వైఎస్ జగన్‌పై కేసు.. ఇద్దరు ఉన్నాధికారులపై..
వైఎస్ జగన్ సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, పీవీ సునీల్ కుమార్‌లపై గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడానికీ రంగం సిద్ధమైందనిపిస్తోంది.
‘కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి’ అన్న మాట మనం ఎన్నో సందర్భాల్లో వింటూనే ఉంటాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కూడా అదే చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి గత ప్రభుత్వ నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఏదో ఒక అంశంలో వైసీపీ నేతలపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవల 2021లో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో దాదాపు 16 మంది వైసీపీ నేతల పేర్లు పేర్కొనబడ్డాయి. కాగా ఈ కేసుకు సంబంధించి ఎవరిపై కూడా జూలై 16 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విధంగా పలువురు ఇతర నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి.
పిన్నెల్లితో మొదలైన కేసుల పరంపర
ప్రభుత్వం మారిన తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తొలిసారి కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత కొడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతేకాకుండా ద్వారంపైడి చంద్రశేఖర్‌పై కూడా ప్రభుత్వ అధికారిని విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారన్న కేసు నమోదైంది. వీరితో పాటు మాజీ మంత్రి కొడాలి నానిపై వాలంటీర్ల రాజీనామా అంశానికి సంబంధించి, వల్లభనేనిపై కూడా కేసు నమోదైంది. తాజాగా ఇవన్నీ కాదు.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్న రీతిలో.. డైరెక్ట్‌గా వైసీపీ అధినేత జగన్‌పైనే కేసు నమోదైంది. దానికి వైసీపీ మాజీ ఎంపీ ఇచ్చిన ఫిర్యాదే కారణం.
రఘురామ ఫిర్యాదే మూలం
2021లో హైదరాబాద్‌లో తనను సీఐడీ అరెస్ట్ చేసిందని, కానీ ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ట్రాన్సిట్ వారెంట్ తీసుకోకుండానే గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందంటూ తాజాగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఇద్దరు ఐపీఎస్ అధికారులు, అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రఘురామ ఫిర్యాదులో ఏం చెప్పారంటే
‘‘కొందరు పోలీసుల అధికారులు పీవీ సునీల్ కుమార్, అప్పటి సీఐడీ డీజీ, సీతారామాంజనేయులు ఐపీఎస్ సహా మరికొందరు పోలీసు సిబ్బంది సీఐడీ కార్యాలయంలోకి వచ్చారు. నన్ను రబ్బర్ బెల్ట్, లాఠీలతో విచక్షణారహితంగా కొట్టారు. ఆఖరికి గుండెజబ్బుతో బాధపడుతున్న నన్ను ఔషధాలు కూడా తీసుకోనివ్వలేదు. ఇదంతా కూడా అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రేరేపితంగానే జరిగింది. ఆయన చెప్పారనే ఈ అధికారులంతా ఇంత కర్కశంగా ప్రవర్తించారు. అందుకు కొన్ని రోజుల ముందే నా బైపాస్ సర్జరీ జరిగిందని జగన్‌కు తెలిసే ఆయన ఇదంతా చేయించారు. అంతేకాకుండా నన్న చిత్రహింసలు పెడుతున్న క్రమంలోనే కొందరు వ్యక్తులు నా ఛాతీపై కూర్చుని గుండెపై ఒత్తిడి పెంచి నన్ను చంపాలని కూడా ప్రయత్నించారు. నా ఫోన్‌ను లాక్కొని దాని పాస్‌వర్డ్ చెప్పాలని కూడా చిత్రవధ చేశారు. ఆ తర్వాత నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభావతి కూడా పోలీసు అధికారులు ఒత్తిడితో తప్పుడు వైద్య ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా సీఎం జగన్‌ను విమర్శిస్తే ఈసారి చంపేస్తామని కూడా పీవీ సునీల్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు’’ అని రఘురామకృష్ణం రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుప్రీం కోర్టులో మూడేళ్ళు నడిచి … సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ తిరస్కరించిన కేసులో కొత్తగా FIR వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను
— PV Sunil Kumar (@PV_Sunil_Kumar) July 12, 2024
రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు పోలీసులు స్పందించారు. ‘‘రఘురామ ఇచ్చి ఫిర్యాదులో చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిలోకి కొన్ని అత్యంత దారుణమైనవి, తీవ్రమైనవి కూడా ఉన్నాయి. వాటిపై తప్పకుండా విచారణ జరిగి తీరాల్సిందే. ఈ విచారణను సరైన పోలీసు అధికారుల చేత దర్యాప్తు చేయించాలి’’ అని గుంటూరు పోలీసు అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మాజీ సీఎం వైఎస్ జగన్, తనపై కేసు నమోదు కావడంపై పీవీ సునీల్ కుమార్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘సుప్రీం కోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీం కోర్టే ఈ కేసును తిరస్కరించింది. ఇందులో ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’’ అంటూ ఆయన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్ పెట్టారు.