ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణస్వీకారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారంలోను, తర్వాత జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలోను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యారు. దీక్షా వస్త్రాలు ధరించి ఈ కార్యక్రమాలకు హాజరు కావడంతో పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖాగుప్తా ప్రమాణ స్వీకారోత్సవంలో గురువారం నాడు ప్రధాని నరేంద్రమోదీకి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మధ్య ఓ ఆసక్తికర, సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చూసి ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి, కరచాలనం చేశారు. దీక్షా వస్త్రాలతో ఉన్న పవన్ కల్యాణ్‌ను చూసి హిమాలయాలకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా అని పవన్ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అడుగగా.. హిమాలయాలు వెళ్లేందుకు ఇంకా సమయం ఉందని పవన్ కల్యాణ్ బదులివ్వడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరబూసాయి. దీంతో ఆ సభా వేదిక వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇదే విషయం మీద ప్రధాని మోదీకి, మీకు మధ్య ఏం సంభాషణ జరిగిందని జాతీయ మీడియా ప్రశ్నించగా హిమాలయాల విషయం జరిగిందని వెల్లడించారు.
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్‌లో ఎన్డీఏ పక్ష సమావేశం జరిగింది. అనంతరం ఎన్డీఏ నేతల అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరై బయటకు వస్తున్న సమయంలో జాతీయ మీడియాతో పవన్ కల్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నడుము నొప్పి నేటికీ బాధిస్తూనే ఉంది. అందుకే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేక పోయాను. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పని చేస్తామని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలని, నిబద్దతో తన మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
Next Story