మాక్ అసెంబ్లీలతో పిల్లలకు లోకేశ్ ప్రజాస్వామ్య పాఠాలు
x

మాక్ అసెంబ్లీలతో పిల్లలకు లోకేశ్ ప్రజాస్వామ్య పాఠాలు

లోకేశ్ ప్రతిపాదనను ఆమోదించిన అసెంబ్లీ, మంచి కార్యక్రమని స్పీకర్ ప్రశంస


బడి పిల్లలూ శాసనసభ మెట్లెక్కే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభ ముందు ఈ ప్రతిపాదన ఉంచడం సభ్యులు మద్దతు తెలపడం, స్పీకర్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు సందర్భంలో మంత్రి నారా లోకేశ్ ఈ మాక్ అసెంబ్లీ ప్రస్తావన తీసుకువచ్చారు. బడి పిల్లలను తీసుకువచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చట్టసభలు ఎలా నడుస్తాయో భావి తరాలకు తెలియాలంటే మాక్ అసెంబ్లీలు వంటివి అవసరం అన్నారు. సభా పద్ధతులు ఎలా నడుస్తాయో ప్రత్యక్షంగా చూపిస్తూ, చిన్నప్పటినుంచే ప్రజాస్వామ్య విలువలను పరిచయం చేయాలన్నది ఈ ప్రతిపాదన ఉద్దేశ్యమన్నారు. సభ్యులు హర్షధ్వానాలతో ఈ ప్రతిపాదనను స్వాగతించగా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా దీన్ని “ప్రజాస్వామ్యం లో ఇదో సరి కొత్త అధ్యాయం”గా అభినందించారు.

స్పీకర్ ఆమోదం పొందిన తర్వాత లోకేశ్ ఇంకో అడుగు ముందుకు వేసి సభలో స్పీకర్ ను ఎన్నుకుంటామని అన్నప్పుడు సభలో నవ్వులు విరిశాయి. పిల్లలతోనే ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.
ప్రజాస్వామ్యానికి కొత్త తరాన్ని సిద్ధం చేయడమే దీని ఉద్దేశం అన్నారు.
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం వరకే పరిమితం కాదు. అది ప్రశ్నించడం, వాదించడం, చట్టనిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకోవడం అనే అవగాహనతోనే బలపడుతుంది. కానీ ఈ అవగాహన మన విద్యా వ్యవస్థలో చాలా వరకు సిద్ధాంతంగా మాత్రమే మిగిలిపోతుంది.
మాక్ అసెంబ్లీలు ఈ ఖాళీని భర్తీ చేస్తాయి. పిల్లలు ప్రత్యక్షంగా అసెంబ్లీ వాతావరణంలో కూర్చుని చర్చలు వినడం, బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందే ప్రక్రియను గమనించడం ద్వారా పుస్తక పాఠాల కంటే ప్రత్యక్ష అనుభవం పొందుతారని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
అసలేమిటీ మాక్ అసెంబ్లీలు..
ప్రపంచవ్యాప్తంగా మాక్ పార్లమెంట్లకు విశేష చరిత్ర ఉంది. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కామన్వెల్త్ దేశాలు విద్యార్థుల కోసం మాక్ పార్లమెంట్ లు నిర్వహిస్తూ, వారికి నేరుగా సభ్యుల పాత్రలు అప్పగించి బాధ్యతలు నిర్వహించేలా చూడమని చెబుతుంటారు.
భారతదేశంలోనూ కొన్ని రాష్ట్రాలు విద్యార్థులను శాసనసభలోకి తీసుకువచ్చి ‘పిల్లల అసెంబ్లీ’ పేరుతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించిన అనుభవం ఉంది. కానీ అవి విడివిడిగా స్కూళ్లకే పరిమితమై సాగేవి. ఇటీవలి కాలంలో అవి కూడా జరగడం లేదు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నారా లోకేశ్ ప్రవేశపెట్టిన ప్రతిపాదనతో వ్యవస్థీకృతంగా మాక్ అసెంబ్లీలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.
దీనివల్ల విద్యార్థులకు పౌర అవగాహన పెరుగుతుంది. భవిష్యత్ ఓటర్లకు ప్రజాస్వామ్య విధానాలు అర్థమవుతాయి. విమర్శనాత్మక ఆలోచనా ధోరణి పెరుగుతుంది. ఒక సమస్యపై భిన్న అభిప్రాయాలు విని, తర్కించే శక్తి పెంపొందుతుంది.
నాయకత్వ లక్షణాలు అలవడతాయి. సభా చర్చలు ఎలా నడపాలి, ఎలా వాదించాలి అనే శైలి నేర్చుకుంటారు.
అవినీతి పట్ల అవగాహన పెరుగుతుంది. పారదర్శకతపై పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ప్రజలు ప్రశ్నించే ధైర్యాన్ని పెంపొందించుకుంటారు.
ఈ నిర్ణయం కేవలం ఒక విద్యా ప్రయోగం కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే పౌర శిక్షణ. చిన్న వయసులోనే సభా పద్ధతులను చూసిన పిల్లలు, భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా మారే అవకాశాలు పెరుగుతాయి. ఓటు హక్కు వినియోగించే సమయంలో వారు మరింత చైతన్యంతో నిర్ణయాలు తీసుకోగలరు.
మొత్తం మీద మాక్ అసెంబ్లీలు ఒకరోజు వినోదకరమైన అనుభవం మాత్రమే కాక, భవిష్యత్ భారత ప్రజాస్వామ్యానికి బలమైన పునాది కావచ్చు. అసెంబ్లీ గోడల మధ్య కూర్చున్న ఆ చిన్నారులలో రేపటి నాయకులు, రేపటి ఓటర్లు, రేపటి పౌరులు ఎలా ఉండాలనే దానిపై ఓ అవగాహన ఏర్పడుతుంది.
Read More
Next Story