ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా ముందుకు వెళ్లేందుకు అవకాశం సుగుమమైంది. నిధులు లేని కారణంగా అమరావతి నిర్మాణం నిదానంగా జరిగే అవకాశం ఉందనే అనుమానాన్ని మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ద్వారా రూ. 15వేల కోట్లు ఇప్పించేందుకు గత బడ్జెట్ సమావేశాల్లోనే తెలిపింది. బడ్జెట్‌లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఇప్పటికి రెండు సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని సంప్రదించి అమరావతి నిర్మాణానికి సాయం అందించాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు. జనవరి నుంచి పనులు వేగంగా జరుగుతాయని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పటికే పలు మార్లు ప్రకటించారు. అమరావతి నిర్మాణ పనులను నారాయణ పర్యవేక్షిస్తున్నారు. సీఆర్‌డీఏ ద్వారా ఎప్పటికప్పుడు పనులు జరుగుతున్నాయి. ప్రతి వారానికి ఒక సారి సీఆర్‌డీఏ వారితో నారాయణ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
హడ్కో ద్వారా అప్పు
హడ్కో ద్వారా రుణం అమరావతికి ఇవ్వనున్నారు. ఈ మేరకు హడ్కో, జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్లు్య డెవలప్‌మెంట్ బ్యాంకు కన్సార్టియంగా ఏర్పడి రుణం ఇచ్చేందుకు నిర్ణయించాయి. హడ్కో నుంచి రూ. 11వేల కోట్లు, జర్మన్ బ్యాంకు నుంచి రూ. 5వేల కోట్లు కలిపి రుణం ఇవ్వనున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి కూడా రుణం ఇచ్చేందుకు నిర్ణయించినందున ఇకపై అమరావతిలో పనులు వేగంగా జరిగేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. హడ్కో, కేఎఫ్‌డబ్లు్య బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపేందుకు సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్‌కు పూర్తి అధికారాలు ప్రభుత్వం ఇచ్చింది. ఈ నిదులతో ప్రధానంగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనం, విభాగాధిపతుల భవనాలు నిర్మిస్తారు. విభాగాధిపతుల భవనాల టవర్ల డిజైన్లు రూపకల్పన చేసేందుకు లండన్‌కు చెందిన ఆర్క్‌టెక్ట్ సంస్థ నార్మన్ పోర్టర్ దాని పర్ట్‌నర్స్‌కే దక్కింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నార్మన్‌పోస్టర్ సంస్థనే ఈ భవనాల డిజైన్ల రూపకల్పనకు ఎంపిక చేశారు. ఆ తరువాత అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజధాని వ్యవహారాన్ని పక్కన బెట్టడం, తిరిగి ఇప్పుడు తెరపైకి రావడం జరిగాయి.
రాష్ట్ర అప్పుల పరిధిలోకి రాని రుణం
ప్రస్తుతం హడ్కో, జర్మన్ బ్యాంకు నుంచి తీసుకుంటున్న రుణం రాష్ట్ర రుణ జాబితాలోకి రాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అప్పులు కేవలం అమరావతి కోసమే వారు ఇస్తున్నారు. అమరావతి నిర్మాణాలు పూర్తి కాగానే వచ్చే సంపద నుంచి వారి అప్పులు తీర్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంపై రుణ భారం పడకుండా అమరావతికి అప్పులు తీసుకు రావడం గొప్పగానే చెప్పొచ్చని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. పలు వ్యాపార సంస్థలు కూడా ఇక్కడికి వస్తున్నందున అమరావతి అంటే గొప్ప పరిపాలనా కేంద్రమే కాకుండా వ్యాపార కేంద్రంగా కూడా పేరు సంపాదిస్తుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలన్నీ ఐదు టవర్లలోనే నిర్మించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ టవర్లలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. దీని ద్వారా పనుల కోసం వచ్చే వారికి కూడా అధికారులను కలవడం ఈజీ అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.