‘అధికారం ఉందని అహంకారమొద్దు’.. ఎమ్మెల్యేకు ద్వారంపూడి లేఖ
x

‘అధికారం ఉందని అహంకారమొద్దు’.. ఎమ్మెల్యేకు ద్వారంపూడి లేఖ

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం పాల్పడిన అవినీతి, అక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సీఎం, మంత్రులు పలు సందర్భాల్లో వెల్లడించారు.


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం పాల్పడిన అవినీతి, అక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సీఎం, మంత్రులు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆ దిశగా చర్యలు కూడా చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఏడు శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. ఆఖరికి పౌరసరఫరాల్లో కూడా గత ప్రభుత్వ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ స్కాప్‌పై దృష్టి పెట్టారాయన. కాకినాడ పోర్ట్ కేంద్రం రేషన్ బియ్యం భారీ మొత్తంలో అక్రమంగా రవాణా చేయబడుతుందని నాదెండ్ల వెల్లడించారు.

ఈ రేషన్ మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంతో పాటు కొందరు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. రేషన్‌ బియ్యం మాఫియాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ అవినీతి భారీగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. గత ప్రభుత్వం కాకినాడ పోర్టును అక్రమ బియ్యం ఎగుమతులకు అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్‌ మాఫియాను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టుకు సమీపంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రూ. 159 కోట్ల విలువైన 35,404 టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశామని వివరించారు. ఆయనతో పాటుగా రేషన్ అక్రమాల్లో నలుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని తమకు తెలిసిందని తెలిపారు. ముందుగా వారి పాత్రపై సమగ్ర, శాఖా పరమైన విచారణ చేపడతాం అని ఆయన వివరించారు. వారి పాత్ర ఉన్న మాట వాస్తవమే అయితే చట్టప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ద్వారంపూడిపై ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు కాకినాడ ఎమ్మెల్యే కొండ బాబు. దాంతో పాటుగా ద్వారంపూడి అవినీతిపై విచారణకు ఆదేశించాలని కోరడానికి చంద్రబాబును కలవడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే కొండ బాబుకు ద్వారంపూడి లేఖ రాశారు.

యాక్షన్‌లోకి ద్వారంపూడి

తనపై తీవ్ర ఆరోపణలు వస్తున్న క్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. తనపై వస్తున్న ఆరోపణలపై కౌంటర్ ఎటాక్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కాకినాడ ఎమ్మెల్యే కొండ బాబుకు బహిరంగ లేఖ ఒకటి రాశారు. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలను ప్రేరేపించే విధంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నేతలే టార్గెట్‌గా తప్పుడు కేసులు బనాయించడం ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ‘‘అధికారం ఉంది కదా అని అహంకారంతో వ్యవహరించడం సరికాదు. మాపై మోపుతున్న కేసులను చట్టబద్దంగా ఎదర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఎటువంటి బియ్యం వ్యాపారం చేయట్లేదు. మీరు చేపడుతున్న చర్యల వల్ల దాదాపు 30 వేల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బదిలీల్లో ఎంత అవినీతి జరిగిందో త్వరలోనే బయటపెడతా. ఆరు నెలల తర్వాత అవినీతి అక్రమాలపై స్పందిస్తా’’ అని ఆయన తన లేఖలో రాసుకొచ్చారు. ఆయన రాసిన ఈ లేఖ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంటా హాట్ టాపిక్‌గా మారింది.

Read More
Next Story