‘ప్రజలు తిరస్కరించిన పార్టీ వైసీపీ’.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా..
x

‘ప్రజలు తిరస్కరించిన పార్టీ వైసీపీ’.. పార్టీకి మాజీ మంత్రి రాజీనామా..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే వైసీపీకి మరో ఝలక్ తగిలింది. మాజీ మంత్రి, పార్టీలో కీలక నేత రావెల కిశోర్‌బాబు రాజీనామా చేశారు


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే వైసీపీకి మరో ఝలక్ తగిలింది. మాజీ మంత్రి, పార్టీలో కీలక నేత రావెల కిశోర్‌బాబు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అందించారు. ప్రజాసేవ కోసం ఎంతో తాపత్రయ పడిన తాను మతిభ్రమించిన ఆలోచన చేసి వైసీపీలో చేరానని, కానీ ఈరోజు తనకు అసలు వాస్తవం కళ్ళముందు కనిపించిందని చెప్పారు. అంతేకాకుండా ఈ సందర్బంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. టీడీపీ కూటమిపై ప్రశంసలు కురిపించారు. ఏపీ ఎన్నికలు 2024 ఫలితాలతో ప్రజలంతా ముక్తకంఠంతో తమ నిర్ణయాన్ని చెప్పారని తెలిపారు.

అవకాశం లభించలేదు..

ప్రజా సేవ చేయాలన్న తన తాపత్రయం చూసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనకు అద్భుతమైన అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన నాయకత్వంలో మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసుకునే భాగ్యం దక్కిందన్నారు. ‘‘కానీ దురదృవశాత్తు కొన్ని కారణాల వల్ల టీడీపీ పార్టీని వీడాల్సి వచ్చింది. ఆ రోజు పార్టీ వీడిన మరుక్షణం నుంచి ఆ అంశంపై ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా. ఆ తర్వాత అనేక సార్లు తిరిగి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలేవీ సఫలీకృత్వం కాలేదు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరాను’’ అని టీడీపీతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.

ప్రజలు తిరస్కరించిన పార్టీ వైసీపీ

‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికం అన్న కల వైసీపీతోనే సాధ్యమని భ్రమించి ఈ పార్టీలో చేరాను. ఆ పార్టీని ప్రజలు ఛీ కొట్టారు. అందుకు ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు నమ్మారు. అందుకే కూటమికి చారిత్రాత్మక విజయం అందించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఓ పక్క సమాజసేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణకు నా వంతు ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే వైసీపీకి రాజీనామా చేశాను’’ అని తన రాజీనామాకు అసలు కారణం బయటపెట్టారు.

టీడీపీ బాట పట్టడానికేనా..

ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు చంద్రబాబుపై ఆయన ప్రశంసలు వర్షం కురిపించడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో చిత్తయిన వైసీపీని వీడి మళ్లీ టీడీపీ గూటికి చేరాలని కిశోర్ ఆలోచిస్తున్నారా? అందుకే కూటమి, చంద్రబాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారా? ఇప్పటికే టీడీపీ వర్గాలతో మంతనాలు చేస్తున్నారా? గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నారా? అన్న అనుమానాలు అధికం అవుతున్నాయి. మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో చూడాలి.

Read More
Next Story