గత ఐదేళ్లల్లో బోసిపోయిన ఏపీ సచివాలయానికి కళొచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, అధికారులు సచివాలయంలో అందుబాటులో ఉండనున్నారు.


అమరావతిలో మళ్లీ పూర్వపు కళ మొదలైంది. అమరావతి రాజధానిగా ఉండాలని ఐదేళ్ల కాలం ఆందోళనలు చేపట్టిన రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి జీవ కళొచ్చినటై్టంది. గడిచిన ఐదేళ్లల్లో మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధాన శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కానీ సచివాలయంలో పెద్దగా కనిపించే వారు కాదు. అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగించారు. మంత్రులెవరైనా సీఎంను కలవాలనుకుంటే ముందు రోజే అప్పాయింట్‌మెంట్‌ తీసుకుని మరుసటి రోజు కలిసే వారు. ముఖ్యమైన ఫైళ్లమీద సంతకాలు పెట్టించుకునేందుకు ప్రభుత్వ కార్యదర్శులు క్యాంపు కార్యాలయానికి వస్తే సీఎంఓ కార్యదర్శులు ఆ ఫైళ్లపై ముఖ్యమంత్రితో సంతకాలు పెట్టించి పంపించే వారు.

పూర్తిగా మారిన స్వరూపం
గత ఐదేళ్లల్లో జగన్‌ నిర్వహించిన పరిపాలన స్వరూపాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా మార్చి వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. మంత్రులు కూడా నిత్యం సచివాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఫీల్డ్‌ విజిట్లకు, క్యాంపులు, ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు మినహా తక్కిన సమయం సచివాలయంలోనే ఉండాలని, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, అధికారులు కూడా నిత్యం అందుబాటులో ఉండాలని, మంత్రులకు, అధికారులకు ఇప్పటికే సీఎం ఆదేశించారు. దీంతో సచివాలయంలో సచివులు నిత్యం అందుబాటులో ఉండటం వల్ల సచివాలయాన్ని చూసేందుకు, మంత్రులను కలిసేందుకు, పనులుపై సచివాలయానికి వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. సచివాలయ సందర్శన కోసం వచ్చే వారితో పాటు పనుల కోసం వచ్చే వారితో ఇన్నాళ్లు బోసిపోయిన సచివాలయం తాజాగా కళకళలాడుతుందనడంలో సందేహం లేదు.
జగన్‌ ప్రభుత్వ హయాంలో సచివాలయం లోపల, బయట మెయింటెనెన్స్‌ కూడా తగ్గి పోయింది. కరకట్ట నుంచి సచివాలయం, హైకోర్టుకు వెళ్లేందుకు నిర్మించిన సీడీ యాక్సెస్‌ రోడ్డు కూడా మెయింటినెన్స్‌ ఉండేది కాదు. రోడ్డుకు ఇరువైపుల డివైడర్‌కు మధ్యలో నాటిన మొక్కలకు నీళ్లు బోసే దిక్కు కూడా లేకుండా పోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం రోడ్లు, సచివాలయం మెయింటినెన్స్‌లు చాలా బాగుండేదని సందర్శకులు చెప్పే వారు. తిరిగిన చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సీడీ యాక్సెస్‌ రోడ్డును పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయించారు. రోడ్డుపై విద్యుత్‌ దీపాలను పునరుద్దరించారు. రాత్రి ఆరు గంటల నుంచి 10 గంటల వరకు కూడా విద్యుత్‌ దీపాలతో రహదారి రంగురంగులతో కళకళలాడుతోంది. రెండేళ్లల్లో అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందని, రైతులకు చేయాల్సిన సాయాన్ని కూడా చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్పప్పుడు రూపొందించిన ప్రణాళిక ప్రకారమే సీఆర్‌డీఏ అమలుకు చర్యలు తీసుకుంటుందని నారాయణ మీడియాకు వెల్లడించారు. సచివాలయంలో చిన్పపాటి రిపేర్లను కూడా ప్రభుత్వం ఆగమేఘాలపై మొదలు పెట్టింది. బ్యూటిఫికేషన్‌ విషయంలోను తగిన చర్యలు చేపట్టింది. ఇకపై అమరావతిలోని సచివాలయం ఎంతో ఆకర్షణీయంగా కనిపించే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా రాత్రి పది గంటలు దాటితే గేట్లకు తాళాలు వేసి సెక్యురిటీ సైతం కనిపించకుండా పోయే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉండే అవకాశం లేదు. ఉన్నతాధికారులు అవసరమైతే రాత్రి 10 గంటల వరకు కార్యాలయాల్లో ఉండి ఏ రోజు పనులు అదే రోజు పూర్తి చేసుకొని వెళ్లాలని మంత్రుల నుంచి ఆదేశాలు ఉన్నాయి.
Next Story