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ద్వారా ఆయా శాఖల కార్యదర్శులు, డైరెక్టర్లు, కమిషనర్లకు సందేశాలు జారీ చేశారు. తాజాగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పాయింట్లు, టేబుళ్లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌(పీపీటీ)లు తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర పరిస్థితి ఏమిటి, ఎలా ఉందనే దానిపై తాజా పరిస్థితులు తెలుసుకునేందుకు వరుసగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తారని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారుల్లో వణుకు మొదలైంది.
చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అనంతరం పరిపాలన స్టైల్‌ మార్చారు. అధిక సమయం శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడంపైన దృష్టి సారించారు. టార్గెట్‌లు ఇవ్వడం, దానికి గడువు ఇవ్వడం ఆ లోగా టార్గెట్‌లను పూర్తి చేయాలనే దిశగా దిశా నిర్థేశం చేస్తూ వచ్చారు. 2014 ఆరంభంలో విజయవాడలోని హోటల్స్‌లో సమీక్షలు నిర్వహించే వారు. కలెక్టర్ల, ఎస్పీల కాన్ఫెరెన్సులు కూడా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు. తర్వాత నగరంలోని కన్వెన్షన్‌ సెంటర్లకు వీటిని మార్చారు. సచివాలయం పూర్తి కావడంతో అక్కడే నిర్వహిస్తూ వచ్చారు. తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజావేదికను నిర్మించి అక్కడ నిర్వహిస్తూ వచ్చారు. జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి కలెక్టర్లు, ఎస్పీల కాన్పెరెన్స్‌లు నిర్వహించిన జగన్‌ తర్వాత దానికి కూలగొట్టారు.
చంద్రబాబు నాయుడు సమీక్షల నిర్వహించడంలోను, పనుల పురోగతిని పరుగులు పెట్టిస్తారనే టాక్‌ ఆ పార్టీలో ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమీక్షల నిర్వహణకు గ్యాప్‌ ఎక్కువుగా ఉండేది. ఆరు మాసాలకు ఒక సారి నిర్వహించే వారు. తర్వాత సమయం తగ్గుతూ వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్యాప్‌ బాగా తగ్గుతూ వచ్చింది. వారానికి ఒక సారి సమీక్షలు నిర్వహించే స్థాయికి సమయాన్ని కుదించుకుంటూ వచ్చారు.
సమీక్షల నిర్వహణకు వచ్చే అధికారులు, సిబ్బంది గంటల తరబడి వెయిట్‌ చేయాల్సి వచ్చేది. అనుకున్న షెడ్యుల్‌ ప్రకారం సమీక్షలు పూర్తి చేసే వారు కాదు. మధ్య మధ్యలో సీఎంకు ఇతర ప్రోగ్రామ్స్‌ ఉండటం వల్ల తీవ్ర జాప్యం నెలకొనేది. దీంతో గంటల తరబడి అధికారులు వెయిట్‌ చేసే వారు. ఒక్కో సారి ఒక్కో పూట కూడా వేచి ఉండేవారు. ఒక్కో సారి అర్థ రాత్రి కూడా అయ్యేది. దీంతో అధికారులు, సిబ్బంది కాస్త ఇబ్బందులు పడ్డారని, ఇవేమీ సమీక్షలురా బాబు అని విసుక్కున్నారనే టాక్‌ అప్పట్లో అధికార వర్గాల్లో వినిపించింది. దీంతో సీఎం సమీక్షలంటే ఒక రకమైన భయానక వాతావరణ అధికారులు, ఉద్యోగుల్లో కలిగిందనే చర్చ అప్పట్లో సాగింది. నెలకోసారి, వారానికోసారి సమీక్షలు నిర్వహిస్తే ప్రోగ్రెస్‌ చూపించడం సాధ్యం కాదని, దీంతో అంకెలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయనే టాక్‌ కూడా అధికార వర్గాల్లో నడిచింది.
దీనికి తోడు గత ఐదేళ్ల కాలంలో కొన్ని శాఖలకు తప్ప అన్ని శాఖలకు సమీక్షలు నిర్వహించిన సందర్భాలు లేవు. కేవలం బటన్‌ నొక్కే కార్యక్రమాలే అధికంగా ఉండటం వల్ల కొన్ని శాఖలకు అసలు పనేమి లేకుండా పోయింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సమీక్షలు షురూ చేస్తారని, దీనికి తగ్గట్టుగా తయారు కావాలని, లేక పోతే తిట్లు పడాల్సి వస్తుందని అధికారులలో చర్చ సాగుతోంది. క్రమక్రమంగా వీటికి ట్యూన్‌ కాక తప్పదని, పీపీటీలు తయారు చేసుకోవడంలో నిమగ్నం కావలసిందేనని అధికారులు చర్చించుకుంటున్నారు.
Next Story