బాబు ప్రభుత్వంలో వారికి స్వాతంత్ర్యం: మాజీ మంత్రి కాకాణి
x

బాబు ప్రభుత్వంలో వారికి స్వాతంత్ర్యం: మాజీ మంత్రి కాకాణి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్లపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రారంభించిన అన్న క్యాంటీన్లపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న క్యాంటీన్ల నిర్వహణను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న క్యాంటీన్లను విరాళాలతో నిర్వహించడం సిగ్గు చేటంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలు హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటిని అమలు చేయడంలో తటపటాయిస్తున్నారని, ప్రజలను ఎలా మోసం చేయాలా అని ఆలోచిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అన్న క్యాంటీన్ల విషయంలో కూడా ఇదే పద్దతి అవలంభిస్తున్నారని, విరాళాలపై అన్న క్యాంటీన్లను నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒక వేళ విరాళాలు ఆగిపోతే అన్న క్యాంటీన్లు ఆగిపోతాయా అని, అప్పుడు పేదోడికి పట్టెడన్నం ఎవరు పడతారని అడిగారు. ఈ విషయంపై చంద్రబాబు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు. పేదోడి ఆకలితో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదని, వారి ఆకలిపై చేసే రాజకీయాలు పతనానికే దారి తీస్తాయంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వాటికి బ్రాండ్ అంబాసిడర్

అధికారం కోసం అడ్డగోలు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి అమలు గురించి ఎందుకు చెప్పట్లేదని నిలదీశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు చంద్రబాబు.. బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘ఆఖరికి ఈరోజు స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో భాగంగా ఇచ్చిన ప్రసంగంలో కూడా చంద్రబాబు తమ హామీల అమలు ప్రస్తావన తీసుకురాలేదు. వాటి ఊసు కూడా ఎత్తలేదు. ఈరోజు ప్రసంగంలోకి కూడా చంద్రబాబు కేవలం వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమమే పెట్టుకున్నారు. చంద్రబాబు విధానాలు ఇలానే ఉంటాయని ప్రజలకు మరోసారి క్లారిటీ వచ్చింది’’ అని విమర్శించారు.

చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలి

‘‘చంద్రబాబు ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలి. అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే విధ్వంసకర పాలన సాగిస్తున్నారు. ఈ రెండు నెలల్లో విధ్వంసం, హత్యలు తప్ప అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా. కూటమి గెలిచిన తర్వాత రాష్ట్రంలో హత్యలు చేసే వారికి స్వాతంత్ర్యం వచ్చింది. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతుంది. జగన్ హయాంలో సంక్షేమం ప్రజల చెంతకు వెళితే. ఇప్పుడు ప్రజలకు సంక్షేమ చింతనే మిగిలింది’’ అని అన్నారు.

రాజ్యాంగానికి విలువ శూన్యం

‘‘కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేకుండా పోతోంది. అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి హేయమైన చర్చ. 20 సంవత్సరాల తర్వాత గెలిచిన సోమిరెడ్డి.. ప్రజలకు మంచి చేయాల్సింది పోయే దోచుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికారం వచ్చి రెండు నెలలు అవుతున్నా ఆయన చేసిన పని ఒక్కటి కూడా లేదు. సోమిరెడ్డికి ఇన్నాళ్లూ చెవుడు అనుకున్నాం.. కానీ ఈ మధ్య పిచ్చి కూడా పట్టింది’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

Read More
Next Story