కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రుల విమర్శల వరద..
x

కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రుల విమర్శల వరద..

ఆంధ్రప్రదేశ్‌ను వరదలు వణికిస్తున్నాయి. ఈ వరదల కారణంగా లక్షలాది మంది నిత్యావసరాలు సైతం అందక అల్లాడుతున్నారు. వారికి సహాయక చర్యలు అందించడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌ను వరదలు వణికిస్తున్నాయి. ఈ వరదల కారణంగా లక్షలాది మంది నిత్యావసరాలు సైతం అందక అల్లాడుతున్నారు. వారికి సహాయక చర్యలు అందించడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికి కూడా పలు ప్రాంతాల్లో వరద బాధితులకు సరైన వసతులు అందకపోవడంపై వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. వరద బాధితులకు సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్ సహా పలువురు ఇతర నేతలు సైతం కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా ఒక్కరు కూడా సహాయం కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూడలేదని పునరుద్ఘాటించారు. ఈరోజు నిర్వహించిన వైసీపీ పార్టీ అనంతరం మాజీ మంత్రులు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైందని, అన్ని అంశాలపై మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గొంతు ఇప్పుడు వరదలతొస్తే ఎందుకు మూగబోయిందంటూ ప్రశ్నిస్తున్నాు.




వరద మానవ తప్పిదమే: బొత్స

ఈ వరద బీభత్సం అంతా కూడా మానవ తప్పిదమేనని, నిష్టనివారణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ‘‘భారీ వర్షాలు వస్తాయిన ముందుగానే చంద్రబాబుకు తెలుసా? తెలియదా? వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా ఎందుకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. అసలు ఇరిగేషన్ శాఖ ఏం చేస్తోంది? ఇంత జరుగుతున్న ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యం. వరద బాధితులకు కనీసం భోజనం కూడా సరిగా అందడం లేదు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? అధికార యంత్రాంగం నిద్రపోతోందా? మీరు, మీ సలహాదారులు ఏం చేస్తున్నారు’’ అని ప్రశ్నలు గుప్పించారు.

‘‘వైసీపీ హయాంలో కూడా ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడు మేము వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాం. ఇప్పుడు వరదలు వస్తున్న ఎందుకు మానిటరింగ్ చేయలేకపోతున్నారు. అసలు ఎన్ని రిలీఫ్ క్యాంప్‌లు పెట్టారు. వాటిలో ఎన్నిటిలో సరైన సహాయం అందుతోంది. ఎంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బయటకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా’’ అని అడిగారు.

హోం మంత్రి ఏం చేస్తున్నారు: రోజా

‘‘సీఎం చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకోలేకపోయారంటే ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల వైఫల్యమే. హోంమంత్రి, విపత్తుల నిర్వహణ మంత్రి కనీసం ఈ విపత్తుపైన అయినా అధికారులను కానీ, ఇతర శాఖలను కానీ అప్రమత్తం చేశారా? ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా? ఆగస్టు నెల 29, 30 తేదీల్లో సీఎం సహా మంత్రులు అందరూ కూడా వీకెండ్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ 28నే ఐఎండీ హెచ్చరించినా సీఎం కానీ, హోంమంత్రి కానీ ఒక్కరంటే ఒక్కరైనా ఎలాంటి సమీక్ష అయినా చేశారా? మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారు? మంగళగిరిలో వర్షాలు కురిస్తే, విజయవాడలో వరద వస్తే ప్రజలను వదిలేసి హైదరాబాద్‌కు వెళ్లిపోతారా? మున్సిపల్ మంత్రి నారాయణ ఏం చేశారు? విజయవాడలో ప్రజలను ముంచేసింది ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదా? ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మంత్రి నారాయణ ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా? ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రామాలు చేయడం తెలుసు కానీ.. అధికారం వచ్చిన తర్వాత ఇంత పెద్ద వరద రానుందని మంత్రికి తెలియలేదా? జనాలను ముంచేస్తుందని తెలియదా? ఇంత జరుగుతుంటే ప్రజలను కాపాడటానికి బోట్లు కూడా సిద్ధం చేయలేదు. కానీ ప్రతి రోజూ తమ మీడియాల ముందు ఏదో తెలియని హడావుడీ చేయడం మాత్రం బాగా తెలుసు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.




చంద్రబాబు మాటలు హాస్యాస్పదం: కాకాణి

‘‘చంద్రబాబు వేస్ట్.. జగన్ బెస్ట్ అని వరద బాధితులు అంటుంటే బాబు కడుపు మండిపోతోంది. ఇప్పుడు ప్రజలకు సహాయం అందకపోవడానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే కారణం అని బాబు అనడం హాస్యాస్పదం. చంద్రబాబు తన వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికి పచ్చ మీడియా చేత బాబు అబద్ధాలు చెప్పిస్తున్నారు. రాష్ట్రంలో విపత్తును ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు సహా కేబినెట్ మంత్రులు అంతా పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా జరిగాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ అని చెప్పుకునే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు? ప్రజలు కష్టాల్లో ఉంటే డిప్యూటీ సీఎం ఎక్కడికి పోయారు? ఎక్కడా కనిపించడం లేదే? ఎక్కడా మాట్లాడటం లేదే? ప్రజలకు ఏమైనా సహాయం చేయడానికి రాలేదే?’’ అని ప్రశ్నలు గుప్పించారు.

Read More
Next Story