ఆంధ్రప్రదేశ్‌లో ఆ రెండిటికి వ్యతిరేకంగా తాము యుద్ధం చేస్తున్నామని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో యుద్ధాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస ఎల్లోమీడియా..అనైతిక సోషల్‌ మీడియాలు రాజ్యమేలుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా తాము యుద్ధం చేస్తున్నామని జగన్‌ తెలిపారు. కూటమి ప్రభుత్వం తీరు, సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోని లోపాలపై గురువారం సుదీర్ఘంగా మాట్లాడిన జగన్, శుక్రవారం ట్వీటర్‌ ద్వారా స్పందించారు. రాక్షస ఎల్లో మీడియా, అనైతిక సోషల్‌ మీడియాకు వ్యతిరేకంగా తాము యుద్ధం చేస్తున్నామని ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ఈ యుద్ధంలో అంతిమంగా తమదే అని, అల్టిమేట్‌గా న్యాయమే గెలుస్తుందని జగన్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రాక్షస ఎల్లో మీడియా, అనైతిక సోషల్‌ మీడియా పెట్రిగి పోతోందని, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల మీద నిత్యం అక్రమ కేసులు పెడుతున్నారని, తీవ్రమైన వేధింపులు, నిర్భంధాలకు గురి చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రతి కార్యకర్తకి, ప్రతి సైనికుడికి తాను అండగా నిలుస్తానని, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు. జగన్‌ చేసిన ఈ పోస్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ పత్రికల్లో వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియాపై సంచలన కథనాలు ప్రచురించిన నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా స్పందించారనే టాక్‌ వినిపిస్తోంది.

Next Story