యువ క్రికెటర్ల పౌష్టికాహారం కోసం రూ. 1.50 కోట్లు
దేశంలోనే మొదటి సారి క్రికెటర్లకు పౌష్టికాహారం కోసం చెక్కును అందజేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్.
పౌష్టికాహార లేమితో ఉన్న జోనల్ స్ధాయి 400 మంది క్రికెటర్లకు పౌష్టికాహారం కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రూ. 1.50 కోట్ల సాయం అందజేసింది. యువ క్రికెటర్లు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదని ఎసిఎ నిర్ణయించింది.
అకాడమీలు, కోచింగ్ క్యాంప్‌లలో శిక్షణ తీసుకున్న వారి పౌష్టికాహారం కోసం నెలకు ఒక్కొక్కరికి రూ. 3 వేల చొప్పున 400 మంది క్రికెటర్లకు ఏటా రూ. 1.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏసీఏ పరిధిలో ఉన్న అకాడమీలు, సబ్ సెంటర్లలో కల్పించిన మౌలిక సదుపాయాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. క్రీడాకారుల ప్రతిభ, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారిని ప్రోత్సహించేందుకు పౌష్టికాహారం కోసం జోన్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఆటగాడికి నెలకు రూ. 3 వేల చొప్పున అండర్ 14, 16, 19 బాలురకు, 15, 19 వయసున్న బాలికలకు పౌష్టికాహారం కోసం ఏడాదికి రూ. 1.50 కోట్లు ఎసిఎ కేటాయించింది.
వైజాగ్‌లోని పీఎం పాలెంలో ఉన్న క్రికెట్ స్టేడియంలో మంగళవారం ఏసీఏ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపినాథ్‌రెడ్డి, బీసీసీ మాజీ ప్రెసిడెంట్, భారత మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరభ్ గంగూలీ, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చేతుల మీదుగా రూ. 1.50 కోట్ల విలువ చేసే చెక్కును క్రికెటర్లకు అందించారు.
కార్యక్రమంలో ఎసిఎ కార్యదర్శి ఎస్‌ఆర్ గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ యువ క్రికెటర్లు పౌష్టికాహార లేమితో బాధ పడకూడదనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి శరత్ చంద్రారెడ్డి నాయకత్వంలోప్రణాళికను అమలు చేసినట్లు తెలిపారు. ఏసీఏ జాయింట్ సెక్రెటరీ రాకేష్, సీఈవో డా. యంవి శివారెడ్డి, జనరల్ మేనేజర్లు ఎంఎస్ కుమార్, ఎస్‌ఎంఎన్ రోహిత్‌లు పాల్గొన్నారు.
Next Story