తిరుమలలో దళారుల రాజ్యం...ఉచిత టికెట్ ఖరీదు రూ. 500..
x

తిరుమలలో దళారుల రాజ్యం...ఉచిత టికెట్ ఖరీదు రూ. 500..

ఔను..! తిరుమల శ్రీవారి దర్శన ఉచిత టికెట్‌ను కొందరు రూ. 500 మార్చేశారు. టీటీడీ అధికారులు తీసుకునే చర్యలకు పైఎత్తులు. దళారుల చేతిలో భక్తులు..


"తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకే ప్రధాన్యం" నిత్యం టిటిడి అధికారుల నోటి నుంచి వెలువడే మాటలు ఇవే. సామాన్య భక్తులకు ఉచితంగా స్వామి దర్శనం కల్పించాలని తీసుకుంటున్న నిర్ణయాలలో కూడా విభిన్న రూపాల్లో దళారులు దోపిడీకి తెర తీస్తున్నారు. టీటీడీ ఈఓగా ఏవి ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదేళ్లుగా తిరుమల క్షేత్రంలో దళారులను కట్టడి చేయడానికి అమలు చేసిన అనేక కార్యక్రమాలు ఫలించాయి. ఉచిత దర్శనం కోసం అమలులోకి తీసుకువచ్చిన టైం స్లాట్ టోకెన్లు దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇందులో ఇంటి దొంగల సహకారం ఉందనే వాదన తెరపైకి వచ్చింది.

సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు విఐపి సిఫారసు లేఖలకు ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు మధ్యతరగతి భక్తులకు కూడా ఆ తరహా దర్శనం కోసం రూ. 300 టికెట్లు ఆన్లైన్‌లో అందుబాటులో ఉంటాయి. విఐపి సిఫారసులపై రూ.500 టికెట్లు జారీ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు తిరుమలలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించడానికి పిఆర్వోలు కూడా ఉన్నారు. వీరికి తోడు ప్రధాన పత్రికలు, మీడియా ప్రతినిధులకు తిరుమలలో ఇప్పటివరకు కోటా నిర్దేశించారు. అది కూడా తిరుమలలో పనిచేసే జర్నలిస్టులకు అక్రిడేషన్ ప్రామాణికంగా విఐపి టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రధాన పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు రోజుకు ఐదు విఐపి టికెట్లు, మూడు గదులు కేటాయించే విధంగా దళారులకు ఆస్కారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అనేది సమాచారం. ఇంతవరకు ఈ వ్యవహారాలన్నీ సవ్యంగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ... అసలు వ్యవహారంలోకి వెళితే..

ఉచిత టోకెన్లపై దళారుల కన్ను

సామాన్య భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని ప్రధాన లక్ష్యంగా టీటీడీ టైం స్లాట్ టోకెన్లను ఉచితంగా జారీ చేస్తుంది. వీటిపై కన్నేసిన కొందరు దళారులు, టాక్సీ, ఆటోవాలాలు దోపిడీకి తెర తీశారు. ఉదయం 9 నుంచి 11 గంటలు, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య విఐపి బ్రేక్ ఉంటుంది. మిగతా సమయాల్లో సామాన్య భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్లు జారీచేస్తున్నారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం, రెండో సత్రం, ఆర్టీసీ బస్టాండ్, సమీపంలోని శ్రీనివాసం వసతి సముదాయ ప్రాంతంతో పాటు అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో కూడా సుమారు 25 వేల ఉచిత టైం స్లాట్ టోకెన్లు (ఎస్ ఎస్ డి) జారీ చేసే కేంద్రాలను టిటిడి ఏర్పాటు చేసింది. అలాగే తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి పాదాల మెట్టు సమీపంలో కూడా 3000 ఎస్ ఎస్ డి టోకెన్లు జారీ చేసేందుకు మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రద్దీ కొంచెం తక్కువ ఉంటుంది. ఆయా కేంద్రాలలో.. వేకువ జామున 4 గంటల నుంచి ఈ టిక్కెట్లు జారీ చేస్తారు. రద్దీ ఎక్కువ ఉన్న సమయాల్లో పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి లెక్కకు మించిన సంఖ్యలో వచ్చే భక్తులు ముందు రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి క్యూలో.. సేదతీరుతూ టికెట్ల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. వీరి అవసరాల్ని, ఆత్రుతను సొమ్ము చేసుకోవడానికి దళారులు కొత్త అవతారాలతో తెరపైకి వచ్చారు.

ఎలాగంటే...

విశాలమైన మైదానంలో యాత్రకు వచ్చే భక్తులు వాహనాలను అక్కడే పార్క్ చేసి భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ సమీపంలోని కేంద్రాల వద్ద వందల సంఖ్యలో బారులు తీరిన భక్తులను దళారులు టార్గెట్ చేస్తున్నారు. ఆన్లైన్ కోటలో టికెట్ దక్కని స్థితిమంతులు, ఆర్థికంగా మెరుగైన వారు కూడా ఉచిత టికెట్ల కోసం పోటేత్తుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆ భక్తుల అవసరాలు, ఆత్రుతను సొమ్ము చేసుకోవడానికి వివిధ వర్గాల దళారులు రంగంలోకి దిగారు. "మా ఆటోలో శ్రీవారి మెట్టు కేంద్రం వద్దకు తీసుకెళ్తాం. టికెట్‌కు రూ. 600 అవుతుంది" అని బేరం పెడుతున్నారు. ఆదివారం రాత్రి 11:30 నుంచి వేకువ జామున రెండు గంటల వరకు అక్కడే ఉన్న ఫెడరల్ ప్రతినిధికి ఈ వ్యవహారం కనిపించింది.

బేరసారాల అనంతరం పది, 15 మంది బృందంగా ఉన్న భక్తుల్లో ఒక్కొక్కరి నుంచి రూ. 500లకు బేరం కుదుర్చుకుని, తిరుపతి నగరం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ నుంచి శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కేంద్రం వద్దకు తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలోనే భక్తులు కనిపించారు. టికెట్లు జారీ చేసే సమయానికి అరగంట ముందు అక్కడ వినిపించిన మాటలు.. " ఆటోల్లో వచ్చిన యాత్రికులు రండి" అని అక్కడ టిటిడి ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది పిలవడం కనిపించింది. ఆటోల్లో అక్కడికి వెళ్లిన యాత్రికులకు గంట వ్యవధిలోనే ఉచిత ఎస్ఎస్.డి టైం స్లాట్ టోకెన్లు దక్కాయి. వారందరూ ఆనందంగా తిరిగి వెళుతుంటే, టోకెన్లు దక్కని యాత్రికులు సర్వదర్శనం కోసం ఉసూరుమంటూ తిరిగి వెళ్లడం కనిపించింది.

ఇందులో టిటిడి అధికారుల పాత్ర లేకపోవచ్చు. ఈ వ్యవహారాన్ని వారు ఊహించకపోయి ఉండవచ్చు. ఈ విషయంపై టీటీడీ అలిపిరి సెక్టార్ ఏవీఎస్ఓ (అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పి. రాజశేఖర్ మాట్లాడుతూ.. "వారాంతంలోనే కాదు, సాధారణ రోజుల్లో కూడా భూదేవి కాంప్లెక్స్ వద్ద ఉచిత టోకెన్ల కోసం రద్దీ ఎక్కువగా ఉంటుంది. మా సిబ్బంది నిత్యం ఎక్కడ యాత్రికుల రక్షణ, క్యూలో ఉన్న వారిని సామరస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు" అని ఏవిఎస్ఓ రాజశేఖర్ చెప్పారు. "యాత్రికులపై దళారుల వ్యవహారం దృష్టికి రాలేదు. ఈ విషయాన్ని నేనే స్వయంగా పరిశీలిస్తా. శ్రీవారి మెట్టు మార్గం సమీపంలో కౌంటర్ వద్ద టికెట్లు జారీ ప్రక్రియ వ్యవహారంలో ప్రత్యేక దృష్టి పెడతా" అని చెబుతున్న రాజశేఖర్, దళారుల విషయంలో సివిల్ పోలీసు జోక్యం అనివార్యమైందని అభిప్రాయపడ్డారు.

అలాగే శ్రీవారు మెట్టు ప్రాంతంపై జరుగుతున్న తీరును టీటీడీ విజిలెన్స్ ఉన్నతాధికారులతో మాట్లాడి, ఆ తర్వాత చంద్రగిరి సీఐతో చర్చించడానికి శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. ‘‘పూర్తి అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీవారి మెట్టు కేంద్రం వద్ద రాత్రిళ్ళు యాత్రికుల రద్దీని నియంత్రించే దిశగా అమలు చేయాల్సిన కార్యాచరణపై ఉన్నతాధికారులతో చర్చిస్తా" అని రాజశేఖర్ అంటున్నారు. ఉచిత సర్వదర్శనం టోకెన్ల జారీ వ్యవహారంలో అపసవ్య పరిస్థితికి దారి తీసిన అంశాల్లోకి వెళితే.. కొన్ని ఆర్జిత సేవా టికెట్ల జారీలో ఇంకొన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.

ఆన్లైన్ కోటా... కొందరికే పరిమితం

సామాన్య భక్తులకు కూడా వీఐపీల తరహాలో శ్రీవారి దర్శనం కల్పించడానికి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అందులో ప్రధానంగా రు. 300 టికెట్లు, ఆర్జిత సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ వంటి సేవల టికెట్లను టీటీడీ ఆన్లైన్‌లో రెండు లేదా మూడు నెలల ముందే విడుదల చేస్తుంది. అలాగే వసతి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా గదుల కోటా కూడా ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఆన్లైన్లో విడుదల చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు బుక్ అయిపోతున్నాయి. ఇందులో కూడా తిరకాసు లేకపోలేదనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యతరగతి, సంపన్న వర్గాల కోసం వీటిని అందుబాటులో ఉంచింది. సామాన్య భక్తులు కూడా ఈ టికెట్లను తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తిరుమలలో డిప్ పద్ధతిని కూడా అమలు చేస్తున్నారు.

ఆన్లైన్ కోట టికెట్ల విషయమై ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని కొమరోలుకు చెందిన రేణుక అనే భక్తురాలు మాట్లాడుతూ.. " కోటా విడుదల చేస్తారని సమాచారం టీవీలో పత్రికల్లో చూశాం. నిమిషాల వ్యవధిలోనే టికెట్లు అయిపోయినట్లు ఆన్లైన్లో సందేశం వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి పిల్లలతో కలిసి వచ్చాం" అని చెప్పారు. సాధారణ రోజుల్లో కూడా తిరుమలలో గదులు దొరకడం కష్టంగా ఉంటుంది. ఇందుకోసం భక్తులు తమ ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసి కౌంటర్లో ఇచ్చి వెళితే, దాదాపు గంట లోపల వాళ్ల సెల్ ఫోన్‌కు మెసేజ్ పంపడం ద్వారా గదుల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది.

సామాన్య భక్తుల కోసం..

సామాన్యులు, పేదలు కూడా శ్రీవారి దర్శనాన్ని సులభంగా చేసుకునేందుకు అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తుల కోసం టీటీడీ ఈవో డాక్టర్ కేవీ రమణాచారి ఉన్నప్పుడు ఉచిత టోకెన్లను అమలులోకి తీసుకువచ్చారు. అలిపిరి కాలిబాటలోని గాలిగోపురం వద్ద ఫోటోతో కూడిన టికెట్ జారీ చేసేవారు. మోకాళ్ళ పర్వతానికి ముందు నరసింహస్వామి ఆలయం వద్ద ఆ టికెట్‌పై ముద్ర వేసి పంపేవారు. ఆ టికెట్ ఆధారంగా దర్శనానికి అనుమతించేవారు. ఈ పద్ధతి తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం దుర్వినియోగం కాకుండా పేదలకు మాత్రమే అందుబాటులో ఉంచాలని ప్రధాన లక్ష్యం. అంతకుముందు నుంచే.. దాదాపు 25 ఏళ్ల క్రితం కృష్ణయ్య టిటిడి ఈవోగా ఉన్నప్పుడు సుదర్శనం కంకణాలను అమలులోకి తెచ్చారు.

రూ.50తో కంకణాలు అనే టికెట్లు అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత వాటిని ఉచిత టోకెన్లుగా మార్చారు. మొత్తం మీద సామాన్య భక్తులకు త్వరితగతిన తిరుమల శ్రీవారి దర్శనం కల్పించడానికి టిటిడి అధికారులు తీసుకుంటున్న చర్యలకు దళారులు పయెత్తులు వేస్తూనే ఉన్నారు. కాసుల పంట పండించుకుంటూనే ఉన్నారు. టీటీడీ యంత్రాంగం దీనికి విరుగుడుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటే కానీ దోపిడీకి తెరదించేందుకు ఆస్కారం లేదు.

Read More
Next Story