
జోగి రమేశ్ కి అరెస్ట్ నోటీసు ఇస్తున్న సిట్ అధికారులు
మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్, విజయవాడలో ఉద్రిక్తత
నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన సిట్ అధికారులు
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ మద్యం మంటలు రగులుకున్నాయి. కొద్దికాలంగా చడీచప్పుడు లేకుండా ఉన్న నకిలీ మద్యం తయారీ కేసు ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు నవంబర్ 2 (ఆదివారం) అరెస్ట్ చేశారు. ఆయనకు ముందుగా నోటీసులు జారీ చేసి, అనంతరం విచారణ కోసం పిలిచి అరెస్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
జోగి రమేష్‌ను విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఆయన సోదరుడు జోగి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీ, పంపిణీతో ఆయనకు సంబంధం ఉన్నట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్ధన్ రావు ఇటీవల ఒక వీడియోలో చెప్పారు. “మాజీ మంత్రి జోగి రమేష్ సూచనల మేరకు నకిలీ మద్యం తయారు చేశాను” అని సంచలన ఆరోపణలు చేశారు. ఆ వీడియో ఆధారంగా SIT దర్యాప్తు ప్రారంభించి, పలు ఆధారాలను సేకరించిన తర్వాత జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు
జోగి రమేష్ ఆగ్రహం
అయితే, జోగి రమేష్ తన అరెస్ట్‌ను అక్రమ చర్యగా అభివర్ణిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన అరెస్ట్,” అని ఆయన పోలీసుల ముందు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాను,” అని ఆయన అన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల ఆందోళన
జోగి రమేష్ అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు మాట్లాడుతూ – “ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోంది. జోగి రమేష్‌పై తప్పుడు కేసులు పెట్టి అవమానపరచడం రాజకీయ ప్రతీకారం తప్ప మరేమీ కాదు,” అని అన్నారు.
విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
ఆయన అరెస్ట్ సమయంలో కుటుంబ సభ్యులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. అంతా చట్టప్రకారమే చేస్తున్నట్టు తెలిపారు.
ఈ అరెస్ట్ రాజకీయంగా కలకలం సృష్టించింది. జోగి రమేష్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కాలంలో కీలక మంత్రిగా వ్యవహరించడమే కాకుండా, బలమైన ప్రాంతీయ నేతగా గుర్తింపు పొందారు.ఆయనపై ఇటీవల వచ్చిన అగ్రిగోల్డ్ భూముల కేసు, ఇప్పుడు నకిలీ మద్యం కేసు, టీడీపీ కార్యాలయంపై దాడి వంటి పలు కేసులు ఉన్నాయి.
మొత్తం మీద జోగి రమేష్ అరెస్ట్‌తో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది.
SIT విచారణ కొనసాగుతున్నప్పటికీ, ఇది కేవలం ఒక న్యాయ ప్రక్రియనా లేక రాజకీయ ప్రతీకారమా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Next Story

