‘వారికి దేవుడే బుద్ధి చెప్పాలి’.. ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి
తన రాజీకాయల కోసం దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారికి ఆ దేవుడే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సిదిరి అప్పల్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
తన రాజీకాయల కోసం దేవుడిని అడ్డుపెట్టుకుని, కోట్లాది మంది మనోభావాలతో ఆటలాడుతున్న వారికి ఆ దేవుడే బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన క్రమంలో మాజీ మంత్రి వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈరోజు ఆయన మందసలోని వాసుదేవ పెరుమాళ్ళ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా తాను దేవుడిని ఒక్కటే కోరుకున్నానని, దేవుడిని అడ్డుకుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ప్రార్దించానని ఆయన చెప్పుకొచ్చారు. తన పొలిటికల్ మైలేజీ కోసం, తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడాని తిరుమల ప్రసాదాన్ని అవమానించేలా చంద్రబాబు వ్యాఖ్యానించారని మండిపడ్డారు మాజీ మంత్రి. ఆయన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, నిజంగానే అంతటి అపచారం జరిగి ఉంటే రిపోర్ట్ వచ్చిన రెండు నెలల వరకు ఎందుకు బయట పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. దేవుని చుట్టూ రాజకీయాలు జరగడం కొత్తేమీ కాదని, కానీ దేవుడిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేయడం మాత్రం ఇదే తొలిసారి అని, రాజకీయ లబ్ధి కోసం ఒక వ్యక్తి ఇంత దిగజరాడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శలు గుప్పించారు.
ఈవో తీరు అనుమానకరం
‘‘చంద్రబాబు, నారా లోకేష్.. శ్రీవారి పవిత్రతకు భంగం కలిగించేలా మాట్లాడారు. ఎప్పుడూ కనివినీ ఎరుగని రీతిలో వ్యాఖ్యానించారు. శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు, చేపల నూనె ఉందంటూ వారు ఏదో రిపోర్ట్‌నుచూపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా టీటీడీ ఈవో శ్యామలరావు మాత్రం మౌనం పాటించడం, ఈ విమర్శలపై నోరు మెదపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈవో ఏమో కల్తీ జరిగిన మాట వాస్తవమే అంటున్నారు తప్ప. కొవ్వు కలిసిందని చెప్పడం లేదు. ఆఖరికి చంద్రబాబు చెప్తున్న ఎన్‌డీడీబీ రిపోర్ట్ కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్పు కావొచ్చని చెప్తున్నా.. చంద్రబాబు మాత్రం రిపోర్ట్ అక్షర సత్యంలా మాట్లాడుతున్నారు. ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందే’’ అని డిమాండ్ చేశారు.
నాణ్యత లేని సరుకు కొత్తేమీ కాదు..
‘‘వైసీపీ ప్రభుత్వ హయాంలో తమిళనాడుకు చెందిన అగ్రి ఫుడ్ సంస్థ శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిని సరఫరా చేయడానికి టెండర్ దక్కించుకుంది. టెండర్ దక్కించుకున్న కంపెనీలు శ్రీవారి ప్రసాదానికి వాడే నెయ్యిని సరఫరా చేయడం అనేది ఆనవాయితీ. ప్రసాదానికి వాడే ఏ ముడి సరుకులు అయినా ఎన్ ఏ బి ఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్ సర్టిఫికేషన్ జరిగిన తరువాతే శ్రీవారి పుణ్యక్షేత్రానికి చేరుకుంటాయి. అవి చేరుకున్న తరువాత కూడా టీటీడీకి సంబంధించిన ల్యాబ్స్‌లో పరీక్షల అనంతరమే వాటిని ప్రసాదానికి ఉపయోగిస్తారు. ఈ సందర్భంలోనే జూన్ నెలలో వచ్చిన నాలుగు ట్యాంకుల నెయ్యి నాణ్యత లేనిదని టీటీడీ ల్యాబ్స్ నిర్ధారించిన తర్వాత వాటిని వెనుకకు పంపించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఇదేవిధంగా 18 ట్యాంకులను నాణ్యతలేని నెయ్యగా పరిశీలించి వెనుకకు పంపించడం జరిగింది. నాణ్యతలేని ముడి సరుకులు వెనుకకు పంపించడం వాటి స్థానంలో నాణ్యత గల ముడి సరుకులను తెప్పించడం అనేది టీటీడీలో సాధారణంగా జరిగే ప్రక్రియ’’ అని వివరించారు. ఇదే విషయాన్ని వక్రీకరించి చెప్తూ చంద్రబాబు.. శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి.
అందుకే ఈ రాద్ధాంతం..
‘‘ఇదే అంశంపై లోకేష్ మాట్లాడుతూ.. శ్రీవారికి అందించే నెయ్యి కాంట్రాక్ట్‌ను నందిని నెయ్యి కంపెనీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా ఈవో శ్యామల రావు కూడా.. టెండర్ దక్కించుకున్న సంస్థ కిలో నెయ్యి రూ.340కే ఇస్తానంటే ఆ నెయ్యి నాణ్యత గురించి ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అసలు కిలో నెయ్యిని రూ.340కి ఎలా సప్లై చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కిలో ఆవు నెయ్యి ధర కనీసం రూ.500 ఉంటుందని మాట్లాడుతున్నారు. వీరి మాటలు చూస్తుంటే త్వరలో వేసే టెండర్ ఎవరికి వెళ్లాలో అన్న విషయంపై ప్లాన్ రెడీ చేస్తున్నట్లు ఉంది. లోకేష్ చెప్తున్న నందిని నెయ్యి సంస్థ కేఎంఎఫ్ సంస్థకు అనుబంధ సంస్థగా ఉంది. హెరిటేజ్ సంస్థకు కూడా కేఎంఎఫ్ సంస్థ అనుబంధ సంస్థగా ఉంది. తాము కోరిన వారికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే వారు ఇలా చేస్తున్నారని వారి మాటలు చూస్తేనే స్పష్టం అవుతుంది. తమకు నచ్చిన సంస్థకు నచ్చిన రేటుకు కాంట్రాక్టు ఇవ్వడానికి ఈ రాద్ధాంతం అంతా చేస్తున్నారు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.