జనసేన పార్టీలో చేరిన చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఇంకొక వైపు జిల్లా సీనియర్ నేత సికె బాబు టిడిపికి మద్దతు తెలిపారు. ఏంజరుగుతోందక్కడ?


సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కాదని విజయానందరెడ్డికి టిక్కెట్‌ ఇచ్చిన వైసీపీ

చిర్రెత్తిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరిక
టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు
వైఎస్సార్‌సీపీకి దిమ్మతిరిగిన వైనం
చిత్తూరు జిల్లా కేంద్రంలో టీడీపీకి మొదటి నుంచీ పట్టు ఉంది. ఎక్కువ సార్లు ఎంపీ స్థానం కూడా చేజిక్కించుకుంది. పార్టీని స్థాపించి జనంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ వెంట కాంగ్రెస్‌ క్యాడర్‌ నడిచింది. కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే, జిల్లా కేంద్రంలో బాగా పలుకుబడి ఉన్న నాయకుడైన సీకే బాబు కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటికీ ఆయన క్రేజ్‌ మాత్రం చిత్తూరు రాజకీయాల్లో తగ్గలేదు. సీకే బాబు అంటే అభిమానులెక్కువ. ఇపుడాయన జగన్ వ్యతిరేకంగా యాక్టివ్ అయ్యారు.
సీకే బాబు ఏం చేశారు..
పదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న సీకే బాబు ఒక్క సారిగా చిత్తూరు రాజకీయాల్లోకి తిరిగి వచ్చి సంచలనం సృష్టించారు. పైగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌రావును కలిసి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపులో నేను తోడుగా ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. సీకే బాబు రాజకీయాల్లో ఎన్నో మంచి సేవలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారని ఇప్పటి రాజకీయ నాయకులు వ్యాఖ్యానించడం విశేషం.
జనసేనలో చేరిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు
ఆదివారం సాయంత్రం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిసారు. తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు పవన్‌ కళ్యాణ్‌ కూడా పూర్తి మద్దతు నిస్తూ శ్రీనివాసులును పార్టీలో చేర్చుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఫొటో దిగారు శ్రీనివాసులు. శ్రీనివాసుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో వచ్చిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలతో ఆటబొమ్మలా ఆటాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా అంటూ వైఎస్సార్‌సీపీకి బుద్ధి చెప్పారు.
శ్రీనివాసులును సస్పెండ్ చేసిన వైసీపీ
జనసేన పార్టీలో ఆరణి శ్రీనివాసులు చేరారని తెలియగానే హడావుడిగా వైెఎస్సార్సీపీ చర్యలు తీసుకున్నది. ఆయనను వైఎస్సార్పీసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్ల ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తరువాత ప్రకటించడం విశేషం. సీఎం ఆదేశాల మేరకు శ్రినివాసులును సస్పెండ్ చేస్తున్నామని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఆ ప్రకటనలో శ్రీనివాసులు చేసిన తప్పేమిటో వివరిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటిస్తే బాగుండేదని పలువురు వైసీపీ నాయకులే వ్యాఖ్యానిండం విశేషం.
చిత్తూరు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు


రనఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరటం, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీ అభ్యర్థి జగన్మోహన్‌రావుకు మద్దతు తెలపడంతో టీడీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు మెరుగుపడ్డట్టే నని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీకే బాబు, గురజాల జగన్మోహన్‌రావు, జనసేన నాయకుడైన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిసి ఓట్లు అడిగే పరిస్థితి ఏర్పడింది. వీరంతా టీడీపీ అభ్యర్థి గెలుపుకు ప్రయత్నిస్తారు. జనసేన పొత్తుతో టీడీపీని బలపరుస్తున్నందున ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా టీడీపీ అభ్యర్థి గెలుపుకోసమే పనిచేస్తారు. దీంతో ఎవరు ఏమి చేసినా జగన్మోహన్‌రావు గెలుపు నల్లేరు మీద నడకేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామానికి వైఎస్సార్‌సీపీ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Next Story