పార్లమెంట్‌కు గతంలో పోటీ చేసిన జెడి లక్ష్మినారాయణ ఈ సారి ఎన్నికల్లో సొంత పార్టీ గుర్తపై అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.


సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ (జెడి లక్ష్మినారాయణ) దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. విశాఖపట్నం నార్త్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. సొంత పార్టీ అయిన జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి ఆయన పోటీలోకి దిగారు. విశాఖ నార్త్‌ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా కేకే రాజు, టీడీపీ, జనసేన, బిజెపీ కూటమి తరఫున బిజెపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రధాన పార్టీల నుంచి రంగంలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి లక్కరాజు రామారావు పోటీలో ఉన్నారు. అయితే సొంత పార్టీ జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన జేడీ లక్ష్మినారాయణ ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వొచ్చనే టాక్‌ కూడా స్థానికుల్లో ఉంది. దీంతో అటు కూటమి అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజు, ఇటు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కేకే రాజుల మధ్య ఓట్లు చీలే చాన్స్‌ ఉందని కూడా అంచనా వేస్తున్నారు.

పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీకి

తొలి నుంచి విశాఖపట్నం పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తానని లక్ష్మినారాయణ చెబుతూ వస్తున్నారు. అందులో భాగంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈ సారి కూడా పార్లమెంట్‌ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. తర్వాత కాలంలో ఆయన సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీని స్థాపించారు. అనంతరం తన ఆలోచనలు పార్లమెంట్‌ నుంచి అసెంబ్లీ వైపు మార్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో క్రియా శీలకంగా ఉండాలనే ఉద్దేశంతో అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకు విశాఖపట్నం నార్త్‌ అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకున్నారు. లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, ఇక్కడ కాపు ఓటర్లు అధికంగా ఉండటం, ఈ సారి ప్రధాన పార్టీ అభ్యర్థులిద్దరూ రాజుల సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, దీంతో కాపు మద్దతు తను లభిస్తుందని భావించిన లక్ష్మినారాయణ విశాఖపట్నం నార్త్‌ స్థానానికి మకాం మార్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ నియోజక వర్గంలో కాపులు, రాజులు, కాళింగలు ప్రధాన సామాజిక వర్గాలు. వీరిలో దాదాపు 40 శాతం వరకు కాపులు ఉంటే 20 శాతం రాజులు, మరో 25 శాతం వరకు కాళింగలు ఉంటారు. 2009లో ఈ నియోజక వర్గం ఏర్పడింది. ఆది నుంచి ఇక్కడ క్షత్రియులదే హవా. గంటా శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ గెలిచేంత వరకు రాజుల హవా కొనసాగింది. 2019లో సీన్‌ రివర్స్‌ అయ్యింది. గంటా రాకతో కాపులంతా ఏకమయ్యారు. దీంతో గంటాకు పట్టం గట్టారు. దాదాపు 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గంటా గెలుపొందారు. ఈ సారి కూడా ఇదే అంశం తనకు కలిసొస్తుందని లక్ష్మినారాయణ అంచనా వేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ప్రాణభయమంటూ పోలీసులకు ఫిర్యాదు

విశాఖ నార్త్‌ నుంచి బరిలోకి దిగిన లక్ష్మినారాయణ తన ప్రాణాలకు హాని ఉందని భయాందోళనల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన పోలీసులను ఆశ్రయించారు. విశాఖపట్నం సీపీ రవి శంకర్‌ అయ్యన్నార్‌కు ఫిర్యాదు చేశారు. ప్రాణ హానికి సంబంధించిన వివరాలను సీపీకి అందజేశారు. సీరియస్‌గా తీసుకున్న విశాఖనగర పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. లక్ష్మినారాయణను ఎవరు చంపాలని కుట్రలు పన్నుతున్నారనే దానిపై దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఎన్నికల సమయంలో తనకు ప్రాణ హాని ఉందని లక్ష్మినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.

లక్ష్మినారాయణ ఆస్తులు 11.81 కోట్లు

విశాఖపట్నం నార్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన లక్ష్మినారాయణ గురువారం ఆయన నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. తన ఆస్తులను కూడా ప్రకటించారు. రూ. 11.81 కోట్లు కుటుంబం ఉమ్మడి ఆస్తులు కింద ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిల్లో స్థిరాస్తులు రూ. 10.61 కోట్లు, చరాస్తులు రూ. 1.21 కోట్లుగా చూపించారు. రూ. 5.75 కోట్లు స్థిరాస్తులు, రూ. 84.83 కోట్లు చరాస్తులు ఆయన పేరుతోను, రూ. 4.86 కోట్లు స్థిరాస్తులు, రూ. 36.57 లక్షలు చరాస్తులు ఆయన భార్య ఊర్మిళ పేరుతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి కేసులు లేవని, తన పేరు మీద వాహనాలు కూడా లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే గత ఐదేళ్లలో లక్ష్మినారాయణ ఆస్తులు పెరిగాయి. 2019లో ఆయన కుటుంబ ఆస్తులు రూ. 8.6 కోట్లు ఉండగా, వాటిల్లో 7.33 కోట్లు చరాస్తులు, రూ. 1.27 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు నాటి అఫిడవిట్లో పేర్కొన్నారు.

1990వ బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి

జేడీ లక్ష్మినారాయణ 1990 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి. ఆయన పూర్తి పేరు వివి లక్ష్మినారాయణ. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీబీఐ కేసుల సందర్భంగా జేడీ లక్ష్మినారాయణగా ఫేమస్‌ అయ్యారు. 2018లో ఐపిఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చారు. తర్వాత రైతుల సమస్యలపై రాష్ట్రంలో పలు ప్రాంతాలను పర్యటించారు. 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా విశాఖపట్నం పార్లమెంట్‌ నుంచి పోటీ చేశారు. హోరా హోరీగా జరిగిన పోటీలో మూడో స్థానంలో నిలచారు. ఈ ఎన్నికల్లో దాదాపు 2.88లక్షలకుపైచిలుకు ఓట్లు లభించాయి. విశాఖ పార్లమెంట్‌ ప్రజలు ఆదరణ చూపినా గట్టెక్క లేక పోయారు. బిజెపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి పురందేశ్వరి నాలుగో స్థానంలో నిలచారు. ఈమెకు కేవలం 33వేల వరకు ఓట్లు వచ్చాయి.

Next Story