విశాఖ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. కారణమేంటో చెప్పిన అధికారులు..
x

విశాఖ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం.. కారణమేంటో చెప్పిన అధికారులు..

విశాఖ రైల్వే స్టేషన్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


విశాఖ రైల్వే స్టేషన్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేశారు. అనంతరం రైల్వే ట్రాక్‌ను క్రియర్ చేసే చర్యలు కూడా చేపట్టారు. ఈ ప్రమాదంలో దాదాపు నాలుగు బోగీలు దగ్దమయ్యాయని, ఇందులో ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు చెప్పారు. ప్రయాణికులంతా దిగేసిన తర్వాత ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదం ఏసీ బోగీల్లో జరిగినట్లు అధికారులు వివరించారు. ఆస్తి నష్టం ఎంత జరిగింది అనే దానిపై లెక్కలు ఇంకా కట్టాల్సి ఉందని చెప్పారు.

‘‘ఉదయం 10 గంటల సమయంలో తొలుత బీ7 బోగీలో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బీ6, బీ8, ఎం1 బోగీలకు వ్యాపించాయి. స్టేషన్‌లో 4వ నెంబర్ ఫ్లాట్ ఫార్మ్‌పై ఈ ఘటన జరిగింది. వెంటనే ఆ ఫ్లాట్ ఫార్మ్ ఖాళీ చేయించి భద్రతా చర్యలు చేపట్టాం. మంటలను ఆర్పిన తక్షణం లైన్‌ను క్రియర్ చేసే పనులు ప్రారంభించారు. ఇంజన్‌ నుంచి ఆ నాలుగు బోగీలను డిటాచ్ చేసి.. ఇంజన్‌ను పంపేశాం. ఈ ప్రమాదంపై విశాఖ పోలీసులు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది’’ అని విశాష సీపీ శంకబ్రత బాగ్చీ చెప్పారు. రైలు నుంచి పొగ వస్తుండటంతోనే ప్రమాదం జరిగినట్లు భావించి రాము అనే వ్యక్తి ఆర్‌పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారని, వెంటనే సిబ్బంది స్పందించడంతో నష్టాన్ని వీలంత వరకు తగ్గించామని, మంటలను సకాలంలో ఆర్పేయగలిగామని చెప్పారాయన.

అయితే బీ7 బోగీలోని టాయిలెట్ షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని, కాగా షార్ట్ సర్క్యూట్ గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, ఈ ప్రమాదం యాధృచ్చికంగా జరిగిందా లేకుంటే ఎవరైనా కావాలనే చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని సీపీ బాగ్చీ చెప్పారు. ఒకవేళ ఇది ఎవరైనా కావాలని చేసిందే అయితే వారిని అతి త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టు ముందు నిలబెడతామని కూడా అన్నారు. అది ఎవరైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు.

ఫోన్ చేసిన హోం మంత్రి

రైలు ప్రమాద ఘటన సమాచారం అందడంతో విశాఖ రైల్వే స్టేషన్ డీఆర్ఎంతో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఫోన్‌లో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో జరిగిన నష్టం గురించి ఆరా తీశారు. ప్రయాణికుల యోగ క్షేమాలకు పెద్ద పీట వేయాలని, ప్రయాణికులు అందరూ సురక్షితమేనా కాదా అని కూడా నిర్ధారించుకోవాలంటూ అధికారులను దిశానిర్దేశం చేశారు. అదే విధంగా షార్ట్ సర్క్యూట్‌కు కారణం ఏంటో కూడా వీలైనంత త్వరగా తెలుసుకోవాలని, తద్వారా మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వీలవుతుందని వివరించినట్లు సమాచారం.

కారణాలేంటో..

అయితే ఈ ప్రమాదం నేపథ్యంలో అసలు రైల్వే కోచ్ బాత్రూంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి కారణాలేమై ఉంటాయనేది ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. హై ఓల్టేజ్, ఎలక్ట్రికల్ ఫ్లక్చుఏయన్స్, డ్యామేజ్ అయిపోయిన వైరింగ్, మెయింటనెన్స్ లోపం వంటివి కారణాలై ఉండొచ్చని, లేని పక్షంలో ఎవరైనా కావాలనైనా చేసి ఉండొచ్చ అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ఈ అంశాలను నిర్ధారించడానికి పోలీసు శాఖ కసరత్తులు చేస్తోందని, రేపు మధ్యాహ్నానికి ఈ విషయాలపై క్లారిటీ రావొచ్చని తెలుస్తోంది.

Read More
Next Story