తుని మునిసిపల్ ఆఫీసు బయట గుమి కూడిన పార్టీల నాయకులు

ఆంధ్రప్రదేశ్లో మూడు మునిసిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో ఒక చోట టీడీపీ గెలవగా, రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి.


కాకినాడ జిల్లా తుని మునిసాపాలిటీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో 24 వార్డులు వైఎస్సార్ సీపీకి రాగా, తెలుగుదేశం పార్టీకి 6 వార్డులు వచ్చాయి. దీంతో వైఎస్సార్సీపీ అక్కడ విజయం సాధించింది. ప్రస్తుతం చైర్మన్ గా సుధాబాలు ఉన్నారు. వైస్ చైర్మన్ పోస్టుకు ఇక్కడ ఎన్నిక జరగాల్సి ఉంది. వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థికి కాకుండా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేస్తేనే లోపలికి వెళ్లాలని, లేదంటే గేటు బయటే ఉండాలని తెలుగుదేశం పార్టీ వారు పట్టుబట్టారు. పలువురు కార్యకర్తలు గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వైఎస్సార్ సీపీ వారు కూడా తమను కౌన్సిల్ హాలులోకి సెక్యూరిటీతో తీసుకు పోవాలని గేటు వద్ద ధర్నాకు దిగారు. ఈనెల 3,4 తేదీలో జరిగిన ఎన్నికలోనూ ఇదే తంతు జరిగింది. నేడు ఎన్నిక జరగనుంది. ఉదయం సమయం ప్రకారం ఎన్నికల అధికారి కౌన్సిల్ హాలులోకి వచ్చారు.

మొత్తం వార్డు సభ్యుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో ఆరు వార్డు సభ్యులను గెలుచుకుంది. వారికి తోడు వైఎస్సార్సీపీ నుంచి నలుగురు తెలుగుదేశం పార్టీ వైపు మద్దతు పలికారు. దీంతో తెలుగుదేశం పార్టీ సభ్యుల సంఖ్య పదికి చేరింది. 13 మంది ఉంటేనే కాని కౌన్సిల్ ఎన్నిక జరుగుతుంది. మొత్తం 24 మంది కౌన్సిల్ సభ్యుల్లో 13 మంది ఎవరిని బలరిస్తే వారు ఎన్నికవుతారు. ఇక్కడ మునిసిపల్ చైర్మన్ గా వైఎస్సార్ సీపీ నాయకు రాలు సుధాబాలు ఉండగా వైఎస్ చైర్మన్ పోస్టుకు ఎన్నిక జరుగుతోంది. ఎలాగైనా వైఎస్ చైర్మన్ పోస్టును సాధించి తునిలో తమకు ఎదురు లేదని నిరూపించుకోవాలనే ఆలోచనలో తెలుగుదేశం వారు ఉన్నారు. కేవలం పది మంది సభ్యులు మాత్రమే సమావేశానికి హాజరు కావడంతో సమావేశంలో మెజారిటీ సభ్యలు లేక వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారి ప్రకటించారు. కోరం లేకపోవడం వల్ల సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.

వైరి వర్గాలు పోలీస్ స్టేషన్ కు...

మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తమ వర్గం వారిని లోపలికి పోకుండా అడ్డుకోవడంతో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొట్లాడుకునేందుకు కూడా ముందుకు దూకారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. అయినా వైఎస్సార్సీపీ వార్డు సభ్యులను లోపలికి పోకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల వారిని పోలీసులు స్టేషన్ కు తీసుకు పోయారు. కేసు నమోదు చేస్తారా? ప్రైవేట్ పంచాయతీ నిర్వహించి ఇంటికి పంపిస్తారా? అనేది ఇంకా పోలీసులు నిర్ణయించలేదు.

పాలకొండ పరిస్థితిలో మార్పు లేదు

పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఎన్నికను బాయ్ కాట్ చేశారు. దీంతో సమావేశం కోరం లేక ఎన్నిక ఈనెల 18వ తేదీకి వాయిదా పడింది. ఈ నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ తరుపునే సభ్యులు అంతా గెలిచారు. అందులో ముగ్గురు టీడీపీలో చేరగా ఒకరు జనసేన పార్టీలో చేరారు.

పాలకొండ నగర పంచాయతీలో వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉంది. ఈ నగర పంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఇందులో 17 పంచాయతీల్లో వైఎస్సార్సీపీ గెలుపొందగా 3 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ గతంలో గెలుపొందింది. ఇక్కడ మునిసిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన యందవ రాధాకుమారి ఇటీవలి వరకు ఉన్నారు. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. ఆయన చనిపోవడంతో రాధాకుమారికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆమె మునిసిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ చైర్మన్ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈ మునిసిపాలిటీ చైర్మన్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. రెండో వార్డు నుంచి గెలిచిన ఆకుల మల్లీశ్వరి ఒక్కరు మాత్రమే ఎస్సీ మహిళగా ఉన్నారు. దీంతో ఆమె మాత్రమే ఎన్నికలో పోటీ చేసేందుకు అర్హురాలు.

ఇప్పటి వరకు వైఎస్సార్ సీపీలో ఉన్న మల్లీశ్వరి ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈమె ఎన్నికలో పోటీ చేయాలంటే వైఎస్సార్సీపీ బీ ఫారం ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీలో చేరినా బి ఫారం ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. అయితే ఈమె తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల వైఎస్సార్సీపీ బీ ఫారంపై పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎన్నికల అధికారికి ఆమె చెప్పారు. అందుకు నిబంధనలు అంగీకరించవని ఎన్నికల అధికారి ఆమెకు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ తరపున గెలిచారు కాబట్టి ఆ పార్టీ తరపున మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నిక ఆగిపోయింది. ఆమె కాకుండా పోటీ చేసే అర్హత వేరే వారికి లేకపోవడంతో నేటి ఎన్నిక కూడా వాయిదా పడింది. రేపటికి ఎన్నికను వాయిదా వేశారు. అయినా మంగళవారం కూడా ఎన్నిక జరిగే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. అదే జరిగితే మునిసిపాలిటీ ప్రత్యేకాధికారి పాలన కిందకు వెళ్లే అవకాశం ఉంది.

పిడుగు రాళ్లలో వైఎస్ చైర్మన్ పోస్టు టీడీపీ కైవసం

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మునిసిపాలిటీలో 33 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లోనూ గతంలో వైఎస్సార్సీపీ గెలిచింది. వైఎస్ చైర్మన్ గా ఉన్న వ్యక్తి చనిపోయారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. 33 మందిలో ఒకరు చనిపోతే 32 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఐదుగ్గురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ చైర్మన్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు తెలుగుదేశం పార్టీ వారికి తగిన బలం లేదు. దీంతో గత ఎన్నికలో వైఎస్సార్సీపీ వారిని మునిసిపల్ హాలులోకి రాకుండా అడ్డుకుంటున్నారు. రేపాళ్ల రమాదేవి వైఎస్ చైర్మన్ పోస్టుకు పోటీ చేస్తోంది. ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించిన ఎన్నికల్లో కోరం లేక సమావేశం వాయిదా పడినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. నేడు జరిగిన ఎన్నికలో మెజారిటీ సభ్యులను తెలుగుదేశం పార్టీ వారు చూపించడంతో ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు గెలిచారు.

పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీ సభ్యులను కిడ్నాప్ చేసి, చంపుతామని బెదిరించి వారిచేత ఓటు వేయించుకున్నారని, ఈ బెదిరింపులకు పాల్పడింది ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి అని వైఎస్సార్ సీపీ వారు ఆరోపిస్తున్నారు. అయినా ఇక్కడ టీడీపీ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

Next Story