మోదీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన జమిలి ఎన్నికల బిల్లును నెరవేర్చుకునేందుకు కూటమి భాగస్వామ్య పార్టీలతో పాటు వైఎస్‌ఆర్‌సీపీకి కూడా సమ ప్రాధాన్యత కల్పించింది.
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జమిలి బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో నలుగురు ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు చోటు లభించింది. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఒకరికి, టీడీపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి, బీజేపీ నుంచి ఒకరికి చోటు కల్పించింది. జేపీసీలో కూటమి భాగస్వామ్య పార్టీలతో పాటు అధికారం కోల్పోయిన వైఎస్‌ఆర్‌సీపీ కూడా సమ ప్రాధాన్యత కల్పించింది. వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ రాజ్య సభ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు లభించింది. ఈయనతో పాటు జనసేన నుంచి మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరీ, టీడీపీ నుంచి అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, బీజేపీ నుంచి అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌లకు జేపీసీలో చోటు కల్పించారు.
జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు కోసం పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రాజ్యసభ నుంచి 12 ఎంపీలకు చోటు కల్పించారు. వీరిలో వైఎస్‌ఆర్‌సీపీ రాజ్య సభ సభ్యులు విజయసాయిరెడ్డిని జేపీసీ సభ్యుడిగా నియమించారు. ఆ మేరకు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. లోక్ సభ నుంచి 21 మంది ఎంపీలను, రాజ్య సభ నుంచి 10 మందితో సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించారు. తర్వాత లోక్ సభ ఎంపీల సంఖ్యను 27కి, రాజ్య సభ ఎంపీల సంఖ్యను 12కి పెంచాలని నిర్ణయించారు. వీరిలో కూటమి ఎంపీలకు చోటు దక్కింది. ఈ కమిటీకి పీపీ చౌదరిని చైర్మన్‌గా నియమించారు. 31 మంది సభ్యులతో కూడిన జేపీసీ జాబితాను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
లోక్ సభకు, అసెంబ్లీకి ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని చాలా రోజుల నుంచి బీజేపీ పట్టుబడుతూ వస్తోంది. అయితే దీనిని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. దీని కోసం బిల్లును తీసుకొని రావాలని నిర్ణయించిన మోదీ ప్రభుత్వం మంగళవారం ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా అడ్డుకున్నాయి. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికే భంగం కలిగించే విధంగా ఉందని వ్యతిరేకించాయి. జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఈ బిల్లును ఆ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జేపీసీని ఏర్పాటు చేశారు. ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ పేరుతో నిర్వహించే జమిలి ఎన్నికల కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 129వ రాజ్యాంగ సవరణ బిలు(జమిలి ఎన్నికల బిల్లు)ను శుక్రవారం కమిటీకి పంపింది.
Next Story