మంత్రుల పనితీరును చంద్రబాబు ప్రతిరోజూ స్కాన్ చేస్తున్నారు. ఇటీవలే వారి పనితీరుపై సర్వే నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ లో మంత్రుల పనితీరు ఎలా ఉంది. ప్రజలు వారిని మెచ్చుకుంటున్నారా? చీకొడుతున్నా? పరవాలేదని భావిస్తున్నారా? అనే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఎమ్మెల్యేల పని తీరుపై సర్వే నిర్వహిస్తూ మంత్రుల పనితీరుపైనా టెలిఫోన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో చాలా మంది మంత్రులు పదవులను ఎంజాయ్ చేస్తూ తాపీగా ఉంటున్నారనే రిపోర్టులు వచ్చాయి. దీంతో మంత్రుల పనితీరును నిత్యం పరిశీలిస్తున్నారు. మంత్రికి సంబంధించిన శాఖల సమస్యలే కాకుండా నిత్యం తన నియోజకవర్గ ప్రజల సమస్యలు కూడా పట్టించుకోవాలని మంత్రులకు ఇప్పటికే పలు మార్లు సూచించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు సూచనలు చేశారు.
జిల్లా ఇన్ చార్జ్ మంత్రులకు మరింత బాధ్యత
మంత్రులు సొంత నియోజకవర్గాలు, సొంత శాఖల గురించి మాత్రమే కాకుండా ఇన్ చార్జ్ లుగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. ప్రతి శనివారం ప్రజలకు అందుబాటులో పార్టీ కార్యాలయంలో మంత్రులు ఉండాలని వారికి సూచించారు. తాను కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రతి శనివారం తప్పకుండా ఉంటానని, ఇప్పటికే దానిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి రోజూ కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ కార్యాలయంలో అర్జీలు తీసుకుంటున్నందున పార్టీ కార్యకర్తల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతున్నాయని మంత్రులకు చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఉండటం వల్ల పార్టీ నాయకులకు కూడా ధైర్యం ఇచ్చిన వారు అవుతారని, ఇన్చార్జ్ జిల్లాల్లో ప్రధాన మైన సమస్యలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు.
సంఘటనలపై స్పందించండి
మంత్రులుగా మీకు సంబంధించిన శాఖల్లో కానీ, ఇన్చార్జ్ జిల్లాల్లో కానీ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని మంత్రులను ఆదేశించారు. అక్కడికక్కడే ఆ సమస్యపై మాట్లాడలని వారికి సూచించారు. కాండ్రవర్సీలకు పోకుండా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంత్రులు ఎప్పటికప్పుడు స్పందిస్తుంటే పనితీరు మెరుగు పడుతుందనే విషయం వారికి చెప్పారు. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అధికారుల నుంచి తెలుసుకోవాల్సి వస్తుందని, అలా కాకుండా పార్టీ నాయకత్వం ద్వారా వెంటనే వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. అందుకే మంత్రులుగా మీకు అక్కడి సంఘటనలపై మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లే వరకు మంత్రులు సైతం నోరు విప్పేవారు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదనే అభిప్రాయం ముఖ్యమంత్రి నుంచి వచ్చింది.
ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి..
గతంలో మాదిరి కాకుండా నేరుగా సంఘటనలు, సమస్యలను మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళుతున్నారు. వెంటనే ఆయన ఇస్తున్న డైరెక్షన్స్ ప్రకారం అడుగులు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హోం శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఆదేశాలు తీసుకుని పలు చోట్లకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. నేరుగా సంఘటన స్థలానికి వెళ్లి సమస్యను తెలుసుకోవడం వల్ల మంత్రుల్లో కూడా అవగాహన పెరుగుతుంది. అక్కడ ఏమి జరిగిందో అధికారుల నుంచే కాకుండా స్థానిక పార్టీ నాయకులు, ప్రజల నుంచి కూడా తెలుసుకునేందుకు వీలు కలుగుతోంది. దీని కారణంగా వారు ఎక్కడైనా సమస్య గురించి మాట్లాడేందుకు అవకాశం ఉంటోంది.
బాధ్యతల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారికి హెచ్చరికలు...
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వారికి ముఖ్యమంత్రి హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రతి అంశంపైనా స్పందించాలని చెప్పినా పట్టించుకోకుండా ఉంటున్న మంత్రుల పేర్లు చెప్పి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అందరి ముందు నేరుగా హెచ్చరించడంతో మిగిలిన మంత్రులు కూడా సెట్ రైట్ అవుతారనే భావనతోనే ఇలా చెప్పినట్లు సమాచారం. ఎక్కువ మంది మంత్రులు కొత్తవారే కావడం వల్ల వారికి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఉండదని, యువకులుగా ఉన్న వారు మంత్రులుగా ఉండటం మంత్రివర్గంలో ఇదే ప్రథమనని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాధారణ వ్యక్తుల మెదడు కంటే మంత్రుల మెదడు పది రెట్లు ఎక్కువ స్పీడ్ తో పనిచేయాలని మంత్రులకు సీఎం సూచించారని తెలిసింది.