ఈనెల 4న కౌంటింగ్‌ జరుగుతుంది. మొదటి ఫలితాలు రెండు నియోజకవర్గాల్లో మధ్యాహంలోపులోనే వెలువడతాయి.


అందరి దృష్టి ప్రస్తుతం కౌంటింగ్‌పైనే ఉంది. ఈనెల 4న కౌంటింగ్‌ జరగనుంది. జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సంఘం కౌంటింగ్‌ నిర్వహిస్తుంది. ఇప్పటికి ఎన్నికలు జరిగి 18 రోజులు పూర్తయింది. మూడో రోజు అంటే 4న కౌంటింగ్‌ ఉంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. బూత్‌ లెవెల్‌లో తమ ఏజెంట్ల ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులు సమాచారం తెప్పించుకుని ఏ బూత్‌లో ఎన్ని ఓట్లు తమ పార్టీకి వస్తున్నాయో అనే విషయంలో ఒక అంచనాకు వచ్చారు. గెలుస్తామని ధీమా ఉన్న వారు నిమ్మలంగా ఉండగా ఓటమి అంచున్న ఉన్న వారు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తుది ఫలితాలు వెలువడే సరికి రాత్రి 10 గంటలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కపెట్టాల్సి ఉండటంతో అవి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రౌండ్స్‌ ఎక్కువగా ఉన్న నియోకవర్గాల్లో ఫలితాలు ఆలస్యంగా వెలువడుతాయి. ఆలస్యంగా ఫలితాలు వెలువడే చోట అభ్యర్థులు మరీ టెన్షన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలైన ఓట్లు, కౌంటింగ్‌ హాళ్లలో ఏర్పాటు చేసిన టేబుళ్ల ఆధారంగా ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపునకు అవసరమైన రౌండ్లను నిర్ధారించింది.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ (ఎస్సీ), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల తుది ఫలితాలు మధ్యాహ్నంలోపే ప్రకటించే అవకాశముందని ఎన్నికల సంఘ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. పాణ్యం, భీమిలి నియోజకవర్గాల్లో 25 రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో తుది ఫలితాల వెల్లడికి రాత్రి 7 గంటల వరకు వేచిచూడాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో రంపచోడవరం (ఎస్టీ), చంద్రగిరి నియోజకవర్గాల్లో అత్యధికంగా 29 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
మొత్తం 175 నియోజకవర్గాల్లో అత్యధికంగా 111 నియోజకవర్గాల్లో 20కంటే తక్కువ రౌండ్లలోనే లెక్కింపు పూర్తికానుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 60 నియోజకవర్గాల్లో 21 నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నియోజకవర్గాల ఫలితాలను సాయంత్రంలోగా వెల్లడిస్తారు. ఎటువంటి గందరగోళం లేకుండా అందరి అనుమతితోనే సువిధ యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాతే ఫలితాలను ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21సీ, 21ఈలను అదేరోజు ఫ్లైట్‌లో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పంపిస్తారు.
Next Story