TDP Candidate Madhavi, YSCP Candidate Vidudala Rajani
నాలుగు నియోజక వర్గాలు..ఎనిమిది మంది మహిళా సింగాలు.. పోరు హోరా హోరీ
జి విజయ కుమార్
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు నియోజక వర్గాల్లో మహిళా మణులు పోటీకి దిగారు. ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ నుంచి వీరు పోటీ పడుతున్నారు. ఈ నాలుగు నియోజక వర్గాల్లో పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఒక ఎస్టీ నియోజక వర్గంలో ఒక జనరల్ స్థానంలో ఒకరు మాజీ మంత్రి కాగా మరో ఇద్దరు సిట్టింగ్ మంత్రులుగా ఉన్నారు.
మాజీ మంత్రి వర్సెస్ టీడీపీ
రెండు ప్రధాన ఎస్టీ నియోజక వర్గాలను పరిశీలిస్తే మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి కురుపాం నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె వైసీపీ ప్రభుత్వం వచ్చిన మొదట్లో మంత్రిగా బా«ధ్యతలు స్వీకరించి రెండున్నర ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం మాజీ మంత్రి కావడంతో విశాఖ నగరంలో ఉంటూ అప్పుడప్పుడు కురుపాం నియోజక వర్గాన్ని చుట్టేసి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తొయ్యక జగదీశ్వరిని చంద్రబాబు ప్రకటించారు. జగదీశ్వరి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి ఎంపిటీసీగా గెలుపొందారు. గిరిజనుల్లో ఆమె మంచి పట్టున్న నాయకురాలు కూడా. ఆమె భర్త టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పుష్పశ్రీవాణి జగదీశ్వరిల మధ్య హోరా హోరీగా ఎన్నికలు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో వైఎస్‌ఆర్‌సీపీకి సాధారణమైన అనుకూలత ఉందని, ఇప్పుడా పరిస్థితుల్లేవని గిరిజనులు చెబుతున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ శిరీష
తూర్పుగోదావరి ఏజెన్నీలోని రంపచోడవరం నియోజక వర్గం కూడా ప్రత్యేకతను కలిగిన నియోజక వర్గం. ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగులపల్లి ధనలక్ష్మి ఈ సారి కూడా వైసీపీ తరఫున పోటీకి దిగారు. ఆమెకు గిరిజనుల్లో మంచి పట్టే ఉంది. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన వంతల రాజేశ్వరి టీడీపీలో చేరడంతో ధనలక్ష్మి రంగంలోకి వచ్చారు. వంతల రాజేశ్వరికే టీడీపీ టికెట్ వస్తుందని ఆలోచనల్లో చాలా మంది అభ్య«ర్థిని ప్రకటించే వరకున్నారు. అభ్యర్థి ప్రకటనతో ఖంగుతిన్న రాజేశ్వరి వర్గం తిరిగి టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీష వైపు వస్తున్నారని సమాచారం. శిరీష కూడా నాకందరి మద్దతు కావాలని.. మాజీ వంతల రాజేశ్వరిని కలుపుకొని ఓట్లు అభ్యర్థిస్తానని చెబుతున్నారు. శిరీష పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ. బిఇడీ వరకు చదువుకుంది. ఆమె తల్లి కృష్ణవేణి పంచాయతీ వార్డ్ మెంబర్. భర్త విజయ భాస్కర్. తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు. వీరిది ప్రేమ వివాహం. తెలుగుదేశం పార్టీలో భార్యా భర్తలివురు చురుకుగానే పాల్గొంటున్నారు. గిరిజనుల్లో శిరీషకు మంచి పేరుంది. ఈ పోరాటంలో గెలుపు ఓటములు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
మంత్రి విడుదల రజనీపై పిడుగురాళ్ల మాధవి ఢీ
గుంటూరు వెస్ట్ నుంచి పోటీ పడుతున్న మంత్రి విడుదల రజనీపై టీడీపీ అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి పోటీకి దిగారు. మంత్రి విడుదల రజనీని చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు రాజకీయ బదిలీ చేపట్టారు. గత ఎన్నికల్లో ఆమె చిలకలూరుపేట నుంచి గెలిచారు. రెండో మంత్రి వర్గ విస్తరణలో ఆమెకు మంత్రి పదవి దక్కింది. గుంటూరు వెస్ట్ టీడీపీకి పట్టున్న నియోజక వర్గం.
గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీనే గెలిచింది. గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన మద్దాల గిరి ఆ పార్టీని వదిలేసి వైసీపీలో చేరారు. విడుదల రజనీకి ప్రత్యర్థిగా పిడుగురాళ్ల మాధవిని చంద్రబాబు ఖరారు చేశారు. ఆమె వికాస్ ఆసుపత్రులకు డైరెక్టర్‌గా ఉన్నారు. విడుదల రజనీ, మాధవి ఇద్దరు బిసి సామాజిక వర్గానికి చెందిన వారే. విడుదల రజనీ భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో బిసి, కాపు ఈక్వేషన్ కలిసొస్తుందని వైసీపీ భావిస్తోంది. మాధవికి టీడీపీ నేత కన్నా లక్ష్మినారాయణ మద్దతు ఉండటంతో కాపు ఓటర్లును కలుపుకునేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సారి పోటీ గట్టిగానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
పెనుగొండలో పోటా పోటీ
కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీచరణ్‌కు పెనుగొండ
వైసీపీ అభ్యర్థిగా రాజకీయ బదిలీ జరిగింది. ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి కురుబ సవితను రంగంలోకి దించారు. ఇరువురు ఆయా పార్టీల తరఫున ఉద్ధండులే. ఈ ఇద్దరికి మహిళా సింగాలగా కూడా పేరుంది. ఉషశ్రీచరణ్ వైసీపీలో బలమైన నేత. అలాగే టీడీపీలో సవిత కూడా బలమైన నాయకురాలు. ఈమె గతంలో కురుబ కార్పొరేషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. తనకు తప్పకుండా సీటు దక్కుతుందని మొదటి నుంచి ఆమె చెబుతూనే ఉన్నారు. తాను నియోజక వర్గంలో సీనియర్‌నని, తనకు కాకుండా వేరే వాళ్లకు సీటిచ్చే చాన్స్ లేదని టీడీపీ సీనియర్ నేత పార్థసారధి తనకు క్యాడర్‌కు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీ టికెట్ సవితను వరించింది. సవిత తండ్రి మాజీ రామచంద్రారెడ్డి. ఈయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో పని చేశారు. తండ్రి సీనియర్ పొలిటీషియన్‌కావడం వల్ల సవితకు తండ్రి బలం కూడా తోడైంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సవిత ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. మంత్రి ఉషశ్రీచర్ కూడా తాను చేసిన సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడంలోను ప్రచారానికి ఖర్చు పెట్టడంలోను ఎవరికి ఎవరూ తీసిపోరు.
Next Story