ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ కు చికిత్స జరిగిందా? కథ మళ్లీ మొదటికి వస్తుందా? సీఎం దెబ్బకు చైర్మన్, ఎండీ లు ఇంటి దోవ పట్టారు.
పాలనాధికారం నాకుంది. అలాంటప్పుడు నేను ఎలా ఉండాలి. అధికారులతో చర్చించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి. ఆ సమస్య తన పై వారి ద్వారా పరిష్కరించాల్సి వస్తే తప్పకుండా వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. కానీ పవర్ చేతిలోకి రాగానే అదేదో మంత్ర దండమని, తాను చెప్పిందే జరగాలని కొందరు భావిస్తారు. అప్పుడు సమస్యలు చుట్టు ముడతాయి. చేతుల్లోకి వచ్చిన పవర్ మాయమవుతుంది. సాధారణ వ్యక్తుల కంటే అసహాయులుగా మారతారు. ఆ తరువాత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఉన్న అధికారం మనతోనే ఉండాలంటే ఎంతో జాగ్రత్త అవసరం. అది కొరవడితే కొరడా దెబ్బలు తప్పవు.
ఏపీలో ఫైబర్ నెట్ కార్పొరేషన్ అనగానే అవినీతి తాండవించే కార్యాలయమనే భావన ప్రతి ఒక్కరిలో కలిగేలా పాలకులు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంతో పాటు ఇంటింటికీ కేబుల్ టీవీ, ఫోన్, ఇంటర్ నెట్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఎన్నో ప్రయోగాలు చేసింది. అయితే ఆ ప్రయోగాలు సక్సెస్ కాలేదు. ఇటీవల చైర్మన్, ఎండీల మధ్య వచ్చిన స్పర్థల కారణంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ ప్రతిష్ఠ మరింత దిగజారింది. ప్రస్తుతం పలు రకాల ప్రైవేట్ కంపెనీలు రాష్ట్రంలో ఇంటర్ నెట్ తోపాటు కేబుల్ కనెక్షన్ లు ఇస్తున్నాయి. వాటిని తట్టుకుని ప్రభుత్వ సంస్థ అయిన ఫైబర్ నెట్ పోటీలో ఉండాలంటే నెలవారీ తక్కువ ధరకు ఇంటర్ నెట్ తో పాటు కేబుల్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఫైబర్ నెట్ ఎప్పుడు ఏర్పాటైంది..
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ నెట్ లిమిటెడ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కింద ప్రారంభించారు. అప్పట్లో సుమారు 17 లక్షల కనెక్షన్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు, ఆఫీసులకు ఇచ్చారు. తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో కనెక్షన్ ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. సుమారు పది లక్షల కనెక్షన్ లు తగ్గాయి. సంస్థలో ఇష్టానుసారం సిబ్బందిని నియమించి నష్టాల్లోకి తెచ్చారనే విమర్శలు వచ్చాయి.
బాబు సీఎంగా బాధ్యతలు తీసుకోగానే..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోగానే ఫైబర్ నెట్ సంస్థలో అవినీతి జరిగిందనే నిర్థారణకు వచ్చారు. వెంటనే హెడ్ ఆఫీసుకు సీలు వేయించారు. ఒక ప్రత్యేక కమిటీని వేసి విచారణ చేయించారు. విజిలెన్స్ వారు పలువురిపై కేసులు నమోదు చేశారు. కొందరు సస్పెండ్ అయ్యారు. ఫైబర్ నెట్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావాలనే ఆలోచన చేశారు. తన ఆలోచనలకు తగ్గట్టుగా కొత్తగా ఎండీ, చైర్మన్ లను నియమించారు.
సమన్వయం మరిచిన చైర్మన్, ఎండీ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. ఐఏఎస్ దినేష్ కుమార్ ను ఎండీగా బాధ్యతల్లో నియమించారు. జీవీ రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. కొంత మందిని తొలగించి మరికొందరిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జీవీ రెడ్డి పలు మార్లు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఫైబర్ నెట్ చైర్మన్ గా గతంలో పనిచేసిన డాక్టర్ పి గౌతంరెడ్డి ఇష్టాను సారం చేసి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. వీటన్నింటిపైనా విచారణ జరుగుతుందని చెప్పారు.
ఎండీ రాజద్రోహానికి పాల్పడ్డారంటూ ఆరోపణ
ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ రాజద్రోహ నేరానికి పాల్పడ్డారని, ఫైబర్ నెట్ లో తాను తొలగించిన 400 మందికి ఇంకా జీతాలు ఇస్తున్నారని, ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారం ఖర్చు చేసి దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంతో చేతులు కలిపి ఫైబర్ నెట్ ను చంపేయాలని ఎండీ చూస్తున్నారని ఆరోపించారు. సంస్థ ఆదాయాన్ని దెబ్బ తీస్తున్న ముగ్గురు అధికారులను తొలగించాలని ఆదేశించినట్లు చైర్మన్ చెప్పారు. సీటీఓ సత్యరామ భరద్వాజ్, బిజినెస్ హెడ్ జి సురేశ్, ప్రొక్యూర్ మెంట్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చైర్మన్ విలేకరులకు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారించేందుకు విజిలెన్స్ విచారణ జరిగిందని, విచారణకు ఉద్యోగులు సహకరించాలని ఎండీ ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నించారు.
కొందరు వెండర్లకు చెల్లింపులు నిలిపి వేయాలని విజిలెన్స్ వారు ఆదేశించినా రూ. 60 కోట్లు ఎండీ ఎందుకు చెల్లించారని నిలదీశారు. 2023-24 సంవత్సరానికి ఆడిట్ జరగలేదు. నాకు లెక్కలు చెప్పమంటే చెప్పటం లేదు. గత ప్రభుత్వ సిఫార్స్ లతో నియమించిన 410 మందిని తొలగించాలని డిసెంబరులోనే తాను ఆదేశించినా వారు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియకుండా జీతాల కింద రూ. 1.50 కోట్లు చెల్లించారని, ఇదంతా ఎండీ చేసిన రాజద్రోహ నేరాల కిందకే వస్తాయని అన్నారు. వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ ద్వారా ప్రసారం చేసే విషయంలో ఒప్పందాలకు విరుద్ధంగా చెల్లించిన మొత్తాలను వెనక్కి తీసుకోవాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. వేల కోట్ల ఆదాయం వందల కోట్లకు పడిపోయిందని ఆరోపించారు. ఇలా ఆరోపణల చిట్టా విప్పారు. దీంతో ఫైబర్ నెట్ వ్యవహారం కాస్త రోడ్డుకెక్కింది.
చైర్మన్ జీవీ రెడ్డిని వివరణ కోరిన మంత్రి
పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ చేసిన ఆరోపణలపై వివరణ కోరారు. వెంటనే మీ వద్ద ఉన్న ఆధారాలు మంత్రి పేషీకి సమర్పించాలని ఆదేశించారు. ఎండీ దినేష్ కుమార్, ప్రభుత్వ కార్యదర్శితో ప్రత్యేకంగా సమీక్షించారు. వారి నుంచి వివరాలు తీసుకున్న మంత్రి చైర్మన్ నుంచి వివరాలు అడగటంతో వివాదం ముదిరి పాకాన పడింది.
సీఎం సీరియస్
ఇంట్లో ఏవైనా సమస్యలు ఉంటే వీధుల్లోకి వచ్చి అరుస్తామా? మనం ప్రభుత్వంలో ఉన్నాం. సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని, ఇలా ప్రెస్ మీట్లు పెట్టి రచ్చకెక్కడం ఏమిటని చైర్మన్ జీవీ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీవాట్లు పెట్టారు. మీ వద్ద ఉన్న వివరాలు వెంటనే ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రికి వివరాలు ఇస్తూ తన సంజాయిషీ కూడా ఇచ్చారు. చైర్మన్ ఇచ్చిన రిపోర్టుతో సంతృప్తి చెందని ముఖ్య మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు.
చైర్మన్ పదవికి రాజీనామా
ఏపీ ఫైబర్ నెట్ ఎండీ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చైర్మన్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. చైర్మన్ స్థానంలో ఉండి రచ్చకెక్కడం వల్లనే తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
జీఏడీకి ఎండీ
ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ను బదిలీ చేస్తూ జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు ఆయన ఆర్టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీ పదవుల నుంచి తొలగించారు. దినేష్ కుమార్ పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం కూడా ముఖ్యమంత్రి వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమతో పనిచేయించుకోవడం చేత కాక దినేష్ కుమార్ పై లేనిపోని అభాండాలు చైర్మన్ వేశారని ఐఏఎస్ అధికారులు పలువురు సీఎం వద్ద ప్రస్తావించడంతో ఆయన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు.
ఇద్దరికీ తగిన శాస్తి
చైర్మన్ జీవీ రెడ్డి, ఎండీ దినేష్ కుమార్ లకు తగిన ఫనిష్ మెంట్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చిందన్న సామెతగా ఒకరు ఏకంగా పదవికి, పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. మరొకరు ఉద్యోగం కోసం వేయిటింగ్ లోకి వెళ్లాల్సి వచ్చింది.
తక్కువ ధరకే ఫైబర్ నెట్ సేవలు
రూ.149 బేసిక్ ప్లాన్‌ను మళ్లీ ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోటి మందికి ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యాచరణ అమల్లోకి తెచ్చేలా రంగం సిద్ధం అవుతోంది. ఏపీలో ఇంటింటికీ అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్నెట్.