గద్దె రామ్మోహన్‌కే విజయవాడ తూర్పు
సిట్టింగ్ టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు గట్టెక్కారు. ఈ సారి కూడా విజయవాడ తూర్పు స్థానం ఆయనకే ఖరారు చేసిన చంద్రబాబు.
జి. విజయ కుమార్
విజయవాడ తూర్పు టిడిపి అభ్యర్థి ఎంపికలో ఊహాగానాలకు తెర దించారు. ఈ సారి అభ్యర్థి మార్పు ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ సాగింది. రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేపై ప్రజల్లో సహజంగా వ్యతిరేకత వస్తుందని, ఇది పార్టీకి చేటు చేకూర్చుతుందని, దీంతో అభ్యర్థిని మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని పెద్ద ఎత్తున ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగింది. ఇక్కడ నంచి తప్పించి గన్నవరం నుంచి గద్దెను పోటీ చేయించాలనే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒకానొక సమయంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా రంగంలోకి దింపొచ్చనే టాక్ నడించింది. ఇది వరకు ఎంపిగా గెలవడం, జిల్లాలో సౌమ్యుడుగా పేరుండటం, అందరినీ కలుపుకొని పోయే నేతగా ముద్ర ఉండటంతో ప్రత్యర్థి, వైసిపి అభ్యర్థి కేశినేని నానిని ఎదుర్కోవడం సులువు అవుతుందని టిడిపి పెద్దలు ఆలోచనలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
అంతే కాకుండా జనసేన, టిడిపి పొత్తుల్లో జనసేనకు ఈ సీటును కేటాయిస్తారనే ప్రచారం కూడా సాగింది. మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి జనసేనలోకి వెళ్తారని, జనసేన అభ్యర్థిగా యలమంచిలి రవిని రంగంలోకి దింపుతారని ఆ మేరకు చర్చలు కూడా సాగుతున్నాయని, ఖారారే తరువాయని ప్రచారం జరిగింది. దీనికితోడు విజయవాడ తూర్పులో ఇది వరకు యలమంచిలి రవి పిఆర్‌పి నుంచి గెలుపొందడం, కాపు ఓటింగ్ ఎక్కువుగా ఉండటం, గత ఎన్నికల్లో కూడా జనసేనకు 30వేలకు పైగా ఓట్లు పోలవ్వడం వంటి అంశాల ఆధారంగా ఈ స్థానం యలమంచిలి రవికి కేటాయిస్తారని టిడిపి వర్గాలు కూడా భావించాయి. కానీ వీటన్నింటినీ పటా పంచలు చేస్తూ ఈ సారి కూడా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కే విజయవాడ తూర్పు టిడిపి స్థానం చంద్రబాబు ఖరారు చేయడం గమనార్హం.