ప్రతి పేదకూ.. నెలకు రూ. 5 వేలు

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ. 5వేలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది.


ప్రతి పేదకూ.. నెలకు రూ. 5 వేలు
x
Mallikarjuna kharge, YS Sharmila

(ఎస్‌.ఎస్‌.వి.భాస్కర్‌ రావ్‌)

సమైక్య ఆంధ్ర ప్రదేశ్‌ విడిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో జనం పాతర వేశారు. మళ్లీ జవసత్వాలు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమైంది. ఇందుకోసం అనంతపురం వేదికగా సోమవారం సాయంత్రం జూనియర్‌ కాలేజి గ్రౌండ్‌ లో ‘న్యాయ సాధన సభ’ పేరుతో ఏపీసీసీ నిర్వహించిన ఎన్నికల తొలి ప్రచార సభ సఫలమైందని చెప్పవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు నాయకులు భారీగానే హాజరై కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరి పోసినట్లు కనిపించింది.
ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సొంత అన్న, సీఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డితో విభేదించిన వైయస్‌ షర్మిలరెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కాంగ్రెస్‌ పునరేకీకరణ సభలతో ఉత్సాహం నింపారు. అనంతలో జరిగిన బహిరంగ సభ అనుకున్న లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకులు సంతృప్తి చెందుతున్నారు.


ఏపీలో అధికారంలోకి రాగానే..
ఎన్నికల తొలి ప్రచార సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తే అమలు చేసే మేనిఫెస్టోలో భాగంగా మొదటి పథకాన్ని ప్రకటించారు. పేదరికం నిర్మూలన, అసమానతులు తొలగించడానికి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి మహిళల పేరుతో ఇందిరమ్మ అభయహస్తం పేరిట నెలకు రూ. 5,000 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. మళ్లీ సంక్షేమ పాలన ఇంటి వద్దకే తెస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్‌ అంటే మోదీకి భయం
ప్రధాని మోదీ ఎప్పుడు కాంగ్రెస్‌ జపం చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ లేనేలేదు అంటున్నారు. అలాంటప్పుడు మా ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారు. మా ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నారు? అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, విపక్ష నాయకుడు ఎన్‌ చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని ఎన్నిసార్లు కలిసారని ఆయన నిలదీశారు. ప్రధాని మోదీ వద్ద మీ ఇద్దరూ ఎందుకు మోకరిల్లుతున్నారనేది అర్థం కావడం లేదని సీఎం వైయస్‌ జగన్, విపక్ష నేత ఎన్‌ చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్‌. ఆంధ్ర రాష్ట్రాన్ని మోదీకి చంద్రబాబు, జగన్‌ అమ్మేశారు అని అన్నారు.
షర్మిల రెడ్డి సీఎం అవుతారు..
దేశం గర్వించే నాయకుడు దివంగత సీఎం వైయస్సార్‌ను ఆంధ్రప్రదేశ్‌ అందించిందని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభివర్ణించారు. మహానాయకుడు బిడ్డ వైయస్‌ షర్మిల రెడ్డిని ఈ రాష్ట్రానికి నాయకురాలు చేశాం అంటూ ఆయన పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకనాడు తప్పకుండా వైఎస్‌ షర్మిల రెడ్డి సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. కన్నడ, హిందీ, ఇంగ్లీష్‌లో సాగిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగాన్ని మాజీ మంత్రి ఎన్‌ రఘువీరారెడ్డి తెలుగులోకి అనువదించి వివరించారు.


నిప్పులు చెరిగిన షర్మిల
స్వప్రయోజనాల కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి కేంద్రానికి తాకట్టు పెట్టారని పీసీసీ అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల రెడ్డి తన అన్నపై పదునైన మాటలతో విమర్శలు సంధించి సభలో ఉత్సాహం నింపారు. సీఎం వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తో పాటు విపక్ష నాయకుడు ఎన్‌ చంద్రబాబు నాయుడు కూడా మోడీకి బానిసలుగా మారారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సభలో రాయలసీమ ప్రాంత మాజీ మంత్రులు, నాయకులతోపాటు సీనియర్‌ నాయకుడు కనుమూరి బాపిరాజు, కేంద్ర మాజీ మంత్రులు జెడి శీలం, పల్లంరాజు, కే. రాజు, పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు పాల్గొన్నారు.
Next Story