తిరుపతి లడ్డూ వివాదంలో తమిళనాడు సంస్థకు కేంద్రం నోటీసులు..
తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి వివాదంపై దృష్టిపెట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ.. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థకు నోటీసులు ఇచ్చింది.
తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి వివాదంపై దృష్టిపెట్టిన కేంద్ర ఆరోగ్య శాఖ.. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడా చూసినా తిరుపతి లడ్డూ వివాదమే హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరూ ఇదే అంశంపై చర్చిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం ఒకవైపు భక్తులు, మనోభావాలు రంగుతో ఉంటే మరోవైపు రాజకీయ రంగుతో కూడా దుమారం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వివాదంపై కూటమి సర్కార్, విపక్ష వైసీపీ నేతల మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఆఖరికి తాము తప్పు చేస్తే రక్తం కక్కుకు చావాలంటూ కొందరు ప్రమాణాలు కూడా చేస్తున్నారు. ఇంతలో ఈ అంశంలో కేంద్ర ఆరోగ్య శాఖ జోక్యం చేసుకుంది. తిరుపతి ప్రసాదం కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది.. తప్పు ఎవరు చేశారని అంశం కాదని, కోట్ల మంది భక్తులు, హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమని మండిపడింది. అంతేకాకుండా లడ్డూ ప్రసాదంలో కల్తీ విషయంపై ప్రత్యేక విచారణ చేపట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాద తయారీ కోసం నెయ్యిని సరఫరా చేసే సంస్థల నుంచి నెయ్యి శాంపుళ్లను సేకరించి వాటిని పరీక్షించింది. ఈ క్రమంలోనే ఒక సంస్థకు నోటీసులు కూడా జారీ చేసింది.
ఏఆర్‌కు నోటీసులు..
నాలుగు సంస్థల నుంచి సేకరించిన నెయ్యి నమూనాలకు నాణ్యత పరీక్షలు నిర్వహించింది కేంద్రం. ఇందులో మూడు సంస్థ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించాయని కేంద్రం గుర్తించింది. కానీ తమిళనాడుకు చెందిన ఏఆర్ కంపెనీ మాత్రం నాణ్యత ప్రమాణాలను పాటించడంలో విఫలమైందని, ఆ సంస్థ నెయ్యి అంత నాణ్యంగా లేదని కేంద్రం తేల్చింది. దీంతో సదరు ఏఆర్ సంస్థకు ఫుడ్ స్టాండర్డ్స్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల తమ సంస్థ నెయ్యిపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఆర్ సంస్థ తీవ్రంగా ఖండించింది. ‘మీ రాజకీయాల కోసం మాపై విషప్రచారం తగదు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
విష ప్రచారం తగదు: ఏఆర్ డైరీ
‘‘ఏఆర్ డైరీ నుంచి జూన్, జూలై నెలలో నెయ్యి సరఫరా చేశాం. ఇప్పుడు టీటీడీకి మా సంస్థ నెయ్యి సరఫరా చేయడం లేదు. మేము 25 ఏళ్లుగా డైరీ సేవలు అందిస్తున్నాం. మా ఉత్పత్తులు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొలేదు. ఎక్కడా ఇలాంటి ఆరోపణలు కూడా మేము ఎదుర్కోలేదు. మాపై ఇటువంటి విషప్రచారం చేయడం తగదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది ఏఆర్ డైరీ. అంతేకాకుండా ఎన్‌ఏబీఎల్ గుర్తింపు పొందిన ఎస్ఎంఎస్ లాబొరేటరీ నుంచి తమ నెయ్యి నాణ్యంగా ఉందని తెలుపుతున్న ఓ నివేదికను కూడా విడుదల చేసింది ఏఆర్ డైరీ. కాగా టీటీడీ ల్యాబ్, ఎన్ఏబీఎల్-అక్రెడిటెడ్ ల్యాబ్ నివేదికలు రెండూ కూడా ఒప్పందంలో పేర్కొన్న విధంగా పరిమితుల్లోనే ఉన్నాయని సూచించాయి.
ఏ టైమ్ అయినా ఓకే: ఏఆర్
తమ ఉత్పత్తులో కల్తీ జరిగే అవకాశమే లేదని, ఎవరైనా ఎప్పుడైనా మా ఉత్పత్తులను పరీక్షించుకోవచ్చని ఏఆర్ డైరీ క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు లెని, కన్నన్ వ్యాఖ్యానించారు. ‘‘తిరుపతికి పంపే నెయ్యిని ముందుగా మా ల్యాబ్‌లో పరిశీలించి.. ఆ సర్టిఫికెట్లను సిద్ధం చేస్తాం. జూన్, జూలై నెలల్లో టీటీడీకి నెయ్యి పంపాం. ఇప్పుడు సరఫరా చేయడం లేదు. మా ఉత్పత్తులు అన్ని చోట్లా ఉన్నాయి. వాటిని ఏ సమయంలోనైనా తనిఖీ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి’’ అని వారు వివరించారు. దీంతో పాటుగానే తమ నెయ్యిని ఎన్‌డీడీబీలో పరీక్షించామని, ఎటువంటి కల్తీ లేదని రిపోర్ట్ స్పష్టం చేసిందని ఏఆర్ సంస్థ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేయడం కీలకంగా మారింది.