సంకటంలో గంటా : మనోభీష్టమా.. అధిష్టానమా?
టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సంకట స్థితిలో పడ్డారు. ఓవైపు అధిష్టానం ఆదేశం, మరోవైపు మనోభీష్టం ఎటువైపు తూగాల అని మదన పడుతున్నారు.
(తంగేటి.నానాజీ,విశాఖపట్నం)
"ఓటమెరగని నాయకుడు"
'గంటా శ్రీనివాసరావు'.... ఉత్తరాంధ్రలో ఈ పేరు వినని, తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా మంత్రిగా దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఈయన 1999 లో తెలుగుదేశం పార్టీలో చేరి అనకాపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత మెగాస్టార్ చిరంజీవి పై అభిమానంతో ‘గంటా’ పీఆర్పీ లో చేరారు. 2009 లో పీఆర్పీ టికెట్ పై అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ గెలుపొందారు.
ఇక్కడ ఆయనకు మరో అంశం కలిసొచ్చింది. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో రాష్ట్ర మంత్రిగా అవకాశం వచ్చింది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఉనికిని కోల్పోవడంతో ‘గంటా’ తిరిగి సొంతగూటికి చేరారు. టీడీపీ తరఫున భీమిలి టికెట్ సాధించి 2014లో మళ్లీ ఎమ్మెల్యే అయిపోయారు. అంతేకాకుండా చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. తిరిగి 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇప్పుడు తమ పార్టీ అధికారంలో లేనందున ఎమ్మెల్యే గానే ఉండిపోయారు.
"టిక్కెట్ కేటాయింపులో గంటాకు మొండి చేయి"
సార్వత్రిక ఎన్నికల సమరం 2024 రానే వచ్చింది.. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. సీట్లు సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చిన ఇరు పార్టీలు తొలి జాబితాను విడుదల చేశాయి. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన తొలి జాబితాలో సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడం విశేషం.
విశాఖ నగరం నుంచి గెలుపొందిన నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరడంతో మిగిలిన ముగ్గురిలో ఇద్దరికి టికెట్లు ఖరారయ్యాయి. ఈ జాబితాలో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ల పేర్లు మాత్రమే ఉండగా, గంటా పేరు మాత్రం గల్లంతయ్యింది.
దీనికి కారణం గంటా శ్రీనివాసరావును, మంత్రి బొత్స సత్యనారాయణ పై విజయనగరం జిల్లా చీపురుపల్లి అభ్యర్థిగా పోటీ చేయించాలనే అధిష్టానం భావించడమేనని కొందరు చెబుతుండగా.. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో గంటా శ్రీనివాసరావు పేరు లేకపోవడం పొమ్మనలేక పొగ పెట్టడమేనని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు.
అడకత్తెరలో పోక చెక్క..
గంట శ్రీనివాసరావు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కల తయారైంది. ఓవైపు అధిష్టానం ఆదేశం.. మరోవైపు మనోభీష్టం.. ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గంట శ్రీనివాసరావు పొరుగు జిల్లాలో పోటీ చేయనని చెబుతూనే అధిష్టానం ఆదేశానికి కట్టుబడతానంటూ వ్యాఖ్యలు చేయడం పరిస్థితి అయోమయానికి దారితీసింది.
అయితే గంటా శ్రీనివాసరావు తొలినుంచి తాను సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం గాని, గతంలో ఎమ్మెల్యేగా చేసిన భీమిలి లో గాని పోటీ చేయాలని భావించారు. అయితే అధిష్టానం వేరేగా ఆలోచించడంతో కొంత మనస్థాపానికి గురవుతున్నారు. జిల్లాలో ఎక్కడైనా గెలిచే దమ్మున్న నాయకుడిని వేరే జిల్లాకి తరలించడం ఎంతవరకు సబబు అంటూ గంటా అనుయాయులు వాపోతున్నారు. ఈ నిర్ణయం పై అధిష్టానం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story