ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఫలించిది. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడును బిజేపీ ఓన్ చేసుకుంది.


ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మ (ఎపిటిఎఫ్) ను బలపరిచారు. ఆ తరువాత జనసేన పార్టీ కూడా రఘువర్మకు పచ్చ జెండా ఊపింది. కూటమి తరపున రఘువర్మను బలపరుస్తున్నట్లు చెప్పినా బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్లింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పొత్తుల కంటే తమ మూలాలు ఎక్కడున్నాయో ఆ మూలాల నుంచి వచ్చిన వారిని గట్టెక్కించే పనిలో బీజేపీ ఉంది. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు లు కూటమి అభ్యర్థి రఘువర్మ అన్నారే తప్ప బీజేపీ వారు కూటమి అభ్యర్థి రఘువర్మ అని మొదటి నుంచీ చెప్పలేదు.

గాదెను బలపరిచిన బీజేపీ

ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా ఉన్న ఉపాధ్యాయులను కూడగట్టడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టీయూ తరపున పోటీ చేసిన డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడును బీజేపీ వారు బహిరంగంగానే బలపరిచారు. ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్న టీచర్లంతా కలిసి కట్టుగా నాయుడుకు ఓట్లు వేసి గెలిపించారు. రెండో ప్రాధాన్యతా ఓట్లతో గాదె గెలిచారు. ఆయన గెలుపు 365 ఓట్లతో సాధ్యమైంది. శ్రీనివాసులు నాయుడుకు వెంకయ్యనాయుడు, ఇతర బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఉపాధ్యాయుల్లో కూడా బీజేపీని అభిమానించే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఉత్తరాంధ్రలో పెరిగినట్లు బీజేపీ భావిస్తోంది. ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన గాదె శ్రీనివాసులు నాయుడు ను గెలిపించుకోవడం ద్వారా బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు వీలు అవుతుందని భావించిన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో గాదె గెలుపు సాధ్యమైంది.

మొత్తం 20791 ఓట్లు పోల్ కాగా అందులో 656 ఓట్లు చెల్లలేదు. గాదె శ్రీనివాసులు నాయుడుకు 12035 ఓట్లు వచ్చాయి.

ప్రభావం చూపని టీడీపీ, జనసేన

మొదటి నుంచీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఎన్నికల్లో పార్టీ జోక్యం చేసుకోవద్దని, వారి ఇష్టానికి వదిలేయాలని చెబుతూ వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీలో జరిగిన చర్చ ప్రకారం కూటమి బలపరుస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అలాగే జనసేన కూడా ప్రకటించింది. బీజేపీ వారు మాత్రం ప్రకటించలేదు. ఉపాధ్యాయ ఎన్నికల విషయంలో మూడు పార్టీల నాయకులు ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కేంద్ర బీజేపీ పెద్దల నుంచి క్లియర్ గా ఆదేశాలు ఉన్నాయని, అందుకే ఆమె పార్టీలోని ముఖ్యులతో సమావేశమైన బీజేపీని బలపరిచే ఉపాధ్యాయులను ఒక్కటి చేయగలిగారని చెబుతున్నారు. బీజేపీ వారు లోగుట్టుగా పావులు కదిపారు. బీజేపీ వర్మను బలపరుస్తున్నామని చెప్పలేదు. అలాగని శ్రీనివాసులు నాయుడును బలపరుస్తున్నామని బహిరంగంగా చెప్పలేదు. చాపకింద నీరులా బీజేపీ పనిచేసి నాయుడును గెలిపించుకుంది.

వర్మను దెబ్బతీసిన పీడీఎఫ్ అభ్యర్థి

ఏపీటీఎఫ్ అభ్యర్థిగా రంగంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఓటమికి కమ్యూనిస్టుల ఓట్లలో చీలిక రావడం కూడా ప్రధాన కారణం. కూటమి వర్మను బలపరుస్తున్నట్లు చెప్పటంతో ఒంటరిగా మూడు చోట్ల పోటీ చేసిన సీపీఎం వారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా విజయగౌరిని రంగంలోకి దించింది. యూటిఎఫ్ వారు సపోర్టు చేయకపోవడం, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఉపాధ్యాయులు వర్మ నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో వర్మ వంటరి అయ్యారు. కమ్యూనిస్టుల ఓట్లన్నీ తమకే వస్తాయని భావించిన వర్మకు యూటిఎఫ్ వారు సపోర్టు చేసే అవకాశం లేకపోవడంతో ఓటమి చవిచూశారు. ప్రస్తుత ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో ఉన్న వ్యతిరేకత కూడా వర్మ ఓటమికి కారణమని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధ్యాయులపై వేధింపులు తగ్గాయే కాని వరాలు మాత్రం ఇవ్వలేదనే అసంతృప్తి ఉపాధ్యాయుల్లో ఉందని కొందరు ఉపాధ్యాయ నాయకులు వ్యాఖ్యానించారు.

మూడో స్థానంలో విజయ గౌరి

సీపీఎం వారు రంగంలోకి దించిన ప్రోగెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) అభ్యర్థికి సీపీఎం అనుబంధ ఉపాధ్యాయ సంఘం యూటిఎఫ్ వారు పూర్తి మద్దతు ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చాలా తక్కువ పట్టు ఉంది. పీడీఎఫ్ అభ్యర్థి కొరెళ్ల విజయగౌరి మూడో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీపీఎం వారు పీడీఎఫ్ అనే పేరు పెట్టుకున్నారు. మూడో స్థానంలో ఉన్నా మంచిగానే ఓట్లు రావడంతో సీపీఎం కు కూడా ఉపాధ్యాయుల్లో మంచి పట్టు ఉందని నిరూపితమైంది.

Next Story