తిరుపతిలో 350 కుటుంబాలకు జీవం పోస్తున్న వినాయకుడి విగ్రహాలు
x
బొమ్మలకాలనీలో గణేషుడి విగ్రహానికి వాటర్ కలర్ వేస్తున్న వెల్లప్ప

తిరుపతిలో 350 కుటుంబాలకు జీవం పోస్తున్న వినాయకుడి విగ్రహాలు

మట్టి, మైదా, కాగితం గుజ్జుతో విగ్రహాన్ని తయారు చేయడంలో తమిళనాడు నుంచి వచ్చి న కుమ్మరి కళాకారుల నైపుణ్యం ఎలా ఉందంటే..


మధ్యాహ్నం 11.30 గంటలు. తిరుపతి సమీపంలోని బొమ్మల కాలనీ సందడి సందడిగా ఉంది. అక్కడ వినాయకులెందరో అవతరిస్తున్నారు. గణపతి దేవుడి చేతికి ఓ కళాకారిణి జయలక్ష్మి మెరుగులు దిద్దుతోంది. సమీపంలోనే మరొకరు మట్టితో వినాయకుడి రూపుదిద్దుతున్నాడు. ఆ పక్కనే వేలప్ప రంగులు అద్దుతున్నాడు. ఆ మూల రంగలతో హంగులతో మిలమిల మెరిసే ‘వినాయకుడు ప్రకాశంతంగా ప్రత్యక్షమయ్యాడా’ అన్నట్లు ఒక పూరిపూర్ణ విగ్రహం తయారైంది. దాని బరువు టన్ను దాకా ఉంటుంది. ఈయన ఎకో ఫ్రెండ్లీ గణేశుడు. ఈ విగ్రహం తయారు చేసేందుకు వారం రోజులు పట్టింది. నలుగురు కూలీలు పనిచేశారు. సంవత్సరంలో ఏడు నెలలు పనిచేసే ఈ కళాకారుల చేతిలో సుమారు 40 వేల విగ్రహాలు రూపుదిద్దుకుంటాయి. ఈవిగ్రహాల తయారు చేసేవారంతా బిసిలు, ఎస్సీలు.



తిరుపతి నుంచి చెన్నైకి తరలించడానికి లారీలోకి లోడింగ్

తిరుపతి సమీపంలోని మంగళం వద్ద 1970కి ముందు పది కుటుంబాలతో ఏర్పడిన బొమ్మల కాలనీ ప్రస్తుతం 350కి చేరింది. ఇదొక చిన్న పల్లెటూరును తలపిస్తుంది.

ఎకో ఫ్రెండ్లీ గణేషుడు
బొమ్మల కాలనీలో ఇపుడు తయారవుతున్నవన్నీ తెలికైన విగ్రహాలు. ఇపుడు ప్లాసర్ ఆఫ్ పారిస్ (పివొపి), ఇతర హానికరమయిన రంగులను కళాకారులు మానేశారు.వాటి వల్ల పర్యవరణానికి హాని ఉందని వస్తున్న సూచనలకు వాళ్లు స్పందించారు. పర్యావరణానుకూలమయిన విగ్రహాల తయారీకి సిద్ధమయ్యారు. ఇపుడు ముడిపదార్ఠాలు పూర్తిగా మారిపోయాయి. రంగులు కూడా హానకరమయినవి కావు. ఇలా తయారయిన విగ్రహం నీటిలో కరిగితే చేపలు, క్రిమికీటకాలకు ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన 10 అడుగుల వినాయక విగ్రహం టన్ను బరువు ఉంటుంది. అది కరగడం కష్టం. కరిగితే చెరువులు కలుషితమవుతాయి. ఈ కళాకారుల చేతిలో "బొమ్మల కాలనీ"లో ఊపిరి పోసుకునే ఉలిమొన తగలని ఈ విగ్రహం 30 కిలోలు ఉంటుంది. నలుగురు సునాయాసంగా మోసుకుని వెళ్ళవచ్చు. ఇలా వినాయకుడు తేలికపడ్డారు, సహజవర్ణాలతో మిలమిల మెరుస్తుంటాడు. . వీళ్ల బతులుకు బరువుగానే సాగుతున్నాయి. బొమ్మలకాలనీలో వినాయకుడి మెరుపులనుంచివెలుతురు ప్రసరించడం లేదు. వీళ్లు లేకుండా గణపతి అవతరించడం, గణపతి లేకుండా పండగ సంబరం లేదు. ఇలా అందరికి మెరుపులుపంచుతున్నతమ జీవితాల్లోకి వెలుతురు రావడం లేదని కార్మికులు ‘ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ తో చెప్పారు.
ఎకో ఫ్రెండ్లీ గణపతి
విగ్రహం తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) లేకుండా కాగితం గుజ్జు, మైదా పండి, కూరగాయలు ప్రధానంగా ఆలుగడ్డ ఎండబెట్టి పొడి చేస్తారు. ఆ తరువాత గుజ్జుగా మార్చి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తారు. వాటర్ కలర్ వాడడం ఈ బొమ్మల కాలనీలోని ప్రత్యేకత.
మట్టి కలపడం, రంగులు వేయడం, చెక్కపీటల తయారీలో కూలీలకు ఉపాధి కల్పిస్తున్న తిరుపతి సమీపంలోని బొమ్మల కాలనీ కథ ఇది.
తిరుపతి నగరంలో లీలామహల్ సర్కిల్ నుంచి కరకంబాడికి వెళ్లే మార్గంలో మంగళం వద్ద ‘బొమ్మలకాలనీ’ బోర్డు పెద్దగా కనిపిస్తుంది. ఎడమ పక్క అమ్మవారి ఆలయం లో భారీ విగ్రహం కాలనీలోకి స్వాగతం పలుకుతుంది. ఏటా వినాయకచవితి నాటికి రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది. వీళ్లవాట మాత్రమే చిటికెడే.
ఈ కళ ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగితే ..

మంగళం సమీపంలోని విఘ్నేశ్వర పేపర్ అండ్ టెర్రకోట బొమ్మల కాలనీ అసోసియేషియన్ ప్రతినిధి రాముడు చెప్పే మాట..
"మా నాన్నతయారు చేస్తుంటే ఆయనతో పాటు నేను నేర్చుకున్నా. మా తాత ఎస్. దాస్ కు 1982లో నంది అవార్డు దక్కింది. అవార్డు వచ్చిన తరువాత కాలనీకి ఒక రూపం వచ్చింది. వీళ్ల ప్రతిభని, పేదరికాన్ని ప్రభుత్వం గుర్తించి, ఇళ్లు మంజూరు చేసింది. అదే ఈ బొమ్మలకాలనీ," అని రాముడు చెప్పారు.
కుటీర పరిశ్రమగా..
బొమ్మలకాలనీలో వినాయకుడి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమగా మార్చేశారు. ఏటా జనవరి నుంచి బొమ్మల తయారీ ప్రారభం అవుతుంది. ఇక్కడ అడుగు నుంచి 18 అడుగుల విగ్రహాల వరకు రూపుదిద్దుకుంటున్నాయి.
ఇక్కడికి తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల నుంచి సుమారు 10 కుటుంబాలు 1970కి తిరుపతికి వచ్చాయి. మంగళం సమీపంలో రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని వినాయకుడి విగ్రహాలు తయారు చేయడం ప్రారంభించారు. ఒక అడుగు విగ్రహం నుంచి 18 అడుగుల విగ్రహాలను తయారు చేయడంలో వీరు నేర్పరులు. మొదట చిన్నపాటి మట్టి విగ్రహాలను తయారు చేయడం ద్వారా విక్రయాలు ప్రారంభించారు.
ఆ కుటుంబాల సంఖ్య ప్రస్తుతం 350 కుటుంబాలకు పెరిగాయి. ఐదు దశాబ్దాల కాలచక్రంలో వారి కుటుంబంలో పెద్దలు, పిల్లలు విగ్రహాల తయారీలో ఉన్నారు. పిల్లలకు చదువు చెప్పించే అలవాటు లేదు. బయటినుంచి ప్రోత్సాహం లేదు. కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ కాలనీలో విఘ్నేశ్వర పేరర్ అండ్ టెర్రకోట బొమ్మల కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సంఘం ప్రతినిధి రాముడు మూడో తరం వ్యక్తి. ఈయన తాత దాసు తమిళనాడు నుంచి వచ్చిన వారిలో మొదటి తరం కళాకారుడు
చిదంబరం సమీపంలోని శీర్గాయ్ నుంచి మొదట ఈ ప్రాంతానికి వచ్చిన రవిచంద్రన్ వారసత్వంగా బొమ్మలు చేస్తున్న మేలుమరుత్తూరు నుంచి వచ్చిన రవి ఇంకొందరు కుటుంబాల్లో వినాయకుడి విగ్రహాల తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్నారు. ఆ కుటుంబాల్లో పాండిచ్చేరి నుంచి వచ్చిన వైదీశ్వరన్ కూడా చేరారు. చిత్తూరు జిల్లాలో తమిళ భాష ప్రాచుర్యం ఎక్కువ. దీంతో బొమ్మల కాలనీలోని విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. అందుకు మరో కారణం ఇక్కడి బొమ్మలు పెద్దవిగా ఉన్నా, బరువు లేకపోవడం వల్ల కొనుగోళ్లు పెరిగాయి.
బరువు చాలా తక్కువ
సాధారణంగా 18 అడుగుల విగ్రహం టన్ను బరువు ఉంటుంది. కానీ బొమ్మల కాలనీలో కళాకారులు తయారు చేసే విగ్రహం తేలికగా ఉంటుంది. ఇది పర్యావరణానికి మేలు చేసేదే అని ఇక్కడి కళాకారులు చెబుతున్నారు.
"పర్యావరణాన్ని కాపాడాలనే ప్రభుత్వం సూచనలు పాటిస్తున్నాం" అని అసోసియేషన్ ప్రతినిధి రాముడు, మరో మహిళా కళాకారిణి భాగ్యలక్ష్మి చెప్పారు. పదో తరగతి, ఐటీఐ చదివిన సరళ, విజయ్ దంపతుల కొడుకులు ఆర్. కన్నన్, కదిరి వేల్ (iti) ఇవే విషయం స్పష్టం చేశారు. చెప్పారు.
విగ్రహం తయారీ కోసం ఇక్కడి కళాకారులు వినియోగించే పదార్ధాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అభినందించక తప్పదు కూడా. ప్లాస్టో పారిస్, చైనా రంగులు ఇక్కడ మచ్చుకు కూడా కనిపించవు.
బొమ్మల కాలనీ గణేశుడి విగ్రహాలు నిజ్జంగా పర్యావరణానికి మేలు చేసేవే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
1. మైదాపిండి,
2. కాగితాలు, కాగితం గుజ్జు
3. మైదా మావ్ (మైదా పిండి), ఆళ్వారి గడ్డ (ఆలు గడ్డ), స్వల్పంగా ముగ్గు పిండి.
4. ఆలుగడ్డ తొక్కలు తీసి, ఎండబెడతారు. ఎండిన తరువాత పిండి మార్చి గుజ్జుగా తయారు చేస్తారు.
5 చెక్కతో తయారు చేసిన పీఠం చుట్టూ, రంగులు కలపని పదార్థం అతికిస్తారు. ఆ తరువాత బొమ్మ తయారీ కోసం సిద్ధం చేసిన మైదాపిండి, ఆలుగడ్డ పొడి గుజ్జు, కాగితాలతో విగ్రహాన్ని సిద్ధం చేస్తారు.
పాండిచ్చేరి నుంచి వచ్చిన మొదటితరం కళాకారుల్లో పసుపులింగం మనువరాలు భాగ్యలక్ష్మి ఏమంటున్నారంటే..

"పస పిండి, ఆళ్వారి గడ్డ (ఆలుగడ్డ), ముగ్గు పిండితో విగ్రహం తయారు చేస్తాం. ఎండ బాగా కాస్తే, ఓ విగ్రహం మూడు రోజుల్లో సిద్ధం అవుతుంది. లేదంటే వారం పడుతుంది. జనవరి నుంచి విగ్రహాల తయారీ ప్రారంభిస్తాం. వినియకచవితి నాటికి 50 నుంచి 60 విగ్రహాలు తయారు చేస్తున్నాం" అని భాగ్యలక్ష్మి వివరించింది. "అడుగు నుంచి 20 అడుగుల విగ్రహాలు తయారు చేస్తుంటాం. దీనికి నా భర్త తోపాటు ఇంటర్ చదివే నాకొడుకు వైదీశ్వరన్ కూడా సహకారం ఉంటుంది" అని వివరించింది.
ప్లాస్టో పారిస్ పేరు ప్రస్తావించగానే,
"అది తప్పు సార్, మా బొమ్మల కాలనీ ఏర్పడక ముందే, మా నాయన, తాతల కాలంలోనే పిండి బొమ్మలు తయారు చేయాలని తీర్మానించారు. ఈ విగ్రహం నీటిలో నిమజ్జనం చేస్తే, చేపలు, క్రిమికీటకాలకు ఆహారంగా ఉపయోగపడుతోంది" అని భాగ్యలక్ష్మి చెప్పారు. బొమ్మల కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పర్యావరణం కోసమే విగ్రహాల తయారీ ఉండాలని నిర్ణయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
మా తాత చిన్నప్పది చిదంబరం సమీపంలోని శీర్గాయ్. మా నాన్న రవి మేలుమరుత్తూరు నుంచి మా నాన్న 1984లో తిరుపతికి వచ్చాడు. నేను ఇక్కడే పుట్టా. పెళ్లి అయిందని వాసంతి చెప్పారు.
"మా అన్న రవిచంద్రన్ మాతోనే ఉన్నాడు. నా కొడుకు ఇంటర్ చదివినా బొమ్మల తయారీలో ఉన్నాడు" అని వాసంతి తెలిపారు.

"3 నుంచి 11 అడుగుల ఎత్తు ఉండే విగ్రహాలు ఏడాదికి 150 తయారు చేయడానికి సుమారు ఐదు లక్షల ఖర్చు అవుతుంది. బ్యాంకు రుణాలు ఇస్తోంది" అని వాసంతి వివరించారు. ఖర్చులు పెరిగాయి. విగ్రహాల తయారీ, నిలువ ఉంచడానికి షెడ్డు అవసరం. దీనికోసం ఏడాదికి 90 వేల రూపాయలు అద్దె చెల్లించాల్సి వస్తోందని చెప్పారు.
రూ. 3 కోట్ల వ్యాపారం
మంగళం సమీపంలో తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడి కాలనీ ఏర్పాటు చేసుకుని, తయారు చేసే వినాయకుడి విగ్రహాల తయారీ ద్వారా ఏడాదికి మూడు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.
ఈ విగ్రహాలను తమిళనాడు నుంచి వచ్చిన వారు హోల్ సేల్ గా కొనుగోలు చేసి, లారీల్లో తరలిస్తున్నారు. కర్నాటక, తమిళనాడు తోపాటు రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు, కడప జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు.
తిరుపతి బొమ్మల కాలనీలో రూపుదిద్దుకునే వినాయకుడి విగ్రహాలు చిత్తూరు, కడప జిల్లాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడి వ్యాపారులు ముందుగానే ఆర్డర్లతో భారీగా విక్రమాలను తరలిస్తున్నారు.
"హోల్ సేల్ విక్రయాల కంటే రిటైల్ గా విక్రయిస్తేనే కాస్త గిట్టుబాటు అతుంది" అని బొమ్మల కాలనీ అసోసియేషన్ ప్రతినిధి రాముడు చెప్పారు. కాలనీలోకి ఫెడరల్ ప్రతినిధులు వెళ్లే సరికి కొందరు యువకులు కూడా వచ్చారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం గిరిజాకాలనీ నుంచి వచ్చినట్లు లక్ష్మీనారాయణ చెప్పారు.
"20 ఏళ్ల నుంచి ఇక్కడే విగ్రహం కొని తీసుకుని వెళతాం. ఈ విగ్రహం నీటిలో త్వరగా కరుగుతుంది. బరువు కూడా ఉండదు. పర్యావరణానికి చాలా చక్కగా ఉపయోగపడుతోంది" అని లక్ష్మీనారాయణ చెప్పారు.
కాలనీలో కొన్ని లారీలు కూడా కనిపించాయి. ఆ లారీల్లో వినాయకుడి విగ్రహాలు లోడింగ్ చేస్తుండడం కనిపించింది.
చెన్నై నగరానికి చెందిన లారీ డ్రైవర్ సెల్వం తమిళంలో ఏమన్నారంటే..

"ఈ విగ్రహాలను నేను చెన్నైకి తీసుకుని వెళుతున్నా. కొనుగోలు చేసిన వ్యక్తి చెన్నైలో ఉంటారు. ఏడాదికి నాలుగు లోడ్లు విగ్రహాలు తీసుకుని వెళతా. పది అడుగులు ఉన్న విగ్రహాలు ఒకోసారికి 25 నుంచి 30 విగ్రహాలు తరలిస్తుంటా" అని సెల్వం వివరించారు.
నగరంలో తయారు చేసే విగ్రహాలతో పోలిస్తే, తిరుపతిలోని విగ్రహాలకు చెన్నైలో ఆదరణ ఎక్కువ. డిమాండ్ కూడా ఉందని సెల్వం వివరించారు.
ఈ కాలనీలో కళాకారులు తాము జీవిస్తూ, కూలీలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు. మట్టి కలపడం, మైదా, కాగితం గుజ్జును తయారు చేయడంతో పాటు విగ్రహాలకు వాటర్ కలర్ వేయించడంలో వందలాది మంది కూలీలకు ఉపాధి దొరుకుతోంది.
విగ్రహం తయారీకి అవసరమైన చెక్క పీఠం తయారు ప్రధానమైంది. దీని కోసం ముగ్గురు వ్యక్తులు పెట్టుబడి పెట్టి, ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. దీర్ఘచతురాస్రాకారం, చతురస్రాకారంలో ఐదు అడుగుల నుంచి 18 అడుగుల విగ్రహం నిలపడానికి చెక్క పీటలు ఇక్కడే తయారు చేస్తున్నారు.
నేను సుబ్రమణ్యం ఆచారి వద్ద కూలికి పనిచేస్తున్నా అని గంగాధర నెల్లూరు నుంచి వచ్చిన షణ్ముగం 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధులకు చెప్పారు.
"జనవరి నుంచి వినాయక చవితి సమీపించే వరకు సీజన్ లో రెండు వేల పీటలు తయారు చేస్తా. నాతో కలిసి తిరుపతిలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన అశోక్ కూడా ఉంటారు" అని షణ్ముగం చెప్పారు. రోజుకు పది పీటలు మేకులు కొట్టి సిద్ధం చేస్తా. రూ. 900 ఆదాయం వస్తోంది. పని లేనప్పుడు ఇతర పనులకు వెళతా" అని షణ్ముగం వివరించాడు.
గురువు లేని శిష్యుడు
బొమ్మల కాలనీలో వినాయకుడి విగ్రహాలు రంగురంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఈ విగ్రహాలకు వాటర్ కలర్స్ మాత్రమే వాడుతున్నారు. హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చే రంగుల్లో 50 రకాలు రంగులు తయారు చేస్తున్నారు. కలర్ మిక్సింగ్ పెద్ద సబ్జెక్టు.

"మొదట బొమ్మలు చూసి, సొంత ఆలోచనతో ఈ రంగులు అద్దడం ప్రారంభించారు. నేటికీ అదే పద్ధతిలో వారసత్వంగా నేర్చుకున్నాం" అని వెల్లప్ప చెప్పారు. నా కొడుకు రాజేష్ కూడా నేర్పించాను. యంత్రాలు రావడంతో కంప్రెసర్ ద్వారా గ్యాస్ తో రంగులను తీర్చదిద్దుతూ వెల్లప్ప వివరించారు.
వినాయకుడి బొమ్మల తయారీకి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయడం తోపాటు ప్రభుత్వ పరంగా ఆసరా ఇవ్వాలని కళాకారులు కోరుతున్నారు.
Read More
Next Story