వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. కారణం అదేనా!
x
Source: Twitter

వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా.. కారణం అదేనా!

మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కుమారుడు అశోక్.. వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అనివార్య కారణాల వల్లే పార్టీ వీడుతున్నామంటూ రాజీనామా లేఖను జగన్‌‌‌కి పంపారు.


ఎన్నికలకు ఆంధ్ర సన్నద్ధమవుతున్న వేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఒకరు వెళ్లారన్న ఆలోచన కూడా ముగియకముందే మరో నేత రాజీనామా అంటూ పార్టీ అధిష్టానానికి షాకిస్తున్నారు. దీంతో వైసీపీ హైకమాండ్ ఏం చేయాలో అర్థం కాక జుట్టుపీక్కుంటుంది. తాజాగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమారుడు అశోక్ కూడా వైసీపీని వీడుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను పార్టీ అధినేత జగన్‌కు పంపారు.

కూతురు యామినీ బాల రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే తల్లీ, సోదరుడు కూడా పార్టీని వీడటం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. అసలు ఇంతమంది నేతలు వైసీపీని ఎందుకు వీడుతున్నారన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. దానికి తోడు సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ రావు కూడా వైసీపీని వదిలి పెట్టాలని యోచనలో ఉన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే తాను అనివార్య కారణాల వల్లే పార్టీని వీడుతున్నానని శమంతకమణి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇన్నాళ్లూ లేని కారణాలు ఎన్నికల ముందే ఏమొచ్చాయని పార్టీ వర్గాల్లో సందేహాలు రేకెత్తుతున్నాయి.

శమంతకమణి నేపథ్యం

కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన శమంతకమణి.. 1980లో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి జయరాం చేతిలో 14,212 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అక్కడి నుంచే పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బీసీ గోవిందప్ప మీద 7,079 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి మంత్రి పదవి అందుకున్నారు. మంత్రి పదవిలో ఆమె 1991 వరకు మాత్రమే కొనసాగారు.

ఆ తర్వాత 1994 ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన ఆమె మరోసారి టీడీపీ అభ్యర్థి జయరాం చేతిలో 47,198 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2004 ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థిగా శింగనమల నుంచి పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథ్ చేతిలో 8,586 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2009లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కాకపోతే శైలజానాథ్ మెజార్టీ మాత్రం 3,175 ఓట్లకు క్షీణించింది.

2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. శమంతకమణి కూతురు యామిని బాలకు శింగనమల నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో యామినీ బాల.. వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిపై 82, 095 ఓట్ల మెజార్టీతో శింగనమల నియోజకవర్గంపై టీడీపీ జెండాను రెపరెపలాండించారు. 2019లో వీరికి అవకాశం దక్కలేదు. దాంతో 2020 మార్చి 18న ఆమె సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందని భావించిన వారికి ఈ సారి కూడా భంగపాటే ఎదురైంది. దాంతో వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవలే వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.

శమంతకమణి దారెటు

వైసీపీకి రాజీనామా చేసిన శమంతకమణి, యామినీ బాల, అశోక్ ఇప్పుడు ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొందరు శమంతకమణి తన సొంతగూడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, యామినీ బాల మాత్రం తన సొంత గూడు టీడీపీ వైపు అడుగులు వేయాలని భావిస్తున్నారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. మరి తల్లీకూతుళ్లు ఇద్దరూ ఒకే పార్టీలో చేరతారా లేకుంటూ వేరు వేరు పార్టీల్లో చేరి ప్రత్యర్థులు అవుతారా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి.

ఇంతలో ఒకవేళ శమంతకమణి, యామినీ బాల వేరు వేరు పార్టీల్లో చేరితే అశోక్ దారెటు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. విశ్లేషకులు మాత్రం ముగ్గురూ ఒకే పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆంధ్ర రాజకీయ సమీకరణాలను బట్టి చూస్తే.. ఇప్పటివరకు వైసీపీని వీడిన అసంతృప్తి నేతల తరహాలోనే వీరు కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.

అంతేకాకుండా స్వతంత్రులుగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నపై కూడా విశ్లేషకులు స్పందించారు. శమంతకమణి ట్రాక్ రికార్డ్ చూస్తే ఓటములే ఎక్కువగా ఉన్నాయని, యామినీ బాల ఒక్కసారి పోటీ చేసి విజయం సాధించినా మరోసారి టికెట్ ఇవ్వడానికి టీడీపీ వెనకడుగు వేసిన అంశాలను వారు గుర్తు చేశారు. వీటి ప్రకారం చూసుకుంటే వారు స్వతంత్ర అభ్యర్థులుగా శింగనమల బరిలో నిలబడకపోవచ్చు అని వారు అంటున్నారు. మరి శమంతకమణి, యామినీ ఏం చేస్తారో చూడాలి.



Read More
Next Story