వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌కు రిమాండ్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యేల బాగోతాలు బయటపడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరిగా జైలుకు వెళ్తున్నారు. ఇటీవల మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తర్వాత ఇప్పుడు కొడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తన ఇంట్లో పని చేసే బాలికతో ఆయన పలు మార్లు అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో బాలిక, ఆమె సంబంధీకులు ఎన్నిసార్లు పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోలేదు. సదరు ఎమ్మెల్యే.. బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిన వీడియో ఒకటి ఎన్నికల సమయంలో వైరల్ కూడా అయింది. దానిపై తాజాగా పోలీసులు స్పందించారు.
సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
గతంలో జరిగిన ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో సదరు బాధితురాలు మరోసారి ధైర్యం చేసి ముందుకొచ్చి కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే చర్యలు చేపట్టిన పోలీసులు సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కోర్టు ముందు కూడా హాజరుపరిచారు. ఈ కేసుపై కోర్టులో వాదనల సందర్భంగా తమకు సుధాకర్ కస్టడీ అందించాలని, మరిన్ని వివరాల కోసం విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన అనంతరం ప్రొహిబిషన్, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సరోజమ్మ.. సుధాకర్‌కు 14 రోజు రిమాండ్ విధించారు.
నాలుగేళ్లుగా వేధించారు
‘‘మా అమ్మానాన్న.. సుధాకర్ ఇంట్లో పనిచేసేవారు. వారు ఏదైనా వేరే పనికి వెళ్లినప్పుడల్లా సుధాకర్ ఇంటికి నేనే పనికి వెళ్లేదాన్ని. అలా గత నాలుగేళ్లుగా వెళ్తున్నా. ఆ సమయంలో సుధాకర్ నన్ను అనేకసార్లు లైంగికంగా వేధించారు. ఆయన భార్య ఇంట్లో లేని సమయాల్లో మానసికంగా, శారీరకంగా కూడా హింసించేవారు. అశ్లీల చిత్రాలు చూపేవారు. ఆయన నిజస్వరూపాన్ని భయటపెట్టాలన్న ఉద్దేశంతో ఒకరోజు నేనే సెల్‌ఫోన్లు ఆయన వికృత చేష్టలను రహస్యంగా రికార్డ్ చేశాను. గతేడాది నేలాఖరు వరకు దాదాపు మూడేళ్ల పాటు ఆయన నన్ను లైంగికంగా వేధించారు’’ అని బాలిక తన మనోవ్యధను వెల్లడించింది.