జేడీకి ప్రాణభయం ఎందుకు? బెదిరించిందెవరు?
x
Source: Twitter

జేడీకి ప్రాణభయం ఎందుకు? బెదిరించిందెవరు?

తనకు ప్రాణహాని ఉందంటూ జేడీ లక్ష్మీనారాయణ.. విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తను ఎవరి బెదిరింపులకు భయపడనని, కుటుంబీకుల కోసమే ఈ ఫిర్యాదని వివరించారు.



జై భారత్ పార్టీ అధ్యక్షుడు, జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణాపాయం ఉందంటూ శుక్రవారం విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నేరుగా ఫలానా వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని చెప్పకపోయినా ఆయన మాటలను బట్టి పరోక్షంగా వైసీపీ నేతల నుంచే భయం అనే ప్రచారం జరుగుతోంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి జై భారత్ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేస్తున్న ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని కుదిపేసిన కేసులను సీబీఐలో ఉండగా చూశానని, ఆ సమయంలో చాలా బెదిరింపులు వచ్చాయని అన్నారు. అప్పట్లో ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, రక్తంతో కూడా కంప్లైంట్ లెటర్ రాశామని, తర్వాత స్వచ్ఛందంగా సర్వీసు నుంచి బయటకు వచ్చేశానని చెప్పారు.


‘‘ఇప్పుడు నేను విశాఖ ఉత్తరంలో పోటీ చేస్తున్నాను. పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్‌కు శిక్షపడేలా చేశానని నా మీద కక్ష కట్టారు. ఇక్కడ ఆ వ్యక్తి కూడా ఎమ్మెల్యేగా నామినేషన్ వేశారు. మా కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడ్డారు. నాకు వచ్చిన ఇన్‌పుట్స్ ద్వారా సీపీని కలిసి ఫిర్యాదు చేశాను’’ అని చెప్పారు జేడీ. అంతటితో ఆగక ‘‘ఒక మీటింగ్‌లో మా గురువుని చాలా కష్టపెట్టారు. ఎలా అయినా నా అంతు చూస్తానని ప్రస్తావించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ఈ కుట్ర పన్నారు. సీపీ స్పందించి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను ఇంతవరకు సాధారణంగా సెక్యూరిటీ కోరుకోలేదు. నేను ప్రజల మనిషిని.. ఇప్పుడు కూడా నేను ఈ బెదిరింపులకు ఫిర్యాదు చేసే వాడిని కాదు.. మా కుటుంబ సభ్యులు చాలా ఆందోళన చెందడం వల్లే ఫిర్యాదు ఇవ్వాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బెదిరింపులకు సంబంధించి పోస్టులు చూశాను. తేలికగా వదిలేసే విషయం కాదు అనిపించింది కాబట్టి సీపీని కలిసి ఫిర్యాదు చేశాను. నాకు ఏదైనా జరగరాని నష్టం జరిగితే దానికి తప్పకుండా బాధ్యులు వాళ్లే’’ అని స్పష్టం చేశారు.



Read More
Next Story